Fake News, Telugu
 

ఈ వీడియోలో కేదార్‌నాథ్ ఆలయం చుట్టు తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్నది కేదార్‌నాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది, నరేంద్ర మోదీ కాదు

0

ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. నరేంద్ర మోదీ తన 26వ ఏట రిషికేశ్‌లోని సాధువు దయానంద్ మఠంలో యోగా అభ్యసించారని, ఆ సమయంలోనే మోదీ ఇలా తలకిందులుగా  కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్ : నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ఆలయం చుట్టు తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం ): ఈ వీడియోలో కేదార్‌నాథ్ ఆలయం చుట్టు తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్నది కేదార్‌నాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది, భారత ప్రధాని నరేంద్ర మోదీ కాదు. ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డుని అమలులోకి తీసుకురావాలనే  ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ  సంతోష్ త్రివేది ఇలా తలకిందులుగా కేదార్‌నాథ్ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘శ్రీ కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం’ అనే ఫేస్‌బుక్ పేజీ 23 జూన్ 2021 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. కేదార్‌నాథ్ ఆలయ పూజారి శ్రీ సంతోష్ త్రివేది బాబా కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలని ఈ ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో మరికొంత మంది యూట్యూబ్ యూసర్లు కూడా 2021లో పోస్ట్ చేసారు. ఆ యూట్యూబ్ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

ఈ వీడియోని షేర్ చేస్తూ ‘ఈటీవీ భారత్’ వార్తా సంస్థ 21 జూన్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో చేతులపై తలకిందులుగా నిలబడి కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నది కేదార్‌నాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది అని ఈ ఆర్టికల్‌లో స్పష్టం చేసారు. ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డుని అమలులోకి తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతోష్ త్రివేది ఇలా తలకిందులుగా కేదార్‌నాథ్ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఉత్తరాఖండ్  చార్ ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డుకి సంబంధించి కేదార్‌నాథ్ అర్చకులు చేసిన నిరసనల గురించి ఇక్కడ, ఇక్కడ చదవచ్చు. 

ప్రధాని నరేంద్ర మోదీ స్వామి దయానంద సరస్వతి దగ్గర ఆధ్యాత్మిక శిక్షణ పొందినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఉత్తరాఖండ్లోని గరుడాచట్టి ప్రాంతంలో నివసించినప్పుడు రోజు కేదార్‌నాథ్ మందిరానికి వెళ్లి దేవుడికి నీళ్లు సమర్పించుకొనేవాడినని నరేంద్ర మోదీ పలు సందర్భాలలో మీడియాకి  తెలిపారు. కానీ, నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ తలకిందులుగా ప్రదక్షిణ చేసినట్టు మాకు ఎక్కడా సమాచారం దొరకలేదు.

చివరగా, ఈ వీడియోలో కేదార్‌నాథ్ ఆలయం చుట్టు తలకిందులుగా ప్రదక్షణ చేస్తున్నది కేదార్‌నాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది, ప్రధాని నరేంద్ర మోదీ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll