“కార్గిల్ యుద్ధంలో కాళ్లు కోల్పోయిన మేజర్ విక్రమ్ తన భార్యతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కార్గిల్ యుద్ధంలో కాళ్లు కోల్పోయిన మేజర్ విక్రమ్ తన భార్యతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో డాన్స్ చేస్తున్నది ఢిల్లీకి చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్, ఇండియన్ పారా పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు వినోద్ ఠాకూర్ మరియు అతని భార్య హిమాన్షి ఠాకూర్. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 06 ఏప్రిల్ 2024న ‘వినోద్ ఠాకూర్’ (@vinodthakur9268) అనే యూజర్ పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ అకౌంట్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న జంటను సంబంధించిన మరిన్ని వీడియోలను మేము గమనించాము(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అలాగే ఇదే వైరల్ వీడియోను వినోద్ ఠాకూర్ అతని ఫేసుబుక్ పేజిలో కూడా పోస్ట్ చేశాడు.
వినోద్ ఠాకూర్ యొక్క ఫేసుబుక్ పేజీ వివరణ ప్రకారం, అతను ఢిల్లీకు చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అని, డాన్సర్ అని, ఇండియన్ పారా పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు అని పేర్కొన్నాడు. అలాగే పలు హిందీ టీవీ ఛానల్స్ నిర్వహించిన డాన్స్ రియాలిటీ షోలలో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు.
ఈ వైరల్ వీడియోలో వినోద్ ఠాకూర్ తో పాటు డాన్స్ చేసింది అతని భార్య హిమాన్షి ఠాకూర్. వీరిద్దరకి సంబంధించిన మరిన్ని వీడియోలను ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ వీడియోలో డాన్స్ చేస్తున్న వ్యక్తి ఢిల్లీకి చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మరియు ఇండియన్ పారా పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు వినోద్ ఠాకూర్, మేజర్ విక్రం కాదు.