Fake News, Telugu
 

ఫొటోలో RSS యూనిఫార్మ్ ధరించిన వ్యక్తులు మణిపూర్ ఘటనలో నిందితులు కారు

0

వివరణ (24 జులై 2023): సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా చిదానంద సింగ్ మణిపూర్ రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మణిపూర్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదు కాపీని మరియు మణిపూర్ పోలీసుల ట్వీట్ ను జతచేస్తూ ఈ ఆర్టికల్ సవరించబడింది.

ఇటీవల మణిపూర్లో ముగ్గురు కూకీ తెగ మహిళల్ని రోడ్డుపైన నగ్నంగా ఊరేగించిన ఘటనకు బాధ్యులైన ఇద్దరు నిందితులు వీరేనని చెప్తూ, RSS దుస్తులు ధరించిన ఇద్దరి వ్యక్తులు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇలాంటి పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: మణిపూర్లో ముగ్గురు కూకీ మహిళల్ని రోడ్డుపైన నగ్నంగా ఊరేగించిన ఘటనకు బాధ్యులైన ఇద్దరు నిందితులు RSS దుస్తుల్లో ఉన్న ఫోటో.

ఫాక్ట్: వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తులు మణిపూర్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చిదానంద సింగ్ మరియు అతని కుమారుడు సచ్చినంద. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న హుయిరెం హీరా దాస్‌తో  పాటు మరో ఆరుగురు నిందితులని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చిదానంద సింగ్ తెలిపారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ అవుతున్న ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటోని (ఆర్కైవ్) 17 అక్టోబర్ 2022లో చిదానంద సింగ్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినట్లు గుర్తించాం.

16 అక్టోబర్ 2022లో మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జరిగిన ఒక RSS కార్యక్రమంలో తన కుమారుడు సచ్చినందతో కలిసి పాల్గొన్నప్పుడు తీసిన ఫోటో అంటూ చిదానంద సింగ్ వివరణలో పేర్కొన్నాడు.

ఇక చిదానంద సింగ్ ఫేస్ బుక్ ఖాతాని పరిశీలించగా ఆయన మణిపూర్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు అని గుర్తించాం. ఇదే విషయాన్ని బీజేపీ మణిపూర్ అధికారిక వెబ్‌సైట్లో కూడా చూడవచ్చు. వివిధ కార్యక్రమాలలో బీజేపీ నాయకులతో ఆయన కలిసి ఉన్న ఫొటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇక ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న హుయిరెం హీరా దాస్‌తో  పాటు మరో ఆరుగురు నిందితులని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో చిదానంద సింగ్ మరియు తన కుమారుడు ఉన్నట్లు ఎక్కడా సమాచారం లేదు. పై ఆధారాలను బట్టి, వైరల్ ఫోటోలో RSS దుస్తుల్లో ఉన్నది హుయిరెం హీరా దాస్‌ కాదని స్పష్టమవుతుంది. మణిపూర్ ఘటనపై మేము ఇదివరకే రాసిన ఫాక్ట్- చెక్ వ్యాసాన్ని ఇక్కడ చూడవచ్చు.

ఇక ఇదే విషయమై చిదానంద సింగ్ తో మేము ఫోన్లో మాట్లాడగా,  తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారం తన దృష్టికి వచ్చిందని,  కొందరు పనిగట్టుకొని తన కుమారుడు మరియు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ఘటనతో తమకి ఎలాంటి సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో కూడా తాము అక్కడ లేమని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు షేర్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడవచ్చు.

ఇక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేశామని మణిపూర్ పోలీసులు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

చివరిగా, RSS దుస్తుల్లో ఉన్న మణిపూర్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మరియు అతని కుమారుడి ఫొటోలను షేర్ చేస్తూ మణిపూర్ ఘటనలో నిందితులంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll