‘భారతదేశ ప్రధానమంత్రికి స్వయానా తమ్ముడు ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు’ అని చెప్తూ మోదీని పోలిన వ్యక్తి ఆటో నడుపుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ఆటో నడుపుతున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలో ఉన్నది నరేంద్ర మోదీ తమ్ముడు కాదు, ఆదిలాబాద్‌కు చెందిన ఆయుబ్ అనే వ్యక్తి. ఇతను ఆదిలాబాద్ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేసాడు. అంతకు ముందు ఆటో నడిపాడు. వైరల్ అవుతున్న ఫోటో ఇతను ఆటో నడిపిన సమయంలోది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ అవుతున్న ఫోటోలోని వ్యక్తి మోదీని పోలి ఉన్న మాట నిజమే అయినప్పటికీ, ఆ ఫోటోలోని వ్యక్తికి మోదీతో ఎటువంటి సంబంధం లేదు. అతను ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి.
వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను గతంలో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం ఫోటోలోని వ్యక్తి పేరు ఆయుబ్, ఇతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తాడు.
ఈ కథనం ఆధారంగా మరింత సమాచారం కోసం వెతకగా ఇతనికి సంబంధించిన మరిన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం ఇతను 1998లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా నియమితుడయ్యాడు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఉద్యోగం పోవడంతో, ఆ తర్వాత ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేశాడు. మళ్ళీ తిరిగి 2014లో అతను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో డ్రైవర్‌గా శాశ్వత ఉద్యోగం పొంది ఆదిలాబాద్ బస్ డిపో నుండి నడుపుతున్నాడు. వైరల్ అవుతున్న ఫోటో ఆయుబ్ ఆటో నడిపినప్పటిది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు. గతంలో మోదీ సోదరుల వృత్తికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయినప్పుడు FACTLY వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఈ ఫోటోలో ఆటో నడుపుతున్నది మోదీ తమ్ముడు కాదు, ఆదిలాబాద్‌కు చెందిన బస్ డ్రైవర్.