‘నా లాంటి బుద్ధిలేనివాడు దేశంలో మరెవ్వరు ఉండరు’ అని రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఒప్పుకున్నాడు అని చెప్తూ, ఒక వీడియోతో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంత వరకు నిజముందో తెలుసుకుందాం
క్లెయిమ్: బహిరంగ సభలో తను ఒక బుద్ధిలేనివాడినని రాహుల్ గాంధీ ఒప్పుకున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): 2018 లో ఢిల్లీలో నిర్వహించిన ఓబీసీ సమ్మేళనంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, లోక్ సభలో బీజేపి కి చెందిన ఒక ఓబీసీ ఎంపీ తనతో, ‘నా లాంటి బుద్ధిలేనివాడు దేశంలో మరెవ్వరు ఉండరు. లోక్ సభలో నరేంద్ర మోదీ తమని మాట్లాడనివ్వడం లేదు. ప్రభుత్వం మొత్తం RSS చేతిలో నడుస్తుంది’, అని అన్నట్టు తెలిపాడు. వీడియోని ఎడిట్ చేసి, రాహుల్ గాంధీ తన గురించి చెప్పినట్టు చూపించారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో పెట్టిన వీడియో కోసం వెతకగా, రాహుల్ గాంధీ 2018లో ఢిల్లీలో జరిగిన ఓబీసీ సమ్మేళనంలో ఇచ్చిన ఉపన్యాసానికి సంబంధించిన వీడియోగా తెలిసింది. ఆ ఉపన్యాసానికి సంబంధించిన వీడియోని తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో రాహుల్ గాంధీ పోస్ట్ చేసాడు. లోక్ సభలో బీజేపికి చెందిన ఒక ఓబీసీ ఎంపీ తనతో, ‘నా లాంటి బుద్ధిలేనివాడు దేశంలో మరెవ్వరు ఉండరు. లోక్ సభలో నరేంద్ర మోదీ తమని మాట్లాడనివ్వడం లేదు. ప్రభుత్వం మొత్తం RSS చేతిలో నడుస్తుంది’ అని తన బాధ చెప్పుకున్నాడు అంటూ ఆ వీడియోలో రాహుల్ గాంధీ అన్నాడు. అయితే, ఒక బీజేపి ఎంపీ అలా అన్నాడు అని రాహుల్ గాంధీ చెపితే, వీడియోని క్లిప్ చేసి, తనని తానే రాహుల్ గాంధీ బుద్ధిలేనివాడుగా చెప్పుకున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. పూర్తి వీడియోని కాంగ్రెస్ అధికారిక యుట్యూబ్ ఛానల్ లో కూడా చూడవచ్చు.
చివరగా, ఒక బీజేపి ఎంపీ రాహుల్ గాంధీ తో అన్న వ్యాఖ్యలను (‘నా లాంటి బుద్ధిలేనివాడు దేశంలో మరెవ్వరు ఉండరు’) రాహుల్ గాంధీ తన గురించి చెప్పినట్టు షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?