Fake News, Telugu
 

వీడియోలో ఉన్న అధికారులు తాము కరోనా వాక్సిన్ తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు

0

కర్ణాటక లో కరోనా వాక్సిన్ వేయించుకుంటున్నట్టు నటిస్తున్న బీజేపీ నాయకులు అని చెప్తూ, ఒక వీడియోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కర్ణాటక లో కరోనా వాక్సిన్ వేయించుకుంటున్నట్టు నటిస్తున్న బీజేపీ నాయకుల వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్నవారు మెడికల్ అధికారులు. వారు వాక్సిన్ వేయించుకున్నప్పుడు మీడియా వారు లేనందున, తర్వాత మీడియా వారి కోరిక మేరకు వాక్సిన్ వేయించుకుంటున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 16 జనవరి 2021 న వీడియోలోని ఇద్దరు అధికారులు వాక్సిన్ తీసుకున్నట్టు తెలిసింది.  కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ వీడియో పై ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారు రాసిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియోలో ఉన్నది తుంకూర్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రజనీ అని తెలుస్తుంది. కావున, వీడియోలో ఉన్నవారు మెడికల్ అధికారులు. “డాక్టర్ రజనీ టీకా తీసుకోకుండా నటించారనేది అబద్ధం. డాక్టర్ రజని జనవరి 16న తొలి డోస్ తీసుకున్నారు. ఆమె వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోలు మీడియాకు రాలేదు. ఫోటోలకు ఫోజు ఇవ్వాలని ఆమెను కోరారు. అదే ఆమె చేసిన తప్పు. ఆమె టీకా తీసుకున్నట్లు నటించలేదు”, అని తుంకూర్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రాకేశ్ కుమార్ తెలిపినట్టు ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారి ఆర్టికల్ లో చదవొచ్చు.

వైరల్ అవుతున్న వీడియోపై డాక్టర్ రజనీ ఇచ్చిన వివరణ ని ‘కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్’ వారు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఆ ట్వీట్ ని ఇక్కడ చూడవొచ్చు.

16 జనవరి 2021 న డాక్టర్ రజనీ కోవీషీల్డ్ వాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నట్టు చూపిస్తున్న సర్టిఫికేట్ ని ‘ఇండియా టుడే’ వారి ఆర్టికల్ లో చూడవొచ్చు. తుంకూర్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ నాగేంద్రప్ప కూడా 16 జనవరి 2021 వాక్సిన్ తీసుకున్నారని, అయితే సాంకేతిక లోపాల వల్ల డీహెచ్ఓ పేరు లిస్టులో రాలేదని తెలిసింది. వాక్సిన్ వేయించుకుంటున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ‘ఇండియా టుడే’ తో మాట్లాడుతూ, అధికారిక ప్రక్రియ మొదలవ్వడానికి సమయo పడుతున్నందున, తామే అధికారులను తొందరగా ఫోటోలకు ఫోజులు ఇవ్వమని అడిగామని తెలిపారు. అప్పుడు ఎవరో తీసిన వీడియోని తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

చివరగా, వీడియోలో ఉన్న అధికారులు తాము కరోనా వాక్సిన్ తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు.

Share.

About Author

Comments are closed.

scroll