Fake News, Telugu
 

భారత దేశంలో ఆశ్రయం పొందుతున్న విదేశీ శరణార్ధుల సంఖ్య 6 కోట్లకు చేరలేదు

0

“పెట్రోల్ 119 రూపాయలు అయ్యిందని అందరు ఆందోళన చెందుతున్నారే గాని, దేశంలో అక్రమ వలసదారులు సంఖ్య 6 కోట్లకు పెరిగిందని గాని, పబ్లిక్ స్థలాలని ఆక్రమించేసి వారు మన ధన, ప్రాణాలనే హరిస్తున్నారని ఎవరికీ ఆందోళన లేదు”, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యోక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భారత దేశంలో ఆశ్రయం పొందుతున్న వలసదారుల సంఖ్య 6 కోట్లకు చేరింది.

ఫాక్ట్ (నిజం): యునైటెడ్ నేషన్స్ హై కమీషన్ ఫర్ రిఫ్యూజీస్ (UNHCR) విడుదల చేసిన తాజా ప్రకటనలో భారత దేశం మొత్తంగా 2,12,874 మంది శరణార్ధులకు ఆతిధ్యం వహిస్తుందని తెలిపారు. 2022 ఫిబ్రవరి నెల వరకు 47, 917 మంది UNHCR ఇండియాలో శరణార్ధులుగా రిజిస్టర్ చేసుకున్నారు. భారత దేశంలో సుమారుగా 4 లక్షల మంది వలసదారులు ఆశ్రయం పొందుతున్నారని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. భారత దేశంలో వలసదారుల సంఖ్య 6 కోట్లకు చేరలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం యునైటెడ్ నేషన్స్ హై కమీషన్ ఫర్ రిఫ్యూజీస్ (UNHCR) వెబ్సైటులో వెతికితే, భారత దేశంలో ఆశ్రయం పొందుతున్న వలసదారుల వివరాలని రిపోర్ట్ చేస్తూ UNHCR ఇటీవల ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చినట్టు తెలిసింది. శ్రీలంక శరణార్ధులతో సహా భారత దేశం మొత్తంగా 2,12,874 మంది శరణార్ధులకు ఆతిధ్యం వహిస్తుందని UNHCR ఈ ప్రెస్ రిలీజ్‌లో తెలిపారు.

2022 ఫిబ్రవరి నెల వరకు 47, 917 మంది ‘UNHCR India’లో శరణార్ధులుగా రిజిస్టర్ చేసుకున్నట్టు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ 2019-20 ఆధారంగా UNHCR తెలిపిన సమాచారంలో, భారత దేశంలో అత్యధికంగా శ్రీలంక శరణార్ధులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. భారత దేశంలో ప్రస్తుతం శ్రీలంక నుండి 95,829 మంది శరణార్ధులు, చైనా నుండి 73,404 శరణార్ధులు, మియన్మార్ నుండి 23,592 మంది శరణార్ధులు, ఆఫ్ఘానిస్తాన్ దేశం నుండి 15, 916 మంది శరణార్ధులు, ఇతర దేశాల నుండి 4,133 మంది శరణార్ధులు ఆశ్రయం పొందుతున్నారని UNHCR తెలిపింది.

కాని, భారత దేశంలో సుమారు 4 లక్షల మంది వలసదారులు ఆశ్రయం పొందుతున్నారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. “భారత దేశంలో ఆశ్రయం పొందుతున్న వలసదారుల జాబితా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందా?”, అని పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు, స్టేట్ ఆఫ్ హోం అఫైర్స్ మంత్రి నిత్యానంద రాయ్ బదులిస్తూ, “శరణార్థుల స్థితికి సంబంధించిన 1951ఐరాస కన్వెన్షన్ మరియు 1967 ప్రోటోకాల్‌పై భారతదేశం సంతకం చేయలేదు. విదేశీ పౌరులతో పాటు శరణార్థులు కూడా విదేశీయుల చట్టం, 1946, విదేశీయుల నమోదు చట్టం, 1939, పాస్‌పోర్ట్ (భారతదేశంలోకి ప్రవేశం) చట్టం, 1920 మరియు పౌరసత్వ చట్టం, 1955లో ఉన్న నిబంధనల లోబడి గుర్తించడం జరుగుతుంది. అటువంటి విదేశీ పౌరులు రహస్య పద్ధతిలో చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశిస్తారు. భారత దేశంలో నివసిస్తున్న అటువంటి శరణార్థుల జాబితాను కేంద్రం సేకరించట్లేదు”, అని తెలిపారు.   

చివరగా, భారత దేశంలో ఆశ్రయం పొందుతున్న విదేశీ వలసదారుల సంఖ్య 6 కోట్లకు చేరలేదు.

Share.

About Author

Comments are closed.

scroll