Fake News, Telugu
 

రోహింగ్యా శిబిరాలలో ఏడాదిలో 60,000 మంది జన్మిస్తున్నారన్న ఈ వార్త బంగ్లాదేశ్‌కు సంబంధించింది, భారత్‌కు సంబంధించింది కాదు

0

భారత్‌లో ఉన్న రోహింగ్యాల శిబిరాల్లో ఒక్క ఏడాదిలో 60,000 మంది పిల్లల జననం’ అని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘భారత్‌లో ఉన్న రోహింగ్యాల శిబిరాల్లో ఒక్క ఏడాదిలో 60,000 మంది పిల్లల జననం’

ఫాక్ట్(నిజం): బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాల శిబిరాల్లో పిల్లల జనానికి సంబంధించి గతంలో వచ్చిన కొన్ని వార్తలను భారత్‌కు ఆపాదిస్తున్నారు. నిజానికి భారత్‌లోని రోహింగ్యా శిబిరాల్లో జనన రేటుకు సంబంధించి ఎటువంటి అధికారిక లేక అనధికారిక రిపోర్టులు లేవు. మొత్తం దేశంలో సుమారు 40,000 మంది రోహింగ్యాలు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం పలు సంధర్భాలలో చెప్పింది. దీన్నిబట్టి భారత్‌లో ఏడాదిలో 60,000 మంది రోహింగ్యాలు జన్మించారన్న వార్తకు ఎటువంటి ఆధారాలు లేవని అర్థం చేసుకోవొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఏడాదిలో 60,000 మంది పిల్లల జననం:

రోహింగ్యాల శిబిరాల్లో ఒక్క ఏడాదిలో 60,000 మంది పిల్లల జన్మించారన్న వార్త భారతదేశానికి సంబంధించింది కాదు. ఈ వార్తకు సంబంధించి గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, రోహింగ్యాల శిబిరాల్లో 60,000 మంది పిల్లల జనానికి సంబంధించి 2018లో ప్రచురితమైన ఒక వార్తా కథనం మాకు కనిపించింది.

ఐతే ఈ కథనంలో ప్రస్తావించింది భారత్‌లోని రోహింగ్యా శిబిరాల గురించి కాదు, బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శిబిరాల గురించి. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శిబిరాలలోని దయనీయ పరిస్థితుల గురించే చెప్పే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సౌత్- ఈస్ట్ ఏషియన్ రీజినల్ డైరెక్టర్, డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ ‘అంచనాల ప్రకారం ఈ శరణార్థి శిబిరాల్లో వచ్చే ఏడాదిలో 60,000 మంది పిల్లలు పుడతారని’ వ్యాఖ్యానించారు.

పోస్టులో చేస్తున్న వాదనకు ఈ కథనమే మూలమై ఉంటుంది. కాకపోతే బంగ్లాదేశ్ రోహింగ్యా శిబిరాల గురించి ప్రస్తావించిన ఈ కథనాన్ని భారత రోహింగ్యా శిబిరాల గురించి అని తప్పుగా అర్ధం చేసుకొని ఉండొచ్చు.

ఐతే, UNHCR అధికారిక లెక్కలు పైన చెప్పినట్టు 60,000 లేనప్పటికీ, ఈ శిబిరాలలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని గతంలో UNHCR వ్యాఖ్యానించింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

ఐక్యరాజ్య సమితి యొక్క మరో విభాగమైన UNICEF, తమ లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శిబిరాలలో రోజుకు సుమారు 60 మందికి పైగా జన్మిస్తున్నారని 2018లో ప్రకటించింది. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శిబిరాల దయనీయ పరిస్థితుల గురించి అధ్యయణం చేసిన పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ శిబిరాలలో జన్మించే పిల్లలకు సంబంధించి ఇలాంటి విషయాలే వెల్లడించాయి. దీన్నిబట్టి, ఈ వాదనలు భారత్‌లోని రోహింగ్యా శిబిరాలకు సంబంధించినవి కావని బంగ్లాదేశ్‌లోని శిబిరాలకు సంబంధించినవని అర్ధంచేసుకోవచ్చు.

భారత్‌లో రోహింగ్యాలు:

ఐతే పోస్టులో వాదిస్తున్నట్టు భారత్‌లోని రోహింగ్యా శిబిరాలలో ఇలా వేల సంఖ్యలో పిల్లలు జన్మిస్తున్నట్టు ఎటువంటి అధికారిక లేక అనధికారిక రిపోర్టులు గాని లేవు.

భారత దేశం మొత్తంలో సుమారు 18,000 శరణార్థులు (రోహింగ్యాలతో కలిపి) UNHCRతో రిజిస్టర్ అయ్యారని ఐక్యరాజ్య సమితి యొక్క శరణార్థుల విభాగమైన UNHCR ప్రకటించింది. ఐతే భారత్‌లోని రోహింగ్యా శిబిరాలలో జన్మించే పిల్లలకు సంబంధించి UNHCR ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దేశంలో ఉంటున్న రోహింగ్యాల సంఖ్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాలలో పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ,  ‘దేశంలో ఉంటున్న రోహింగ్యాలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలైతే లేవని, కాకపోతే అనధికారిక లెక్కల ప్రకారం దేశంలో సుమారు ఒక 40,000 మంది రోహింగ్యాలు ఉండొచ్చని’ తెలిపింది.

వీటన్నిటిబట్టి కూడా ఏడాదిలో 60,000 మంది జన్మించారని చేస్తున్న వాదన భారత్‌లోని రోహింగ్యా శిబిరాల గురించి కాదని స్పష్టమవుతుంది. ఎందుకంటే దేశంలో మొత్తంలో ఉండే రోహింగ్యాల సంఖ్యే అంత లేనప్పుడు, రోహింగ్యా శిబిరాలలో సంవత్సరంలో 60,000 మంది జన్మిస్తున్నారన్న వాదన అహేతుకమౌతుంది. పైగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలు కూడా భారత్‌కు సంబంధించినవి కావు. ఈ ఫోటోలు బంగ్లాదేశ్ మరియు మయన్మార్‌లోని రోహింగ్య శిబిరాలకు సంబంధించినవి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

చివరగా, రోహింగ్యా శిబిరాలలో ఏడాదిలో 60,000 మంది జన్మిస్తున్నరన్న ఈ వార్త బంగ్లాదేశ్‌కు సంబంధించింది, భారత్‌కు సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll