Fake News, Telugu
 

అదానీ సంస్థకు అవసరమైన 12,770 కోట్ల రూపాయల రుణానికి SBI కేవలం పూచీకత్తు అందించింది, రుణమాఫీ చేయలేదు

0

‘నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు (NMIAL) కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL)కు సంబంధించిన రూ.12,770 కోట్ల రుణాన్ని ఎస్‌బీఐ మాఫీ చేసిందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ‘నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు (NMIAL) కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL)కు సంబంధించిన రూ.12,770 కోట్ల రుణాన్ని ఎస్‌బీఐ మాఫీ చేసింది.’

ఫాక్ట్(నిజం): అదానీ సంస్థకు SBI ఎటువంటి రుణ మాఫీ చేయలేదు. ఐతే ముంబైలో అదానీ సంస్థ నిర్మించబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అవసరమైన 12,770 కోట్ల రూపాయల రుణానికి SBI పూచీకత్తు (అండర్ రైట్) అందించింది. అంటే ఈ రుణానికి SBI గ్యారెంటి అందిస్తామని తెలిపింది. ఐతే ఈ విషయాన్ని SBI రుణ మాఫీ చేసిందంటూ తప్పుగా అర్ధం చేసుకున్నారు. నిజానికి అండర్ రైట్ అంటే రుణ మాఫీ చేసినట్టు కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

జూలై 2020లో GVK సంస్థ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (MIAL)లోని తమ 50.5% వాటాని అదానీ గ్రూప్ యొక్క అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL) సంస్థకు విక్రయించింది. ఈ క్రమంలోనే GVK ఇతర కంపెనీలకు చెల్లించాల్సిన రుణాలను (MIAL రుణాలలో తమ వాటా) కూడా తాము చెల్లించేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది.

అంతకు ముందు ముంబైలో నిర్మించబోయే రెండో విమానాశ్రయమైన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) యొక్క కాంట్రాక్టును MIAL దక్కించుకుంది. ఐతే ప్రస్తుతం MIALలోని GVK వాటాని అదానీ సంస్థ కొనుగోలు చేయడంతో NMIA నిర్మాణ బాధ్యత అదానీ సంస్థ తీసుకుంది.

ఐతే ఈ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) నిర్మాణానికి సంబంధించి ఫైనాన్షియల్ డీల్/  ఫైనాన్షియల్ క్లోజర్ (నిధులు పొందేందుకు ఒప్పందం ప్రకారం అన్ని షరతులు అమలు చేయడం) పూర్తయిందని అదానీ సంస్థ ఇటీవల మార్చ్ చివరి వారంలో ఒక ప్రకటన చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా SBI సంస్థ 12,770 కోట్ల రూపాయలకు అండర్ రైట్ (పూచీకత్తు) ఇవ్వనున్నట్టు తెలిపింది.

ఐతే SBI నవీ ముంబై విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి అదానీ సంస్థకు ఇచ్చిన ఈ పూచీకత్తును, రుణ మాఫీగా  తప్పుగా అర్ధం చేసుకున్నారు. పలు ప్రధాన తెలుగు వార్తా సంస్థలు కూడా SBI  అదానీ సంస్థకు 12,770 కోట్ల రుణ మాఫీ చేసిందంటూ వార్తలు రాయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఐతే నిజానికి అదానీ సంస్థకు పూచీకత్తు ఇచ్చిందే గాని రుణ మాఫీ చేయలేదు. పూచీకత్తు ఇవ్వడం అంటే అదానీ సంస్థకు తీసుకొనే 12,770 కోట్ల రుణానికి తాము గ్యారెంటీ అందిస్తామని తెలిపినట్టు. అంటే, ఒక వేల అదానీ సంస్థ ఈ రుణాన్ని చెల్లించడంలో విఫలమైతే SBI బాధ్యత వహించాల్సి ఉంటుంది. అండర్ రైట్ యొక్క నిర్వచనం ఇక్కడ చూడొచ్చు.

ఐతే వ్యాపార రంగంలో ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇలా పూచీకత్తు (అండర్ రైట్) అందించిననందుకు బ్యాంకులు ఫీజు వసూలు చేస్తాయి.   సాధారణంగా ఇలా పూచీకత్తు అందించే సమయంలో బ్యాంకులు పరిగణలోకి తీసుకునే అంశాలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, అదానీ సంస్థకు అవసరమైన 12,770 కోట్ల రూపాయల రుణానికి SBI కేవలం పూచీకత్తు అందించింది, రుణమాఫీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll