Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీకి చైనా నుంచి రహస్యంగా నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో పేర్కొనలేదు

0

కాంగ్రెస్ పార్టీకి చైనా నుంచి రహస్యంగా నిధులు అందుతున్నాయని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికలో ఆధారాలతో సహా రుజువు చేసిందని చెప్తూ ఒక hmtv ప్రసారం చేసిన వీడియో మరియు పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీకి చైనా నుంచి రహస్యంగా నిధులు అందుతున్నాయని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికలో ఆధారాలతో సహా రుజువు చేసింది.

ఫాక్ట్: న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలోకాంగ్రెస్ పార్టీ పేరుని గాని, చైనా నుంచి కాంగ్రెస్ పార్టీకి నిధులు వస్తున్నట్లు గానీ వెల్లడించలేదు. నేవిల్లి రాయ్ సింగం అనే వ్యాపారవేత్త చైనా ప్రభుత్వం దగ్గర డబ్బు తీసుకొని చైనా అనుకూల కథనాలను భారత్‌లో ప్రచారం చేస్తున్నాడని ఈ నివేదిక ఆరోపించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఇటీవల పార్లమెంటులో ప్రస్తావించిన న్యూయార్క్ టైమ్స్ నివేదికని పూర్తిగా పరిశీలించగా, అందులో కాంగ్రెస్ పార్టీ పేరుని గాని, చైనా నుంచి కాంగ్రెస్ పార్టీకి నిధులు వస్తున్నట్లు కానీ ఇందులో ఎక్కడా ప్రస్తావించలేదు.

ఈ నివేదికలో నేవిల్లి రాయ్ సింగం అనే వ్యక్తి తన ఎన్జిఓల ద్వారా చైనా ప్రభుత్వం దగ్గర డబ్బు తీసుకొని, న్యూస్ క్లిక్ అనే మీడియా సంస్థ ద్వారా చైనా అనుకూల కథానాలని భారత్‌లో ప్రచారం చేస్తున్నాడని ఆరోపించింది.

అయితే బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంటులో మాట్లాడుతూ, కాంగ్రెసు పార్టీకి కూడా చైనా నుంచి నిధులు అందుతున్నాయని, న్యూస్ క్లిక్, కాంగ్రెస్ పార్టీ మరియు కొన్ని ఇతర సంస్థలు దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఇదివరకు చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ గురించి న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించలేదు.

ఇక, వైరల్ పోస్టులో ఉన్న hmtv పూర్తి వీడియోలో కూడా ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ, వీడియో Thumbnail లో కాంగ్రెస్ పార్టీకి చైనా నుంచి రహస్య నిధులు వస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో పేర్కొన్నట్లు తప్పుగా ప్రచురించింది.

చివరిగా, కాంగ్రెస్ పార్టీకి చైనా నుంచి రహస్యంగా నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll