Fake News, Telugu
 

1948లో రూపొందించిన NCC చట్టంలో ప్రతీ స్కూల్ లో కచ్చితంగా NCC ఉండాలన్న నిబంధన ఏది లేదు

0

‘పిల్లలుగా ఉన్నప్పుడే దేశభక్తి పెంచాలని ప్రతి స్కూల్ లో NCC ఉండేలా సర్దార్ పటేల్ చట్టం తెస్తే, వారు చనిపోగానే కొట్టేసిన గాంధీ కుటుంభం’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘పిల్లలుగా ఉన్నప్పుడే దేశభక్తి పెంచాలని ప్రతి స్కూల్ లో NCC ఉండేలా సర్దార్ పటేల్ చట్టం తెస్తే, వారు చనిపోగానే కొట్టేసిన గాంధీ కుటుంభం’.

ఫాక్ట్ (నిజం): 1948లో రూపొందించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) చట్టంలో గాని లేక NCC రూల్స్ లోగాని ప్రతీ స్కూల్ లో NCC కచ్చితంగా ఉండాలన్న నిబంధన ఏది లేదు. కాబట్టి ఈ నిబంధనను తరవాత తొలగించారన్న వాదనలో హేతుబద్ధత లేదు. 1948 సంవత్సరంలో సీనియర్ డివిజన్‌లో మొత్తం 96 యూనిట్లలో 20,000 మంది NCC లో జాయిన్ అయ్యారు. కావలసిన నాణ్యత గల ఉపాధ్యాయులు NCC అధికారులుగా పనిచేయడానికి తగిన సంఖ్యలో ముందుకు రాకపోవడంతో జూనియర్ డివిజన్ యూనిట్లు అంతగా అభివృద్ధి చెందలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పండిట్ H.N. కున్జ్రూ నేతృత్వంలోని క్యాడెట్ కార్ప్స్ కమిటీ భారతదేశంలోని యువత సమస్యపై సమగ్ర అధ్యయనం చేసి మార్చి 1947 లో తమ నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పింది. ఆ సమయంలోని దేశ పరిస్థితుల నేపథ్యంలో అప్పటి రక్షణ మంత్రి సర్దార్ బల్దేవ్ సింగ్ మరియు అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనల మేరకు ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కున్జ్రూ కమిటీ రిపోర్ట్ ని అన్ని ప్రొవిన్సియల్ గవర్నమెంట్స్ కి వారి మద్దతు కొరకు పంపించారు. ఆ తరవాత 08 ఏప్రిల్ 1948న రాజ్యాంగ సభ ఆమోదం పొందింది. 16 ఏప్రిల్ 1948న ఈ బిల్లుకి గవర్నర్ జనరల్ ఆమోదం తెలపడంతో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చట్టం, 1948 ఆచరణలోకి వచ్చింది.

ఐతే 1948లో చేసిన ఈ చట్టంలో ఎక్కడ కూడా ప్రతీ స్కూల్ లో NCC ఉండాలన్న కచ్చితమైన నిబంధన లేదు. ఈ చట్టంలోని క్లాజ్13  కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో రూల్స్ రూపొందించే అధికారాన్ని ఇచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1948లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ రూల్స్ ని రూపొందించింది. స్కూల్స్ మరియు కాలేజీల్లో NCC యూనిట్ ప్రారంభించాలనుకుంటే పాటించాల్సిన రూల్స్ ఇందులో పేర్కొన్నారు. ఐతే 1948లో గాని లేక కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రూల్స్ లో గాని ఎక్కడ కూడా ప్రతీ స్కూల్ లో కచ్చితంగా NCC ఉండాలన్న నిబంధనలేదు.

IndiaNCC వెబ్సైటు లో ఉన్న సమాచారం ప్రకారం1948 సంవత్సరంలో సీనియర్ డివిజన్‌లో మొత్తం 96 యూనిట్లలో కలిపి 20,000 మంది NCC లో జాయిన్ అయ్యారు. కావలసిన నాణ్యత గల ఉపాధ్యాయులు NCC అధికారులుగా పనిచేయడానికి తగిన సంఖ్యలో ముందుకు రాకపోవడంతో జూనియర్ డివిజన్ యూనిట్లు అంతగా అభివృద్ధి చెందలేదు.

ఐతే 1948లో చేసిన ఈ చట్టంలోని క్లాజ్ 13 ఆధారంగా పలు సార్లు కేంద్ర ప్రభుత్వం రూల్స్ చేసినప్పటికీ ఈ చట్టానికి చెప్పుకోదగ్గ ప్రధాన సవరణలు ఏవీ జరగలేదు. 1949లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ రూల్స్ (గర్ల్స్ డివిజన్) రూపొందించారు. 1948లో చేసిన చట్టంలో ప్రతీ స్కూల్ లో కచ్చితంగా NCC ఉండాలన్న నిబంధనేది లేనందువల్ల ఈ నిబంధనను తరవాత తొలగించారన్న వాదనలో హేతుబద్ధత లేదు.

చివరగా, 1948లో రూపొందించిన NCC చట్టంలో ప్రతీ స్కూల్ లో కచ్చితంగా NCC ఉండాలన్న నిబంధన ఏది లేదు.

Share.

About Author

Comments are closed.

scroll