తమిళనాడు ప్రస్తుత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి ఈ.వి.వేలు ఒకప్పుడు డీఎంకే మాజీ అధినేత కరుణానిధి రిక్షా నడిపేవాడంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. ఈ.వి.వేలుపై ఇటీవల నిర్వహించిన ఐటి దాడులలో ఆయనకు దాదాపుగా 20000 కోట్ల ఆస్తి ఉందని బయటపడిందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తమిళనాడు ప్రస్తుత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి ఈ.వి.వేలు గతంలో కరుణానిధి రిక్షాను నడుపుతున్నప్పుడు తీసిన ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో డీఎంకే మాజీ అధినేత కరుణానిధి రిక్షాను నడుపుతున్నది ఈ.వి.వేలు కాదు. 1991 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరుణానిధి చెన్నైలో నిర్వహించిన ఒక ప్రచార కార్యక్రమంలో ఈ ఫోటోని తీశారు. బస్ కండక్టరుగా ఉద్యోగాన్ని ప్రారంభించిన ఈ.వి.వేలు, అన్నాడఎంకే (AIADMK) పార్టీ తరుపున మొట్టమొదటి సారిగా 1984 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి, విజయం సాధించారు. 1991 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ.వి.వేలు డీఎంకే పార్టీకి ప్రచారం చేసినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఈ.వి.వేలు 2000లో డీఎంకే పార్టీలో చేరారు. ఈ ఫోటోలో కరుణానిధి రిక్షా నడుపుతున్నది ఈ.వి.వేలు కాదని కొందరు తమిళనాడు జర్నలిస్టులు కూడా స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘The Hindu’ వార్తా సంస్థ 28 నవంబర్ 2018 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో (ఆర్కైవ్డ్) దొరికింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కరుణానిధి 11 మే 1991 నాడు చెన్నైలోని హార్బర్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఈ ఫోటోని తీశారని ఆర్టికల్‌లో తెలిపారు. ఫోటోలో రిక్షా నడుపుతున్నది ఈ.వి.వేలు అని ఈ కథనంలో ఎక్కడ తెలుపలేదు.
ఈ.వి.వేలు రాజకీయ ప్రయాణం గురించి వివరిస్తూ ‘Vikatan’ వార్తా సంస్థ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. తమిళ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మొట్టమొదట బస్ కండక్టరుగా ఉద్యోగం చేశాడని ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ.వి.వేలు 1984 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే (AIADMK) పార్టీ తరుపున మొట్టమొదటి సారిగా తాండరంపటు నియోజకవర్గం నుండి పోటీ చేసి, విజయం సాధించాడని ఈ ఆర్టికల్‌లో తెలిపారు.
1987లో ఎం.జి.రామచంద్రన్ మరణం తరువాత, ఈ.వి.వేలు అన్నాడీఎంకేలోని జానకి వర్గానికి మద్దతిచ్చాడు. తర్వాత కే. భాగ్యరాజ్ స్థాపించిన MGR పార్టీకి ఈ.వి.వేలు పాలిసి సెక్రెటరీగా పనిచేశారు. ఈ.వి.వేలు 2000లో డీఎంకే పార్టీలో చేరి, 2001 మరియు 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తాండరంపటు నియోజకవర్గం నుండి వరుసగా గెలిపొందారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
తర్వాత ఈ.వి.వేలు తన నియోజకవర్గాన్ని తీరువన్నమలై మార్చుకొని 2011, 2016 మరియు 2016 ఎన్నికలలో వరుసగా గెలిపొందారని తెలిసింది. 1991 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ.వి.వేలు డీఎంకే పార్టీకి ప్రచారం చేసినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కరుణానిధి రిక్షా నడుపుతున్నది ఈ.వి.వేలు కాదని కొందరు తమిళనాడు జర్నలిస్టులు కూడా స్పష్టం చేశారు.
తమిళనాడులోని ఈ.వి.వేలుకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించి రూ. 22 కోట్ల రూపాయల డబ్బును సీజ్ చేసినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అంతేకాదు, లెక్కలు చూపని వందల కోట్ల లావాదేవీలను ఐటి అధికారులు ఈ రైడ్‌లలో బయట పెట్టినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ. వి. వేలు ఆస్తులపై ఐటి అధికారులు నిర్వహించిన సోదాల గురించి పబ్లిష్ చేసిన వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ ఫోటోలో కరుణానిధి రిక్షా నడుపుతున్నది తమిళనాడు ప్రస్తుత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి ఈ.వి.వేలు కాదు.