Fake News, Telugu
 

కాంగ్రెస్ ‘అభయ హస్తం మేనిఫెస్టో’ ద్వారా ముస్లింలకే కాకుండా ఇతర వర్గాలకు కూడా పథకాలు ప్రకటించింది

0

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ పథకాలను పోస్టు చేస్తూ, కొత్తగా పెళ్లి చేసుకున్న క్రిస్టియన్, ముస్లిములకు ₹1,60,000, ఇమామ్, పాస్టర్ల జీతం ₹12,000, 10th పాస్ అయితే ₹10,000, ఇంటర్ పాస్ అయితే ₹15,000, డిగ్రీ పాస్ అయితే ₹25,000, పీజీ చేస్తే ₹1,00,000, ఎం.ఫిల్ పూర్తి చేస్తే ₹5,00,000 అని ప్రకటించింది అని, ఇటువంటి పథకాలు హిందువులకు ప్రకటించలేదు అని, దాని అర్థం హిందువులు క్రిస్టీయన్ లేదా ముస్లింలుగా మారాలని అంటూ షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం 

క్లెయిమ్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ కింద, కొత్తగా పెళ్లి చేసుకున్న క్రిస్టియన్, ముస్లిములకు ₹1,60,000, ఇమామ్, పాస్టర్ల జీతం ₹12,000, 10th పాస్ అయితే ₹10,000, ఇంటర్ పాస్ అయితే ₹15,000, డిగ్రీ పాస్ అయితే ₹25,000, పీజీ చేస్తే ₹1,00,000, ఎం.ఫిల్ పూర్తి చేస్తే ₹5,00,000 అని ప్రకటించింది. హిందువుల కోసం ఇటువంటి ప్రకటన ఏమి చేయలేదు. 

ఫాక్ట్(నిజం): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మైనారిటీ డెక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా, 17 నవంబర్ 2023న మానిఫెస్టో ద్వారా ఇతర వర్గాలకు కూడా పథకాలు ప్రకటించింది.  విద్యా జ్యోతుల పథకం కింద, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్య పూర్తి చేయటానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించారు. మహిళా శిశు సంక్షేమం కింద, కళ్యాణమస్తు పథకం పేరుతో ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి రూ. 1,00,000 ఆర్థిక సహాయంతో పాటు 10 గ్రాముల బంగారం అందించాలని ప్రతిపాదించారు. అంతే కాకుండా, హిందూ దేవాలయాలు మరియు గిరిజన పూజారులకు రూ.12,000 వేతనం ఇవ్వాలని ప్రతిపాదించారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, క్లైములో వివరించిన పథకాలు మైనారిటీ డిక్లరేషన్ ద్వారా ప్రకటించినవి కాగా, కాంగ్రెస్, తన అభయ హస్తం మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు పలు పథకాలు ప్రకటించింది అని తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ).

మైనారిటీ డెక్లరేషన్‌లో మైనారిటీల కోసం ప్రకటించిన  విధంగా, మానిఫెస్టోలో విద్యా జ్యోతుల పథకం కింద, ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాసైతే రూ. 10,000, ఇంటర్ పాసైతే రూ. 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. 25,000, పీజీ పూర్తి చేస్తే రూ.1,00,000 అందజేస్తామని ప్రకటించింది. అంతే కాకుండా ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన యువతకు రూ. 5,00,000 అందజేత అని కాంగ్రెస్ తెలిపింది. 

మహిళా శిశు సంక్షేమం కింద కళ్యాణమస్తు పథకం పేరుతో ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి రూ. 1,00,000ల ఆర్ధిక సహాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం అందిస్తామని తెలిపింది. 

మైనారిటీ డెక్లరేషన్‌లో ఇమామ్, పాస్టర్లకు రూ.12,000 వేతనం ప్రకటించిన విధంగా, మానిఫెస్టోలో హిందూ దేవాలయాలు మరియు గిరిజన పూజారులకు రూ. 12,000 వేతనం ఇస్తామని తెలిపారు. 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. 09 నవంబర్ 2023న మైనారిటీ డెక్లరేషన్‌ ప్రకటించగా,  17 నవంబర్ 2023న కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టోను ప్రకటించింది. అయితే ముందుగా ప్రకటించిన మైనారిటీ పథకాలు షేర్ చేస్తూ హిందువులకు ఇటువంటి పథకాలు కాంగ్రెస్ ప్రకటించలేదు అని షేర్ చేస్తున్నారు.  

చివరిగా, కాంగ్రెస్ ‘అభయహస్తం మేనిఫెస్టో’ ద్వారా ముస్లింలకే కాకుండా ఇతర వర్గాలకు కూడా పథకాలు ప్రకటించింది.

Share.

About Author

Comments are closed.

scroll