13 జూలై 2024న, అమెరికాలోని పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ చెవి పైభాగంలో బుల్లెట్ తగిలి గాయం అయి రక్తం కారింది. ఈ కాల్పుల్లో ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ నిందితుడిని గుర్తించి, అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గుర్తించింది. ఈ నేపథ్యంలోనే, ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తి యొక్క వీడియో అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలోని వ్యక్తి “నా పేరు థామస్ మాథ్యూ క్రూక్స్, నేను రిపబ్లికన్‌లను ద్వేషిస్తున్నాను, ట్రంప్‌ను ద్వేషిస్తున్నాను” అని మాట్లడడం మనం చూడవచ్చు. పలు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వీడియోలోని వ్యక్తి ట్రంప్ షూటర్ అని చెప్తూ కథనాలు పబ్లిష్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తిని చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని వ్యక్తి ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ కాదు. ట్రంప్ పై హత్యాయత్నం చేసిన షూటర్ యొక్క ఫోటోను పలు మీడియా సంస్థలు ప్రసారం చేయగా, ‘@jewgazing’ అనే X(ట్విట్టర్) వినియోగదారుడు ట్రంప్ షూటర్ తనకు చాలా పోలికలు ఉండడంతో కేవలం వినోదం కోసం ఈ వీడియోను రూపొందించి షేర్ చేశాడు. ట్రంప్ పై హత్యాయత్నం చేసిన నిజమైన షూటర్ అంటూ ఈ వీడియో వైరల్ కాగా, @jewgazing తాను థామస్ కాదని, తాను ట్రంప్ పై హత్యాయత్నం చేసిన నిజమైన షూటర్ కాదని స్పష్టం చేస్తూ తన X(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా, డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెంటనే గుర్తించి, అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ వీడియోలోని వ్యక్తి ఘటన జరిగిన తరువాత కూడా వీడియో మరియు ఫోటోలను షేర్ చేశాడు. అయితే, వీడియోలోని వ్యక్తికి సంబంధించిన ఎలాంటి సమాచారం మాకు తెలియలేదు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు
ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ప్రస్తుతం షేర్ అవుతున్న వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ కాదని పేర్కొంటున్న పలు X(ట్విట్టర్) పోస్టులు లభించాయి (ఇక్కడ, & ఇక్కడ). అలాగే, కొందరు X(ట్విట్టర్) వినియోగదారులు వైరల్ వీడియోలోని వ్యక్తిని X(ట్విట్టర్) వినియోగదారుడు @jewgazing అని పేర్కొన్నారు.

తదుపరి మేము X(ట్విట్టర్)లో @jewgazing యొక్క ప్రొఫైల్ ను పరశీలించగా, కేవలం ఆరు పోస్ట్‌లు మాత్రమే మాకు కనిపించాయి. అలాగే, అతను తన ప్రొఫైల్ ఫోటోను కొన్ని గంటల ముందే మార్చినట్లు తెలుస్తుంది.

కొంతమంది X(ట్విట్టర్)వినియోగదారులు ‘@jewgazing’ యొక్క పాత పోస్ట్‌ల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసినందున, మేము ఈ ఖాతా యొక్క పాత పోస్ట్‌ల ఆర్కైవ్ వెర్షన్ కోసం వెతకగా, పలు పోస్టులు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ లభించాయి(ఇక్కడ). ఈ ఆర్కైవ్డ్ పోస్టులను పరశీలించగా, ట్రంప్ పై హత్యాయత్నం చేసిన షూటర్ యొక్క ఫోటోను పలు మీడియా సంస్థలు ప్రచారం చేయడం ప్రారంభించగానే @jewgazing షూటర్‌ను లాగానే నీలిరంగు టీ-షర్ట్ మరియు పొడవాటి జుట్టుతో ఉన్న అతని సైడ్ ప్రొఫైల్ ఫోటోను X(ట్విట్టర్)లో షేర్ చేశాడని తెలిసింది (ఇక్కడ).

అలాగే, మరొక పోస్టులో వైరల్ వీడియోను షేర్ చేసినట్లు మేము గుర్తించాము.(ఇక్కడ)

ట్రంప్ పై హత్యాయత్నం చేసిన నిజమైన షూటర్ అంటూ ఈ వీడియో వైరల్ కాగా, @jewgazing అతను కేవలం వినోదం కోసం ఈ వీడియోను రూపొందించినట్లు పేర్కొంటూ పోస్ట్ చేసాడు(ఇక్కడ). అలాగే అతను ఈ వీడియో పోస్ట్ చేయకుండా ఉండాలిసింది అని ఒక పోస్టులో పేర్కొన్నాడు. అలాగే, తాను థామస్ కాదని, తాను ట్రంప్ పై హత్యాయత్నం చేసిన నిజమైన షూటర్ కాదని స్పష్టం చేస్తున్నట్లు చెప్తూ చేసిన పోస్టు ఒకటి లభించింది (ఇక్కడ). డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెంటనే గుర్తించి, అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ వీడియోలోని వ్యక్తి ఘటన జరిగిన తరువాత వీడియో మరియు ఫోటోలను షేర్ చేశాడు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేయలేదని మనం నిర్థారించవచ్చు. అయితే, వీడియోలోని వ్యక్తికి సంబంధించిన ఎలాంటి సమాచారం మాకు తెలియలేదు.

చివరగా, ఈ వైరల్ వీడియోలోని వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ కాదు.