Fake News, Telugu
 

ఈ ఫొటోలోని వ్యక్తిని ఒక న్యాయమూర్తిను చంపిన నేరానికి 2007లో ఇరాన్‌లో బహిరంగంగా ఉరి తీసారు

0

ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో  ఇరాన్ అధ్యక్షుడుకి వ్యతిరేకంగా రాసినందుకు ఒక వ్యక్తిని క్రేన్‌కు వేలాడదీసి ఉరి వేసారంటూ ఒక ఫోటో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ & ఇక్కడ). తన 5 సంవత్సరాల కూతురి ముందే ఉరి తీసారంటూ ఒక అమ్మాయి ఫోటోను కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇరాన్ అధ్యక్షుడుకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాసినందుకు ఒక వ్యక్తిని క్రేన్‌కు వేలాడదీసి ఉరి తీసిన ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇరాన్‌కు చెందిన మజిద్ కవౌసిఫర్. ఒక న్యాయమూర్తిని హత్య చేసిన నేరానికి ఇతనిని ఇరాన్‌లోని 2007లో సెంట్రల్ టెహ్రాన్‌లో బహిరంగంగా ఉరి తీశారు. వైరల్ ఫొటోలో ఉన్న అమ్మాయి ఈ ఉరి తీసే సమయంలో అక్కడే ఉందని పలు కథనాలు రిపోర్ట్ చేసాయి. కానీ ఈ అమ్మాయి అతని కూతురు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని ఇరాన్ లో నిజంగానే ఉరి తీసిన మాట నిజమే అయినప్పటికీ, ఈ ఘటన చాలా సంవత్సరాల క్రితం జరిగింది. పైగా ఆ వ్యక్తిని ఉరి తీసింది ఒక హత్య చేసినందుకు, ఇరాన్ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో రాసినందుకు కాదు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను ప్రచురించిన పలు బ్లాగ్‌లు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ బ్లాగులలో చెప్తున్నదాని ప్రకారం ఈ వ్యక్తి పేరు ఇరాన్‌కు చెందిన మజిద్ కవౌసిఫర్. ఒక న్యాయమూర్తిని చంపినందుకు ఇతనిని బహిరంగంగా ఉరి తీసారు.

ఈ బ్లాగ్‌లో అందించిన వివరాల ఆధారంగా గూగుల్‌లో వెతకగా ఈ వ్యక్తిని ఉరి తీసినప్పటి కొన్ని స్టాక్ ఫోటోలు మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ ఫోటోల వివరణ ప్రకారం మజిద్ కవౌసిఫర్ అనే ఇతన్ని, ఇతని మేనల్లుడు హోస్సేన్ కవౌసిఫర్‌తో కలిపి ఒక న్యాయమూర్తిని చంపిన నేరానికి 2007లో సెంట్రల్ టెహ్రాన్‌లో బహిరంగంగా ఉరి తీసారు. ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పళ్ళు వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ కథనాలలో ఎక్కడ కూడా ఇతన్ని తన ఐదు ఏళ్ల కూతురు ముందు ఉరి తీసినట్టు మాత్రం చెప్పలేదు. కాకపోతే ప్రస్తుతం షేర్ అవుతున్న ఫొటోలో ఉన్న అమ్మాయి ఈ ఉరి తీసిన సమయంలో అక్కడే ఉన్నదని పలు కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే ఈ అమ్మాయి మజిద్ కవౌసిఫర్ కూతురు అని మాత్రం ఏ కథనం ప్రస్తావించలేదు.

గతంలో ఇదే ఫోటోను హంజా బెండెల్లాడ్జ్ (బ్యాంకులను హ్యాక్ చేసి, ఆఫ్రికా మరియు పాలస్తీనాకు డబ్బులు  విరాళంగా ఇచ్చిన వ్యక్తి) ఉరి తీసినప్పటి ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అప్పడు ఈ క్లెయిమ్‌ను ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు. 

చివరగా, ఈ ఫొటోలోని వ్యక్తిని ఒక న్యాయమూర్తిను చంపిన నేరానికి 2007లో ఇరాన్‌లో బహిరంగంగా ఉరి తీసారు.

Share.

About Author

Comments are closed.

scroll