కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘గృహలక్ష్మీ’ పథకం కార్యక్రమానికి కేవలం ముస్లిం మహిళలు మాత్రమే హాజరయిన దృశ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతుంది. కర్ణాటకలో గృహలక్ష్మీ పథకం కింద కేవలం ముస్లిం మహిళలు మాత్రమే లబ్దిపొందుతున్నారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న గృహలక్ష్మీ పథకంలో కేవలం ముస్లిం మహిళలు మాత్రమే లబ్ధిపొందుతున్నారు.
ఫాక్ట్ (నిజం): ఆహార మరియు పౌరసరఫరాల శాఖ జారీ చేసిన అంత్యోదయ, బిపిఎల్ మరియు ఎపిఎల్ రేషన్ కార్డులలో కుటుంబ పెద్దగా పేర్కొనబడిన మహిళలు అందరూ ‘గృహలక్ష్మీ’ పథకానికి అర్హులని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. గృహలక్ష్మీ పథకంతో లబ్ధిపొందడానికి ముస్లింలతో పాటు అన్ని మతాల మహిళలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. గృహలక్ష్మీ పథకం కింద కేవలం ముస్లిం మహిళలు మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయబడుతారని కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటో గృహలక్ష్మీ పథకం లాంచ్ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తీశారని పలు యూసర్లు ఇటీవల షేర్ చేసినట్టు తెలిసింది. 30 ఆగస్టు 2023 నాడు రాహుల్ గాంధీ సమీక్షంలో కర్ణాటక ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని లాంచ్ చేసిన దృశ్యాలను లబ్ధిదారులు లైవ్‌గా వీక్షించడానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.
గృహలక్ష్మీ పథకం లాంచ్ దృశ్యాలను వీక్షించడానికి ఏర్పాటు చేసిన సమావేశాలలో ముస్లింలతో సహా ఇతర మతస్థుల మహిళలు కూడా హాజరయిన వీడియోలు మరియు ఫోటోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. గృహలక్ష్మీ పథకం కింద లబ్ధిపొందడానికి వివిధ మతాల మహిళలు 2023 జులై నెల నుండే గృహలక్ష్మీ పథకంలో దరఖాస్తు (రిజిస్టర్) చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
గృహలక్ష్మీ పథకం కింద అర్హులైన మహిళలకు కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెల రూ. 2000 అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.28 కోట్ల మంది అర్హులైన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని అని కర్ణాటక ప్రభుత్వం జులై నెలలో ప్రకటించింది.
ఆహార మరియు పౌరసరఫరాల శాఖ జారీ చేసిన అంత్యోదయ, బిపిఎల్ మరియు ఎపిఎల్ రేషన్ కార్డులలో కుటుంబ పెద్దగా పేర్కొనబడిన మహిళలు అందరూ ఈ పథకానికి అర్హులని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. 30 ఆగస్టు 2023 నాడు ఈ పథకం ప్రారంభంతో కర్ణాటక రాష్ట్రంలోని సుమారు 1.1 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 2000 డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా బ్యాంక్ ఖాతాలోకి క్రెడిట్ అవ్వనున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. గృహలక్ష్మీ పథకంలో లబ్ధిదారులను మాతాలానుసారంగా ఎంపిక చేయరు. గృహలక్ష్మీ పథకంలో కేవలం ముస్లిం మహిళలు మాత్రమే లబ్ధిదారులుగా ఎన్నుకోబడుతారని కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు.
చివరగా, కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం కింద అన్ని మతాల మహిళలు లబ్ధిపొందవచ్చు.