Fake News, Telugu
 

నాగు పాముకి పూజ చేస్తున్న ఈ ఘటన మలేషియాలోని ఒక హిందూ దేవాలయంలో జరిగింది, నేపాల్‌లో కాదు

0

గుడిలో పూజారి పొడవైన నాగు పాముకి పూజ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ, ఈ వీడియో నేపాల్‌లోని పశుపతినాథ్ దేవాలయానికి సంబంధించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నేపాల్‌లోని పశుపతినాథ్ దేవాలయంలో పూజారి ఒక నాగు పాముకి పూజ చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): నాగు పాముకి పూజ చేస్తున్న ఈ వీడియో మలేషియాలోని మలక్కా ప్రాంతంలోని శ్రీ ప్రత్యంగరా దేవి శక్తి బెడ్డం అనే ఆలయంలో 2014లో జరిగిన ఒక పూజకి సంబంధించింది. ఈ ఘటనని పలు వార్తా సంస్థలు అప్పట్లో రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి నేపాల్‌లోని పశుపతినాథ్ దేవాలయానికి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో 2015 నుండే యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. యూట్యూబ్‌లోని పలు చానల్స్‌లో అప్లోడ్ చేయబడ్డ ఇదే వీడియోని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ యూట్యూబ్‌ వీడియోల ప్రకారం ఈ ఘటన మలేషియాలోని మలక్కా ప్రాంతంలోని ఒక గుడిలో జరిగినట్టు తెలుస్తుంది.

ఈ యూట్యూబ్‌ వీడియోలలో చెప్తున్న దాని ఆధారంగా గూగుల్‌లో వెతకగా ఈ వీడియోని రిపోర్ట్ చేసిన మలేషియాకి చెందిన ఒక 2014 ఆన్లైన్ వార్తా కథనం కనిపించింది. ఈ కథనం ప్రకారం మలక్కా, కేసాంగ్ పాజాక్ ప్రాంతంలోని శ్రీ ప్రత్యంగరా దేవి శక్తి బెడ్డం ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఈ పూజ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఒక భక్తుడు ఈ వీడియో చిత్రీకరించి వాట్సాప్‌లో షేర్ చేయగా, అలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆలయ పూజారి కె.ఎమ్. తినేగేశ్వర్ శివాచార్ అయ్యర్ మాట్లాడుతూ ఈ నాగు పాముని ప్రత్యేకించి పూజ కోసం తీసుకు రావడం జరిగిందని చెప్పినట్టు ఈ కథనంలో పేర్కొన్నారు. భారత్‌లోని పలు వార్తా సంస్థలు కూడా ఈ వీడియోని ప్రచారం చేసాయని కూడా ఈ కథనంలో పేర్కొన్నారు.

శ్రీ ప్రత్యంగరా దేవి శక్తి బెడ్డం పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీలో వైరల్ వీడియోలోని దేవుడి విగ్రహం, పూజారికి సంబంధించిన చాలా వీడియోలు చూడొచ్చు. ఈ ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ గుడి మలేషియాలో ఉందని పేర్కొన్నారు. వీటన్నిటిబట్టి, ఈ వీడియో నేపాల్‌లోని పశుపతినాథ్ దేవాలయానికి సంబంధించింది కాదని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, నాగు పాముకి పూజ చేస్తున్న ఈ ఘటన మలేషియాలోని ఒక హిందూ దేవాలయంలో జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll