లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఒక నల్లటి రాతిపై ప్రాచీన ఈజిప్ట్ రాజు నెక్టేనాబో శివలింగాన్ని పూజిస్తున్నటువంటి దృశ్యం చెక్కబడిందని చెప్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలోనల్లటి రాతిపై ప్రాచీన ఈజిప్ట్ రాజు నెక్టెనాబో శివలింగాన్ని పూజిస్తున్నటువంటి దృశ్యం ఉంది.
ఫాక్ట్: లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో రాతిపై చెక్కబడిన ఈ బొమ్మలో ప్రాచీన ఈజిప్ట్ రాజు నెక్టెనాబో తన మోకాళ్ళపై కూర్చొని చేతిలోని బ్రెడ్(రొట్టె)ని సమార్పిస్తున్నాడని బ్రిటిష్ మ్యూజియం అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఇదే ఫోటో ఆలమీ, ఫ్లికర్ వంటి వెబ్‌సైట్లలో ఉండడం గుర్తించాం. అయితే, ఫోటో కింద ఇచ్చిన వివరణలో, రాతిపై చెక్కబడిన ఈ ప్రాచీన కళాఖండంలో నెక్టెనాబో అనే ఈజిప్ట్ పాలకుడు మోకాళ్ళపై కూర్చొని బ్రెడ్(రొట్టె)ని సమార్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమాచారం ఆధారంగా బ్రిటిష్ మ్యూజియం అధికారిక వెబ్‌సైట్లో మరిన్ని వివరాల కోసం వెతికాం. ఇందులో కూడా ఈ రాతిపై చెక్కబడిన నెక్టెనాబో బొమ్మ చేతిలో ఉన్నది పొడవాటి రొట్టె ( tall loaf of bread) అని పేర్కొన్నారు.
అలాగే, పురాతన ఈజిప్ట్ నిర్మాణాల చరిత్రను వివరించే “Temples of the Last Pharoahs” పుస్తకంలో (పేజీ నెం. 105) కూడా నెక్టెనాబో చేతిలో ఉన్నది పొడవాటి బ్రెడ్ అని నిర్ధారించారు. తన చేతిలో ఉన్నది శివలింగం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
పైగా ప్రాచీన ఈజిప్ట్ లో బ్రెడ్‌ను ముఖ్యమైన ఆహార పదార్ధంగా భావించేవారిని ఆధారాలు ఉన్నాయి.
ఇక నెక్టెనాబో తలపై పాము ఆకారంలో ఉన్న ఆభరణాన్ని యురేయస్ (Uraeus) అంటారు. అధికారానికి ప్రతీకగా దీనిని ప్రాచీన ఈజిప్ట్ పాలకులు ధరించేవారు.
చివరిగా, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న రాతిపై చెక్కబడిన ప్రాచీన ఈజిప్ట్ రాజు నెక్టేనాబో బొమ్మ చేతిలో ఉన్నది శివలింగం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.