Fake News, Telugu
 

వైరల్ ఫోటోలో ఉన్న ఇల్లు అవామీ లీగ్‌ పార్టీ ఎంపీగా ఉన్న మాజీ బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రఫే మోర్తాజాకు చెందింది

0

ప్రసుత్తం బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో, “బంగ్లాదేశీ హిందూ క్రికెటర్ లిటన్ దాస్ ఆస్తులు తగులబెట్టారు” అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టులలో ఓ ఇల్లు కాలిపోతున్న ఫోటో, పక్కన లిటన్ దాస్ ఫోటోనూ మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో హిందూ క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు, అందుకు సంబంధించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): వైరల్ ఫోటోలో మంటల్లో కాలిపోతూ కనిపిస్తున్న ఇల్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యొక్క అవామీ లీగ్‌ పార్టీలో ఎంపీగా ఉన్న మాజీ క్రికెట్ కెప్టెన్ మష్రఫే బిన్ మోర్తజాకు చెందింది. 05 ఆగస్ట్ 2024న షేక్ హసీనా రాజీనామా తర్వాత, జరిగిన అల్లర్లలో నరైల్-2 నియోజకవర్గ ఎంపీ మోర్తజా ఇంటిని దుండగులు ధ్వంసం చేసి తగులబెట్టారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని యుద్ధవీరులుగా బంగ్లాదేశ్‌లో పేర్కొంటారు. బంగ్లాదేశ్ ఏర్పాటు అనంతరం అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% యుద్ధవీరుల పిల్లలకు, వారసులకు రిజర్వ్ చేశారు. 2018లో ఈ రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. కానీ, ఆ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్ ప్రారంభంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. బంగ్లా విముక్తి యుద్ధవీరుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ జూన్ 2024లో షేక్ హసీనా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. దాంతో జరిగిన భారీ ఆందోళనలు, ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించింది. కానీ, 200 మంది అమాయకుల మృతికి ప్రధాని హసీనా కారణమంటూ, ఆమె తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 03 & 04 ఆగస్ట్ 2024న, బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. దీంతో అక్కడ నిరవధిక కర్ఫ్యూ విధించారు. 05 ఆగస్టు 2024న, ఆందోళనకారులు ‘ఢాకా లాంగ్ మార్చ్’కు పిలుపునిచ్చారు, ఈ నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఢాకాలోని ఆమె అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు చొరబడి, లూటీ చేసి ధ్వంసం చేశారు.(ఇక్కడ, ఇక్కడ)

పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు మరియు వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే  హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఇకపోతే వైరల్ వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు, బంగ్లాదేశ్‌ క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, దాస్ ఇంటిపై దాడి జరిగినట్లు ఎలాంటి  విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు.
ఈ క్రమంలోనే వైరల్ ఫోటోలో ఉన్న మంటల్లో కాలిపోతున్న ఇల్లుకు సంబంధించిన దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, వైరల్ ఫోటోలో కనిపిస్తున్న ఇల్లు షేక్ హసీనా యొక్క అవామీ లీగ్‌ పార్టీలో ఎంపీగా ఉన్న మాజీ క్రికెట్ కెప్టెన్ మష్రఫే మోర్తజాకు చెందింది అని తెలిసింది.

రిపోర్ట్స్ ప్రకారం, 05 ఆగస్ట్ 2024న షేక్ హసీనా రాజీనామా తర్వాత, నరైల్-2 నియోజకవర్గ అవామీ లీగ్‌ ఎంపీ మష్రఫే బిన్ మోర్తజా ఇంటిని దుండగులు ధ్వంసం చేసి తగులబెట్టారు, అతని ఇంటిపై నిరసనకారులు దాడి చేసినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే, నరైల్ జిల్లా అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పుపెట్టిన దుండగులు జిల్లా అవామీ లీగ్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ ఇళ్లను కూడా ధ్వంసం చేశారని తెలుస్తుంది. మష్రాఫే మాజీ ప్ర‌ధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని, 2017లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2018లో అవామీ లీగ్‌లో మొర్తజా చేరాడని. 2019లో నరేల్-2 పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొర్తజా అధికార అవామీ లీగ్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యాడని, 2024 ఎన్నికల్లోనూ మరోసారి పదవిని కైవసం చేసుకున్నాడని, ప్రధానీ షేక్ హసీనాతో మొర్తజాకు సత్సంబంధాలు ఉన్నాయి అని వార్త కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ). మష్రఫే తన క్రికెట్ కెరీర్‌లో బంగ్లాదేశ్‌కు 117 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. 36 టెస్టులు, 220 వన్డే మ్యాచ్ లతో పాటు 54 టీ20 మ్యాచ్‌లలో ఆడిన అతను 390 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు, అలాగే 2,955 పరుగులు చేశాడు (ఇక్కడ).

అంతేకాకుండా, మేము నరైల్ జిల్లాలోని మష్రఫే మోర్తజా ఇల్లును గూగుల్ మ్యాప్‌లో జియో లొకేట్ చేసాము. గూగుల్ మ్యాప్‌లో కనిపిస్తున్న ఇల్లు దృశ్యాలను వైరల్ ఫోటోలోని ఇంటితో పోల్చి చూస్తే, రెండు  దృశ్యాలు ఒకే ఇల్లును చూపిస్తున్నాయని మనం నిర్ధారించవచ్చు. అలాగే, మేము నరైల్ లోని మొర్తజా ఇల్లుకు సంబంధించిన పాత వీడియోలను యూట్యూబ్ లో కన్నుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ). 05 ఆగస్ట్ 2024న ఆందోళనకారులు మోర్తజా ఇంటిని ధ్వంసం చేసి తగులబెట్టిన దృశ్యాలను పలు బంగ్లాదేశ్ వార్త సంస్థలు తమ యూట్యూబ్ ఛానల్స్ లో షేర్ చేశాయి(ఇక్కడ, ఇక్కడ). నరైల్ జిల్లాలోని మష్రఫే మోర్తజా ఇల్లును గూగుల్ స్ట్రీట్ వ్యూలో క్రింద చూడవచ్చు. దీన్ని బట్టి వైరల్ ఫోటోలో కనిపిస్తున్న ఇల్లు బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజాకు చెందినది మనం నిర్ధారించవచ్చు.

చివరగా, వైరల్ ఫోటోలో కనిపిస్తున్న ఇల్లు బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజాకు చెందినది, అతను బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యొక్క అవామీ లీగ్ పార్టీలో ఎంపీగా ఉన్నాడు.

Share.

About Author

Comments are closed.

scroll