Fake News, Telugu
 

2018 నుండి ఎన్నికైన హైకోర్టు న్యాయమూర్తులలో 75% మంది జనరల్ కేటగిరీ వారే అన్న వార్తను తప్పుగా అర్థం చేసుకొని 75% బ్రాహ్మణులే అని షేర్ చేస్తున్నారు

0

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు సంబంధించి 661 మంది న్యాయమూర్తులను నియమించగా ఇందులో 499 మంది, అనగా సుమారు 75% బ్రాహ్మణులే అని ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు సంబంధించి 661 మంది న్యాయమూర్తులను నియమించగా ఇందులో 499 మంది బ్రాహ్మణులే.

ఫాక్ట్(నిజం): ఇటీవల రాజ్యసభలో కేంద్ర న్యాయమంత్రి మాట్లాడుతూ 2018 నుండి ఎన్నికైన 661 హైకోర్టు న్యాయమూర్తులలో  499 మంది జనరల్ కేటగిరీ వారే అని తెలిపారు. ఐతే ఈ జనరల్ కేటగిరీను తప్పుగా అర్ధం చేసుకొని వీరందరూ బ్రాహ్మణులే అంటూ వార్తలు షేర్ చేస్తున్నారు. ఐతే ఈ 499 మంది సామజిక వర్గానికి చెందిన వివరాలు తెలియలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల తమిళనాడు DMK పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు విల్సన్ రాజ్యసభలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకంలో సామాజిక ప్రాతినిధ్యం ఉండేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు గురించి అడిగిన ప్రశ్నకు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జవాబిస్తూ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 &  224 ప్రకారం కుల, మతాలకు అతీతంగా జరుగుతుందని తెలిపారు.

అందువల్ల న్యాయమూర్తుల నియమానికి సంబంధించి వారి సామాజిక వర్గాలకు సంబందించిన వివరాలు తెలిసేవి కావని అన్నారు. కానీ తమ ప్రభుత్వం 2018 నుండి న్యాయమూర్తుల సామాజిక వివరాలు కూడా సేకరిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే అయన మాట్లాడుతూ ‘2018 నుండి 22 జులై 2024 మధ్య కాలంలో నియమితులైన 661 మంది హైకోర్టు న్యాయమూర్తులలో 21 మంది ఎస్సీ వర్గానికి చెందినవారు, 12 మంది ఎస్టీ వర్గాలకు చెందినవారు, 78 మంది ఓబీసీ వర్గానికి చెందినవారు మరియు 499 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు ఉన్నారని’  తెలిపారు.

కేంద్ర మంత్రి 499 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు అని మాత్రమే చెప్పారు కానీ వీరు ఏయే కులాలకు చెందిన వారో మాత్రం చెప్పలేదు. న్యాయమూర్తులలో అన్ని వార్గల ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.  ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే దీనిని కొందరు తప్పుగా అర్ధం చేసుకొని 499 మంది బ్రాహ్మణులే అంటూ వార్తలు షేర్ చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో బ్రాహ్మణులు:

2021లో పబ్లిష్ అయిన ఈ కథనం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఇతరులతో పోల్చుకుంటే బ్రాహ్మణుల ప్రాతినిధ్యం అధికంగా ఉంది. ఈ కథనం ప్రకారం చారిత్రకంగా చూసుకుంటే ప్రస్తుత న్యాయమూర్తి (50వ ప్రధాన న్యాయమూర్తి) వరకు కనీసం 15 మంది బ్రాహ్మణులు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. అంటే బ్రాహ్మణ ప్రధాన న్యాయమూర్తి శాతం దాదాపు 30% ఉంటుంది (ఇక్కడ).

చివరగా, 2018 నుండి ఇప్పటి వరకు హైకోర్టు న్యాయమూర్తులలో 75% మంది జనరల్ కేటగిరీ వారే అన్న వార్తను తప్పుగా అర్ధం చేసుకొని 75% బ్రాహ్మణులే అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll