Fake News, Telugu
 

ముస్లింలు అమెరికాలోకి రాకుండా నిషేధించాలని ట్రంప్ ఇటీవల అన్నట్లుగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

“ఏ ఒక్క ముస్లింని U.S. లోకి రానివ్వకుండా చూడాలి, నిషేధం విధించాలని డిమాండ్ చేసిన ట్రంప్” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో మనం CNN న్యూస్ ఛానల్ లోగోను చూడవచ్చు, అలాగే CNN ఛానెల్ ప్రతినిధి ట్రంప్ నిర్ణయంపై కొంతమందిని వారి అభిప్రాయాన్ని అడగడం కూడా చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమెరికాలోకి ఒక్క ముస్లిం కూడా రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ ఇటీవల 2024లో అన్నారు, దానికి సంబంధించిన CNN కథనం.

ఫాక్ట్(నిజం): 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా, డిసెంబర్ 2015లో, మొదటిసారి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ USలోకి ఒక్క ముస్లిం కూడా ప్రవేశించకుండా నిషేధించాలని అన్నారు. ఈ వైరల్ వీడియో ట్రంప్ అప్పటి వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారుల అభిప్రాయాలను CNN న్యూస్ ఛానల్ అడుగుతున్న దృశ్యాలను చూపిస్తున్నది. 2017లో, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే 07 ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలు మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు. ఆతర్వాత ఈ నిషేధాన్ని మరో ఆరు దేశాలకు కూడా అమలు చేసారు. US సుప్రీం కోర్ట్ కూడా 2018లో ట్రంప్ పలు దేశాల ప్రజలు అమెరికాలోకి రాకుండా విధించిన నిషేధాన్ని 5-4 ఓట్ల తేడాతో సమర్థిస్తూ తీర్పునిచ్చింది. 2021లో అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్  రద్దు చేసారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ గతంలో విధించిన ట్రావెల్ బ్యాన్‌ను మళ్లీ అమలు చేస్తానని ఇటీవల పలు సందర్భాల్లో చెప్పారు. అయితే, ఇటీవల ఎక్కడా కూడా ముస్లింలు ఎవరూ అమెరికాలోకి రాకుండా నిషేధించాలని ట్రంప్ అనలేదు. కేవలం ఇస్లామిక్ టెర్రరిస్ట్లను నిషేధించాలని అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో మనం CNN న్యూస్ ఛానల్ లోగోను మనం చూడవచ్చు. దీని ఆధారంగా, ఈ వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఇదే వీడియోని 08 డిసెంబర్ 2015న ‘CNN‘ తమ యూట్యూబ్ ఛానెల్‌లో “Trump supporters react to his plan to ban Muslims ” అనే శీర్షికతో షేర్ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, 2016 US అధ్యక్ష ఎన్నికల సందర్భంగా, డిసెంబర్ 2015లో, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ USలోకి ఒక్క ముస్లిం కూడా ప్రవేశించకుండా నిషేధించాలని అన్నారు, దీనికి ఆయన మద్దతుదారులు పూర్తి మద్దతు తెలిపారు.

2016 US అధ్యక్ష ఎన్నికల సందర్భంగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ USలోకి ఒక్క ముస్లిం కూడా ప్రవేశించకుండా నిషేధించాలని పలు సందర్భాల్లో అన్నారు (ఇక్కడ, ఇక్కడ).

2017లో, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే, ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, సోమాలియా, సూడాన్ మరియు యెమెన్ వంటి 07 ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలు మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు (ఇక్కడ, ఇక్కడ).

చాలా మంది ఈ నిర్ణయాన్ని US సుప్రీం కోర్ట్‌లో సవాలు చేయగా, US సుప్రీం కోర్ట్ కూడా 2018లో ట్రంప్ పలు దేశాల ప్రజలు అమెరికాలోకి రాకుండా విధించిన నిషేధాన్ని 5-4 ఓట్ల తేడాతో సమర్థిస్తూ తీర్పునిచ్చింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే 2020లో ట్రంప్ ప్రభుత్వం మరో ఆరు దేశాలను నుండి ప్రజలు కూడా అమెరికాకు ప్రవేశించకుండా నిషేధించారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

20 జనవరి 2021న, అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  ప్రెసిడెంట్ జో బైడెన్ ట్రంప్ ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13780 రద్దు చేసారు (ఇక్కడ, ఇక్కడ).

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ గతంలో విధించిన ట్రావెల్ బ్యాన్‌ను మళ్లీ అమలు చేస్తానని, ఈసారి మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేరుస్తానని, గాజా నుంచి శరణార్థులు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తానని పలు సందర్భాల్లో చెప్పారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). అయితే, ఇటీవల ఎక్కడా ముస్లింలు ఏవరూ అమెరికాలోకి రాకుండా నిషేధించాలని ట్రంప్ అనలేదు. కేవలం ఇస్లామిక్ టెర్రరిస్ట్లను నిషేధించాలని అని అన్నారు.

చివరగా, ముస్లింలు అమెరికాలోకి రాకుండా నిషేధించాలని ట్రంప్ ఇటీవల అన్నట్లుగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పాత వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll