Fake News, Telugu
 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున గణతంత్ర దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించలేదు, కేవలం వేడుకలు ఆ రోజు మొదలుపెడతారు

0

‘ఇప్పటి నుండి గణతంత్ర దినోత్సవం నేతాజీ పుట్టిన రోజు అయిన 23 జనవరి నాడు జరుగుతుంది’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ఇప్పటి నుండి గణతంత్ర దినోత్సవం నేతాజీ పుట్టిన రోజు అయిన 23 జనవరి నాడు జరుగుతుంది.

ఫాక్ట్ (నిజం): సాధారణంగా ప్రతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు 24 జనవరి రోజు మొదలవుతుంటాయి. ఐతే ఈ సంవత్సరం నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన 23 జనవరి నుండి మొదలవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే వేడుకలను ముందుగా మొదలుపెట్టాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుగా అర్ధం చేసుకొని ఏకంగా గణతంత్ర దినోత్సవం నేతాజీ పుట్టిన రోజున జరుపుతరంటూ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గురుగోవింద్ సింగ్ కుమారుల స్మారకార్థం డిసెంబర్ 26వ తేదీని ‘వీర్ బల్ దివస్‌గా’ గుర్తించాలని ప్రభుత్వ నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబర్‌లో ప్రకటించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సాధారణంగా ప్రతీ సంవత్సరం 24 జనవరి రోజున మొదలయ్యే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇప్పటినుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన 23 జనవరి రోజున మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). మన చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను జరుపుకోవడం/ జ్ఞాపకం చేసుకోవాలన్న ప్రభుత్వం ఉద్దేశానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఐతే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బోస్ జయంతి రోజు గణతంత్ర దినోత్సవం జరపనున్నట్టు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నిజానికి గణతంత్ర దినోత్సవం తేదీలో ఎటువంటి మార్పు లేదు. 26 జనవరి 1950 నుండి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, ఈ జ్ఞాపకార్థం మనం ప్రతీ సంవత్సరం 26 జనవరిన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము.

ఇదిలా ఉంటే, గురుగోవింద్ సింగ్ కుమారుల స్మారకార్థం డిసెంబర్ 26వ తేదీని ‘వీర్ బల్ దివస్‌గా’ గుర్తించాలని ప్రభుత్వ నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబర్‌లో ప్రకటించారు.

చివరగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున గణతంత్ర దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించలేదు, కేవలం వేడుకలు బోస్ జయంతి రోజు మొదలవుతాయి.

Share.

About Author

Comments are closed.

scroll