“బోస్ ఒక్కడు మాకు అమ్ముడు పోయి ఉంటే భారత్ మరో 40 సంవత్సరాలు మా చేతుల్లోనే ఉండేది” అని 1947లో బ్రిటన్ ప్రధాని అయిన క్లెమెంట్ అట్లీ అన్నాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “బోస్ ఒక్కడు మాకు అమ్ముడు పోయి ఉంటే భారత్ మరో 40 సంవత్సరాలు మా చేతుల్లోనే ఉండేది” – 1947లో బ్రిటన్ ప్రధాని అయిన క్లెమెంట్ అట్లీ.
ఫాక్ట్: బోస్ ఒక్కడు మాకు అమ్ముడు పోయి ఉంటే భారత్ మరో 40 సంవత్సరాలు మా చేతుల్లోనే ఉండేదని క్లెమెంట్ అట్లీ అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జనరల్ జి.డి.బక్షి రాసిన ‘బోస్: ఎన్ ఇండియన్ సమురాయ్’ పుస్తకంలో క్లెమెంట్ అట్లీతో కొన్ని సంభాషణలను ప్రచురించారు. బ్రిటన్ భారతదేశాన్ని ఎందుకు విడిచిపెట్టవలసివచ్చిందనే ప్రశ్నకు నేతాజీ సైనిక కార్యకలాపాల ఫలితంగా భారత సైన్యం, నేవీలో బ్రిటిష్ వారి పట్ల విధేయత క్షీణించిందని అట్లీ తెలిపాడు. బోస్ మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీ గనక బ్రిటన్ పై మిలిటరీ తిరుగుబాటు చేయకుంటే, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మరో 30-40 ఏండ్లు పట్టుండేదని జనరల్ జిడి బక్షి రాసిన పుస్తకం ‘బోస్ ఆర్ గాంధీ’లో ఉంది. కానీ, అట్లీ అలా అన్నట్టు పుస్తకంలో లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, 1947లో బ్రిటన్ ప్రధాని అయిన క్లెమెంట్ అట్లీ అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అట్లీ అలా అనుంటే, దాని గురుంచి అనేక చోట్ల ఆధారాలు ఉంది ఉండాలి.
జనరల్ జి.డి. బక్షి రాసిన ‘బోస్: ఎన్ ఇండియన్ సమురాయ్’ పుస్తకంలో క్లెమెంట్ అట్లీతో కొన్ని సంభాషణలను ప్రచురించారు. ఈ పుస్తకంలో జనరల్ జి.డి. బక్షి మాజీ బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ , అప్పటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ జస్టిస్ పిబి చక్రవర్తి మధ్య జరిగిన సంభాషణ గురించి రాసారు. 1956లో క్లెమెంట్ అట్లీ భారతదేశానికి వచ్చినప్పుడు, వీరిమధ్య ఈ సంబాషణ జరిగింది. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం కొంతకాలం క్రితం తగ్గుముఖం పట్టినా, 1947లో బ్రిటిష్ ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందని పిబి చక్రవర్తి క్లెమెంట్ అట్లీని అడిగాడు. నేతాజీ సైనిక కార్యకలాపాల ఫలితంగా భారత సైన్యం, నేవీలో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విధేయత క్షీణించిందని అట్లీ తెలిపాడు. కానీ, గాంధీజీ యొక్క ప్రభావం ‘Minimal’ అని తెలిపాడు.
బోస్ మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీ గనక బ్రిటన్ పై మిలిటరీ తిరుగుబాటు చేయకుంటే, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మరో 30-40 ఏండ్లు పట్టుండేదని జనరల్ జి.డి. బక్షి రాసిన పుస్తకం ‘బోస్ ఆర్ గాంధీ’లో ఉంది. కానీ, అట్లీ అలా అన్నట్టు పుస్తకంలో లేదు.
చివరగా, బోస్ ఒక్కడు మాకు అమ్ముడు పోయి ఉంటే భారత్ మరో 40 సంవత్సరాలు మా చేతుల్లోనే ఉండేదని క్లెమెంట్ అట్లీ అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు.