Fake News, Telugu
 

గొలుసులతో నిర్భదించబడిన ఫోటోలోని వృద్ధుడు స్టాన్ స్వామి కాదు

0

ఆదివాసీ హక్కుల కార్యకర్త, బీమా-కోరేగావ్ కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామిని ఆసుపత్రిలో గొలుసులతో  నిర్భందించిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. బీమా-కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లు జైల్లో ఉన్న స్టాన్ స్వామి, 05 జూలై 2021 నాడు ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీమా-కోరేగావ్ కేసులో ఇన్నాళ్లు జైల్లో ఉండి మరణించిన  స్టాన్ స్వామిని ఆసుపత్రిలో గొలుసులతో  నిర్భందించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ ఇతః జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న 92 సంవత్సరాల బాబురాం బల్వాన్ సింగ్, బీమా-కోరేగావ్ కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామి కాదు. హత్య కేసులో నిందితుడైన బాబురాం బల్వాన్ సింగ్ ని ఇతః జిల్లా జైలు అధికారులు ఆసుపత్రిలో గొలుసులతో నిర్భందించిన దృశ్యం ఇది. ఈ ఫోటోకి ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘NDTV’ న్యూస్ సంస్థ 13 మే 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఫోటోలో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ ఇతః జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబురాం బల్వాన్ సింగ్ అని ఆర్టికల్ లో తెలిపారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 92 సంవత్సరాల బల్వాన్ సింగ్, శ్వాస ఇబ్బందుల కారణంగా ఇతః జిల్లా మహిళా ఆసుపత్రిలో చేరినట్టు ఈ ఆర్టికల్ తెలిపింది. బల్వాన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఇతః జైలు అధికారులు అతన్ని గొలుసులతో  నిర్భందించినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు .

ఈ ఫోటోకి సంబధించిన వివరాలు తెలుపుతూ ‘The Times of India’ జర్నలిస్ట్ అనుజ జైస్వాల్ తన ట్విట్టర్ హేండిల్ లో ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ కి ఉత్తరప్రదేశ్ జైలు అధికారులు సమాధానం ఇస్తూ, ఉత్తరప్రదేశ్ జైళ్ల డైరెక్టర్ జనరల్ ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు బల్వాన్ సింగ్ ని గొలుసులతో నిర్భందించిన జైలు వార్డర్ అశోక్ యాదవ్ ని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

01 జనవరి 2018 నాడు మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్ లో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) 09 అక్టోబర్ 2020 నాడు అరెస్ట్ చేసింది. ఎల్గార్ పరిషద్ సమావేశంలో స్టాన్ స్వామి ఇచ్చిన ప్రసంగాలే బీమా-కోరేగావ్ ఘర్షణకు ప్రేరేపించాయన్నది NIA ఆరోపణ, ఆయనకు మావోయిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయని NIA ఆరోపించింది. బీమా-కోరేగావ్ కేసులో నేరారోపణ ఎదుర్కొంటూన్న స్టాన్ స్వామి, 05 జూలై 2021 నాడు ముంబైలోని ఆసుపత్రిలో మరణించారు. స్టాన్ స్వామి, అతని కేసుకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ ఈనాడు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఆసుపత్రిలో గొలుసులతో నిర్భందించిన ఫోటోలోని వృద్ధుడు ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll