Fake News, Telugu
 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి సంబంధించి 13 డిసెంబర్ 2023 నాటికి విధివిధానాలను రూపొందించలేదు

0

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకి సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 పొందడానికి అవసరమైన పత్రాలు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మహాలక్ష్మి పథకానికి సంబంధించి మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కి మరొక అభ్యర్ధన వచ్చింది. మహాలక్ష్మి పథకంలో రూ. 500కే గ్యాస్ సిలిండర్ కావాలంటే 31 డిసెంబర్ 2023 లోపు గ్యాస్ ఏజెన్సీలకు ఆధార్ కార్డుతో వెళ్లి బుక్ చేసుకోవాలని చేసుకోవాలని, లేకుంటే సిలిండర్ రూ.1200 అవుతుంది వాట్సాప్‌లో షేర్ అవుతున్న ఈ వార్తకు సంబంధించి వివరణ కోరారు. ఈ కథనం ద్వారా ఈ వార్తలలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోయే మహాలక్ష్మి పథకానికి కావలసిన పత్రాలకు సంబంధించిన సమాచారం.

ఫాక్ట్ (నిజం): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలోని మహలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మాత్రమే అమలు చేశారు. ప్రస్తుతానికి మహిళలకు నెలకు రూ.2500 మరియు రూ.500కే గ్యాస్ సిలిండర్  అందించే విషయానికి సంబంధించి ఇంకా (13 డిసెంబర్ 2023 నాటికి) ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. ఆరు గ్యారంటీలలో మిగిలిన వాటిని 100 రోజులో అమలు చేస్తామని ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ప్రముఖంగా తాము ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.  ఈ ఆరు గ్యారంటీలలో ఒకటి మహలక్ష్మి పథకం. ఈ మహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతీ కుటుంబంలోని మహిళా పెద్దలకు రూ. 2,500 నెలవారీ అందించడం, రాష్ట్రంలోని నాన్-లగ్జరీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మరియు రూ. 500కే  LPG సిలిండర్‌ల సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

ఐతే ఇప్పటివరకు (13 డిసెంబర్ 2023 నాటికి) కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో పొందుపరిచిన వివిధ పథకాలలో కేవలం మహలక్ష్మి మరియు చేయూత పథకాలలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మరియు రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా పరిమితి రూ. 10 లక్షలు పెంచటం మాత్రమే అమలు చేసారు.

ఆరు గ్యారంటీలలో మిగిలిన వాటిని రాబోయే100 రోజులో అమలు చేస్తామని ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం స్పష్టం చేసింది. 11 డిసెంబర్ 2023న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి 100 రోజుల్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.500 బోనస్ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వీటన్నిటి బట్టి మహిళలకు నెలకు రూ. 2500 మరియు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం 13 డిసెంబర్ 2023 నాటికి ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలకి  సంబంధించి షేర్ అవుతున్న సమాచారం నిజం కాదని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 మరియు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాలకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు (13 డిసెంబర్ 2023 నాటికి) ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll