Fake News, Telugu
 

భగవద్గీత పుట్టిన భూమిగా వర్ణిస్తూ పోప్ భారత దేశపు మట్టిని తలపై జల్లుకున్నాడంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారంలో వాస్తవం లేదు

0

పోప్ అంతటివాడే విమానం కిందకు దిగుతూనే ఆఖరి మెట్టు మీద నిలబడి భారత దేశపు మట్టిని తీసి తల మీద చల్లుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. భగవద్గీత పుట్టిన భూమి, ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రం వెలిసిన భూమి, అటువంటి పరమపావనమైన భూమి కాబట్టే తిన్నగా కాలు పెట్టకుండా మట్టి తలపై జల్లుకొని కిందకు దిగుతున్నానని పోప్ పేర్కొన్నాడంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భగవద్గీత, కురుక్షేత్రల జన్మభూమిగా వర్ణిస్తూ పోప్ భారత దేశపు మట్టిని తలపై జల్లుకున్నారు.

ఫాక్ట్ (నిజం): 1986లో పోప్ జాన్ పాల్ II భారత దేశ పర్యటనలో భాగంగా ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే మోకాలిపై కుర్చీని భారత నేలని ముద్దాడారు. అయితే, పోప్ జాన్ పాల్ II సెంట్రల్ అమెరికా, అల్బేనియా మరియు అనేక ఇతర దేశాలను పర్యటించినప్పుడు కూడా ఇదే విధంగా అక్కడి నేలను ముద్దాడారు. ఢిల్లీ విమానాశ్రయంలో తనకు లభించిన ఘనస్వాగతానికి సంబంధించి జాన్ పాల్-II విడుదల చేసిన ప్రకటనలో భగవద్గీత గురించి గాని, కురుక్షేత్ర యుద్ధం గురించి గాని ఎక్కడ ప్రస్తావించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, పోప్ నేలపై కూర్చొని ఉన్న ఫోటోని ‘ఫోటో షెల్టర్’ వెబ్సైటులో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 1986లో పోప్ జాన్ పాల్-II భారత్ పర్యటన సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో తీసిన ఫోటోని అని వివరణలో తెలిపారు.

ఈ ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, 1986లో పోప్ జాన్ పాల్-II భారత్ పర్యటనకు సంబంధించి పబ్లిష్ చేసిన పలు ఆర్టికల్స్ దొరికాయి. ఢిల్లీ విమానాశ్రయంలో తన విమానం దిగిన వెంటనే జాన్ పాల్-II మోకాలిపై కుర్చీని భారత నేలని ముద్దాడినట్టు ఇండియా టుడే వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలో తనకు లభించిన ఘనస్వాగతానికి సంబంధించి జాన్ పాల్-II 01 ఫిబ్రవరి 1986 నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత పర్యటనకు రావడానికి మతపరమైన, మానవీయమైన కోణం ఉందని, భారత దేశంలోని కాథలికులను కలుసుకోవడానికి తను భారత దేశానికి వచ్చానని, భారత దేశంలో ఉన్న విభిన్న సంస్కృతులను, మతాలను తాను గౌరవిస్తానని జాన్ పాల్-II ఈ ప్రకటనలో తెలిపారు. విభిన్న విశ్వాసాల ప్రజల మధ్య సహాకారం మరియు ఐక్యమత్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాను భారత దేశానికి వచ్చానని  పోప్ జాన్ పాల్-II తెలిపారు. కానీ, జాన్ పాల్-II విడుదల చేసిన ఈ ప్రకటనలో భగవద్గీత గురించి గాని, కురుక్షేత్ర యుద్ధం గురించి గాని ఎక్కడ ప్రస్తావించలేదు.

అయితే, పోప్ జాన్ పాల్ II సెంట్రల్ అమెరికా, అల్బేనియా మరియు అనేక ఇతర దేశాలను పర్యటించినప్పుడు కూడా ఇదే విధంగా అక్కడి నేలను ముద్దాడారు. ఆ ఫోటోలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోప్ జాన్ పాల్-II భారత నెలను ముద్దాడటానికి భగవద్గీత లేదా మరే ఇతర హిందూ ఇతిహాసాలు కారణం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, భగవద్గీత గౌరవార్ధంగా పోప్ భారత దేశపు మట్టిని తలపై జల్లుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll