Fake News, Telugu
 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘30’కి సంబంధించి ఈ వైరల్ పోస్టులో పేర్కొన్న విషయాలు తప్పు

0

“సెక్షన్ 30 అనేది హిందువులకు వ్యతిరేకంగా నెహ్రూ అన్యాయంగా రాజ్యాంగంలో చేర్చిన చట్టం, పటేల్ మరణించిన వెంటనే, నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం, హిందువులు తమ ‘సనాతన ధర్మాన్ని’ పాఠశాలల్లో లేదా కాలేజీల్లో బోధించరాదు లేదా నేర్చుకోవరాదు, ఈ “సెక్షన్ 30” ప్రకారం, ముస్లింలు మరియు క్రైస్తవులు తమ మతపరమైన విద్య కోసం ఇస్లామిక్ (మదరసా) మరియు క్రైస్తవ (కాన్వెంట్) పాఠశాలలను నడపవచ్చు, కానీ హిందువులు తమ ధర్మాన్ని మరియు సంస్కృతిని కాపాడడానికి వేదాధారిత గురుకులాలను లేదా సంప్రదాయ పాఠశాలలను నడపలేరు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం హిందువులు తమ కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించకూడదు, కానీ ముస్లింలు, క్రైస్తవులు తమ ఇస్లామిక్ (మదరసా) మరియు క్రైస్తవ (కాన్వెంట్) పాఠశాలల్లో వారి వారి మతాలను బోధించవచ్చు. ఆర్టికల్ 30ను సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణం తర్వాత రాజ్యాంగంలో చేర్చారు.

ఫాక్ట్(నిజం): భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘30’ సంబంధించి ఈ వైరల్ పోస్టులో పేర్కొన్న విషయాలు తప్పు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 కేవలం మైనారిటీలకు (మతం లేదా భాష ఆధారంగా) విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, ఆర్టికల్ 30ను సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణానికి (1950) చాలా కాలం ముందు 1948 లో భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30, ముస్లింలు, క్రైస్తవులు తమ ఇస్లామిక్ (మదరసా), క్రైస్తవ (కాన్వెంట్) పాఠశాలల్లో వారి వారి మతాలను బోధించడానికి వీలు కల్పించిందా? అని తెలుసుకోవడానికి భారత రాజ్యాంగంలో వెతకగా, భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 30 (1), 30 (1A), మరియు 30 (2) ఆర్టికల్స్ మైనారిటీల హక్కులకు (‘Right of minorities to establish and administer Educational institutions’) సంబంధించినవి అని తెలిసింది.

  • ఆర్టికల్ 30(1) ప్రకారం మతం లేదా భాషా ప్రాతిపదికపై అల్ప సంఖ్యాక వర్గాలకు (మైనారిటీలకు) చెందిన ప్రజలు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
  • ఆర్టికల్ 30(1)(A) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి.
  • ఆర్టికల్ 30(2) ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసే విషయంలో విద్యాసంస్థలను అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలు, అధిక సంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలు అనే తేడా చూపకూడదు.

భారత రాజ్యాంగంలో మైనార్టీ పదం గురించి ఎలాంటి నిర్వచనం లేదు. చట్టబద్ధంగా మన దేశంలో మతపరమైన, భాషాపరమైన మైనార్టీలను గుర్తించారు. మతపరమైన మైనార్టీలను గుర్తించేటప్పుడు దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణించగా, భాషాపరమైన మైనార్టీలను గుర్తించేటప్పుడు రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

భారతదేశంలో ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు వంటి మైనారిటీ వర్గాలు కిందకి వస్తారు (ఇక్కడ, ఇక్కడ).

మైనార్టీ వర్గాల విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను, పాలకవర్గాన్ని నియమించుకునే అధికారం వారికి ఉంది. విద్యా సంస్థల్లో బోధనా మాధ్యమాన్ని నిర్ణయించుకునే హక్కు కూడా వారికి ఉంది. కానీ మైనార్టీ విద్యాసంస్థల మీద ప్రభుత్వం కొన్ని హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చు. ఉదా: బోధనా సిబ్బందికి ఉండాల్సిన విద్యార్హతలను నిర్ణయించడం.

ఆర్టికల్ 30 విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు

ఆల్ సెయింట్స్ స్కూల్ vs. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు (1980): ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ మైనార్టీ విద్యాసంస్థల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని పేర్కొంది.

సెయింట్ జేవియర్ కాలేజ్ vs. స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు (1974): ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మైనార్టీ విద్యా సంస్థల బోధన, బోధనేతర సిబ్బంది, ఎంపిక సందర్భంలో వారికి స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వాలు అనవసరంగా జోక్యం చేసుకోరాదని తీర్పునిచ్చింది.

ఫ్రాంక్ ఆంటోని vs. దిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ (1986) :ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మైనార్టీ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి చెల్లించే జీతభత్యాల విషయంలో, ప్రభుత్వ నిబంధనలను పాటించని సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారాన్ని కలిగి ఉందని పేర్కొంది.

డి.ఎ.వి.కాలేజీ vs. స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (1971): గురు నానక్ విశ్వవిద్యాలయం తమ అనుబంధ కళాశాలైన డి.ఎ.వి. కళాశాలలో పంజాబీ భాష మాత్రమే బోధనా భాషగా ఉండాలని ఆదేశించడం చెల్లదని, తమకు నచ్చిన భాషలో విద్యను అభ్యసించే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికీ ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

పి.ఎ. ఇనాందార్ vs. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు (2005): ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రయివేట్, అన్ఎయిడెడ్ విద్యాసంస్థల్లో అంటే మైనార్టీల నిర్వహణలో ఉన్న సంస్థల్లో రిజర్వేషన్ వర్తించదని పేర్కొంది.

టి.ఎమ్.ఎ. పాయ్ vs. స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు (2002): ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిస్తూ, ప్రభుత్వాలు మైనార్టీ విద్యాసంస్థల్లో జోక్యం చేసుకునే సందర్భాలు, జోక్యం చేసుకోకూడని సందర్భాలను వివరించింది

జోక్యం చేసుకునే సందర్భాలు:

  • విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే, సంరక్షించే సందర్భంలో
  • విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు
  • విద్యాసంస్థల నిర్వహణలో అక్రమాలు ఉన్నప్పుడు
  • ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలను అనుసరించి, వసతులను కల్పించనప్పుడు
  • విద్యా సంస్థ అక్రమాలకు పాల్పడినప్పుడు

జోక్యం చేసుకోకూడని సందర్భాలు:

  • సిబ్బంది ఎంపిక
  • సంస్థ నిర్వహణ
  • అభివృద్ధి
  • కాల నిర్ణయ పట్టికను నిర్ణయించడం

ఫాదర్ థామస్ షింగారే vs. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు (2001): ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోకుండా ఒక మైనార్టీ సంస్థ విద్యాసంస్థను నడుపుతున్నంత కాలం, ఆ సంస్థలో విద్యాబోధనను మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం మినహా ఆ విద్యాసంస్థ పరిపాలనలో ఎలాంటి పరిమితులు విధించడానికి ప్రభుత్వానికి అధికారం లేదని పేర్కొంది.

2004 లో స్థాపించబడిన ‘నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (NCMEI)’ ఆర్టికల్ 30 లోని మైనారిటీల హక్కులుకు కాపాడుతుంది. ఈ అంశం పై మరిన్ని వివరాల కోసం ఇక్కడఇక్కడ చూడవచ్చు.

అలాగే వైరల్ పోస్టులో పటేల్ మరణించిన తరువాత ఆర్టికల్ 30ని నెహ్రూ రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఈ ఆర్టికల్ 30ను సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణానికి (1950) చాలా కాలం ముందు 08 డిసెంబర్ 1948న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. ప్రస్తుత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 పై చర్చను భారత రాజ్యాంగ సభలో ఆర్టికల్ 23 గా చర్చించారు.

చివరగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘30’ గురించి ఈ వైరల్ పోస్టులో పేర్కొన్న విషయాలు తప్పు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 కేవలం మైనారిటీలకు (మతం లేదా భాష ఆధారంగా) విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll