“మీ ఇంటి నుండి 60 కి.మీ లోపు ఏ టోల్ బూత్ వద్ద టోల్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు మీ ఆధార్ కార్డును చూపడం ద్వారా టోల్ రుసుము చెల్లించకుండా టోల్ బూత్ దాటవచ్చు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధార్ కార్డుతో టోల్ గేట్ల సమీపంలో ఉండే స్థానికులకు టోల్ పాసులు జారీ చేయడంపై, అలాగే నిబంధనల ప్రకారం 60 కి.మీ లోపు ఒకటి కంటే ఎక్కువ టోల్ గేట్లు ఉండకూడదు అని, అలా ఉన్న టోల్ గేట్లను మూడు నెలలో మూసివేస్తామని చెప్తున్న వీడియోను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇంటి నుండి 60 కి.మీ లోపు ఉన్న ఏ టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, ఆధార్ కార్డు చూపించి టోల్ రుసుము చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటవచ్చు.
ఫాక్ట్(నిజం): ఇంటి నుండి 60 కి.మీ లోపు ఉన్న ఏ టోల్ ప్లాజాలో అయిన ఆధార్ కార్డ్ చూపించి టోల్ ఫీజు చెల్లించకుండానే టోల్ ప్లాజాలను దాటవచ్చన్న వాదన తప్పు. THE NATIONAL HIGHWAYS FEE (DETERMINATION OF RATES AND COLLECTION) RULES, 2008 ప్రకారం, జాతీయ రహదారులపై టోల్ ఫీజుల వసూలుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం, జాతీయ రహదారులపై రెండు టోల్ ప్లాజాల మధ్య కనీసం 60 కి.మీ దూరం ఉండాలి. అలాగే ప్రతి కిలోమీటరుకు ఎంత వసూలు చేయాలి, అలాగే టోల్ ప్లాజాలను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలపై నిబంధనలు ఉన్నాయి. అయితే, కొన్ని సందర్భాలలో రెండు టోల్ ప్లాజాల మధ్య దూరం 60 కి.మీ కంటే తక్కువగా ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తమ వెబ్సైటులో పేర్కొన్నది. అలాగే, ఈ నిబంధనల ప్రకారం, జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులు అడ్రస్ ప్రూఫ్‌తో సహా అవసరమైన పత్రాలతో సంబంధిత టోల్ ప్లాజా అధికారులకు దరఖాస్తు సమర్పించినట్లయితే టోల్ పన్ను చెల్లింపు నుండి మినహాయింపు/రాయితీని పొందవచ్చు. అయితే, ఆ టోల్ ప్లాజా పరిధిలో జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా సర్వీస్ రోడ్/ఇతర రోడ్లు ఉంటే మినహాయింపు/ రాయితీ వర్తించదు. అలాగే, ఈ మినహాయింపు/ రాయితీ కేవలం నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వీడియో కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, మార్చి 2022లో పబ్లిష్ అయిన పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
ఈ కథనాల ప్రకారం, జాతీయ రహదారులపై ఒక టోల్ ప్లాజా నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో మరో టోల్ ప్లాజా ఉండకూడదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో స్పష్టం చేశారు. అలా ఉన్నవాటిని మూడు నెలల్లో మూసివేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన లోక్ సభలో ప్రకటించారు. 2022-23 కేంద్ర బడ్జెట్ లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపులపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ “జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిదిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అలా ఉన్నాయి. ఇది తప్పు, చట్ట విరుద్ధం కూడా. ఒక టోల్ బూత్కు 60 కిలోమీటర్లలోపే రెండో టోల్ ప్లాజా ఉంటే వాటిని మూసివేస్తాం. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా అని ఆలోచిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే వాటిని తొలగించాలని నిర్ణయించాం” అని గడ్కరీ వెల్లడించారు. దీంతో పాటు టోల్ ప్లాజాలకు దగ్గరగా నివసించే ప్రజలు తమ ఆధార్ కార్డులు చూపించి పాస్లలు తీసుకోవచ్చని గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలు హైవేలపై సజావుగా వెళ్లేందుకు తమ ఆధార్ కార్డులు చూపించి పాసులు తీసుకోవచ్చని, నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులు అడ్రస్ ప్రూఫ్‌తో సహా అవసరమైన పత్రాలతో దరఖాస్తుల సమర్పిస్తే టోల్ పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చని, ఆధార్ కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా పరిగణిస్తామని, స్థానికులకు ఉచిత పాస్‌లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు.
వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, ఇంటి నుండి 60 కి.మీ లోపు ఉన్న ఏ టోల్ ప్లాజాలో టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్న, ఆధార్ కార్డ్ చూపించి టోల్ ఫీజు చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటవచ్చు అనే వాదన తప్పు.
THE NATIONAL HIGHWAYS FEE (DETERMINATION OF RATES AND COLLECTION) RULES, 2008 ప్రకారం, జాతీయ రహదారులపై టోల్ ఫీజుల వసూలుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం, జాతీయ రహదారులపై రెండు టోల్ ప్లాజాల మధ్య కనీసం 60 కి.మీ దూరం ఉండాలి, 60 కి.మీ లోపు ఒకటి కంటే ఎక్కువ టోల్ గేట్లు ఉండదు. అలాగే ప్రతి కిలోమీటరుకు ఎంత వసూలు చేయాలి, అలాగే టోల్ ప్లాజాలను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలపై నిబంధనలు ఉన్నాయి. అయితే, కొన్ని సందర్భాలలో రెండు టోల్ ప్లాజాల మధ్య దూరం 60 కి.మీ కంటే తక్కువగా ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తమ వెబ్సైటులో పేర్కొన్నది.
అలాగే, ఈ నిబంధనల ప్రకారం, జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులు అడ్రస్ ప్రూఫ్‌తో సహా అవసరమైన పత్రాలతో సంబంధిత టోల్ ప్లాజా అధికారులకు దరఖాస్తు సమర్పించినట్లయితే టోల్ పన్ను చెల్లింపు నుండి మినహాయింపు/రాయితీని పొందవచ్చు. అయితే, ఆ టోల్ ప్లాజా పరిధిలో జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా సర్వీస్ రోడ్/ఇతర రోడ్లు ఉంటే మినహాయింపు/ రాయితీ వర్తించదు. అలాగే, ఈ మినహాయింపు/ రాయితీ కేవలం నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
టోల్ ప్లాజా నుండి 20 కి.మీ లోపు మీ నివాసాన్ని రుజువు చేసే పత్రాలను సంబంధిత టోల్ ప్లాజా అధికారులకు సమర్పించాలి. వారు మీ పత్రాలను ధృవీకరించిన తర్వాత మీకు పాసును జారీ చేస్తారు.( మినహాయింపు లేదా రాయితీని పాస్). ఉదాహరణకు, హైదరబాద్-యాదగిరిగుట్ట వరకు గల జాతీయ రహదారి NH-163పై గూడూరు వద్ద గల టోల్ ప్లాజా స్థానికంగా (అంటే టోల్ ప్లాజాకు 20 కి.మీ పరిధిలో) ఉండే ప్రజలు ఉపయోగించే నాన్ కమర్షియల్ వాహనాలకు రూ. 330 కు నెలవారీ పాసును అందిస్తుంది. దీన్ని బట్టి ఇంటి నుండి 60 కి.మీ లోపు ఉన్న ఏ టోల్ ప్లాజాలో టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆధార్ కార్డ్ చూపించి టోల్ ఫీజు చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటవచ్చు అనే వాదన తప్పు అని మనం నిర్థారించవచ్చు.
10 జూలై 2024న ప్రచురించబడిన ‘ది హిందూ’ వార్తా కథనం ప్రకారం, కన్యాకుమారి నుండి బెంగళూరు జాతీయ రహదారిపై (NH-7) తమిళనాడులోని కప్పలూరు వద్ద ఉన్న టోల్‌గేట్ ఇటీవల స్థానికుల నుండి 50% టోల్ రుసుమును వసూలు చేయాలని నిర్ణయించింది. స్థానికుల నుంచి 50 శాతం టోల్ రుసుం వసూలు చేయాలన్న ఆదేశాలను టోల్ ప్లాజా అధికారులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కప్పలూరు టోల్‌గేట్ వద్ద స్థానికులు నిరసన తెలిపారు.
చివరగా, ఇంటి నుండి 60 కి.మీ లోపు ఉన్న ఏ టోల్ ప్లాజాలో అయినా ఆధార్ కార్డ్ చూపించి టోల్ ఫీజు చెల్లించకుండానే టోల్ ప్లాజాలను దాటవచ్చన్న వాదన తప్పు.