Fake News, Telugu
 

కుతిరన్ టన్నెల్ వల్ల రెండు గంటల త్రిస్సూర్ నుండి కోయంబత్తూర్ ప్రయాణ సమయం పది నిమిషాలకు తగ్గిందన్న వాదనలో నిజం లేదు

0

కేరళలో ఇంతకు ముందు 2 గంటలు పట్టే కోయంబత్తూర్ – త్రిస్సూర్ మధ్య ప్రయాణం ఇటీవల ప్రారంభించిన కుతిరన్ టన్నెల్ వల్ల 10 నిమిషాల్లో పూర్తి చేయొచ్చని చెప్తున్న పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్  అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2 గంటలు పట్టే కోయంబత్తూర్ – త్రిస్సూర్ మధ్య ప్రయాణం ఇటీవల ప్రారంభించిన కుతిరన్ టన్నెల్ వల్ల 10 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు.

ఫాక్ట్ (నిజం): ఇంతకు ముందు కోయంబత్తూర్- త్రిస్సూర్ మార్గ మధ్యలోని కుతిరన్ ప్రాంతంలో సుమారు 2.5 కిలో మీటర్ల మేర ఇరుకైన ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ 1.6 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం వల్ల కొంత ప్రయాణ సమయం తగ్గుతుందన్న మాట నిజమైనప్పటికి, రెండు గంటల ప్రయాణం పది నిమిషాల్లో పూర్తి చేయవచ్చన్న వాదనలో హేతుబద్దత లేదు. పైగా ప్రభుత్వం ఎక్కడా కూడా ఇలా చెప్పలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

గుజరాత్ కి చెందిన బిజేపీ నాయకుడు ఒకరు ఇటీవల కేరళలో ప్రారంభించిన కుతిరన్ టన్నెల్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ ఇంతకు ముందు కోయంబత్తూర్- త్రిస్సూర్ మధ్య 2 గంటల ప్రయాణాన్ని ఈ టన్నెల్ వల్ల 10 నిమిషాల్లో పూర్తి చేయొచ్చంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోస్టులో షేర్ చేసిన సమాచారం కూడా ఇక్కడ నుండి సేకరించిందే. అయితే చాలా మంది ఆ ట్వీట్ లో నిజం లేదు అని అన్నాక, ఆ ట్వీట్ డిలీట్ చేయటం జరిగింది. ఐతే కుతిరన్ టన్నెల్ నిజంగానే 2 గంటల ప్రయాణాన్ని 10 నిమిషాలకి తగ్గించిందా అన్న విషయం కింద చూద్దాం.

కుతిరన్ టన్నెల్:

త్రిస్సూర్ – పాలక్కాడ్ మీదుగా వెళ్ళే నేషనల్ హైవే 544 పీచి- వజని వన్యప్రాణుల అభయారణ్యం (Peechi- Vazhani wildlife sanctuary) మీదుగా వెళ్తుంది. ఐతే కుతిరన్ ప్రాంతం అనేది ఈ అభయారణ్యం లోపల ఉంటుంది. ఇది పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో ఈ రోడ్డు చాలా ఇరుకుగా (ఘాట్ రోడ్డు) ఉంటుంది. పైగా తరుచూ భారీ వాహానాలు లోడ్లతో కొండ చుట్టూ ఉన్న రహదారిపై ప్రయాణించాల్సి వస్తుంది. ఇందువల్ల ఇక్కడ తరుచూ ట్రాఫిక్ జామ్ మరియు ఆక్సిడెంట్లు జరుగుతూ ఉండేవి.

వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్ళకుండా, ట్రాఫిక్ జామ్, ఆక్సిడెంట్స్ తగ్గించే ఉద్దేశంతో 2016లో కుతిరన్ ప్రాంతంలో 1.6 కిలో మీటర్ల పొడవైన రెండు టన్నెల్స్ నిర్మాణం మొదలుపెట్టరు. ఈ రెండింటిలో ఒక టన్నెల్ నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల ప్రారంభించారు. రెండో టన్నెల్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా’ (NHAI) చేపట్టింది.

కోయంబత్తూరు – త్రిస్సూర్ ప్రయాణ సమయం:

ఇంతకు ముందు వాహనదారులు ఈ కొండ ప్రాంతంలో సుమారు 2.5 కిలో మీటర్ల మేర ఇరుకైన ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేసేవారు.

ఇప్పుడు ఈ 1.6 కిలో మీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం వల్ల ఈ దూరం మరియు దాన్ని దాటడానికి పట్టే సమయం కొంత తగ్గుతాయి. కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ టన్నెల్ కేవలం 1.6 కి.మి పొడవు కాబట్టి ప్రయాణ సమయం ఏ మేర తగ్గుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు. పైగా ప్రయాణ సమయం అనేది ఆ టైములో ఉండే ట్రాఫిక్ పై ఆధారపడి ఉంటుంది. అంతేగాని పోస్టులో పేర్కొన్నట్టు ఈ టన్నెల్ వల్ల రెండు గంటలు పట్టే ప్రయాణ సమయం పది నిమిషాలకు పడిపోయిందన్న వాదనలో హేతుబద్దత లేదు.

కేంద్ర రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ కేరళలో చేపట్టిన పనులకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ లో ఈ కుతిరన్ టన్నెల్ గురించి, ఈ టన్నెల్ నిర్మాణం యొక్క ఉపయోగం గురించి ప్రస్తావిస్తూ ఈ టన్నెల్ ట్రాఫిక్ జామ్, ఆక్సిడెంట్లతో పాటు ప్రయాణ సమయాన్ని ఒక 30% తగ్గిస్తుందని పేర్కొన్నారు. అంతేగానీ, ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ టన్నెల్ వల్ల రెండు గంటల ప్రయాణం పది నిమిషాలకు తగ్గుతుందని చెప్పలేదు.

గూగుల్ మ్యాప్స్ ప్రకారం కోయంబత్తూరు – త్రిస్సూర్ మధ్య దూరం సుమారు 114 కి.మీలు, ఐతే ఈ మార్గంలో కేవలం ఒక 1.6 కి.మీల టన్నెల్ నిర్మాణం వల్ల ఈ దూరం యొక్క ప్రయాణం సమయం ఏ మేర తగ్గుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, కుతిరన్ టన్నెల్ వల్ల రెండు గంటల త్రిస్సూర్ నుండి కోయంబత్తూర్ ప్రయాణ సమయం పది నిమిషాలకు  తగ్గిందన్న వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll