Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం అమెరికా నుండి దిగుమతి అయ్యే ఆపిల్స్‌పై ఉన్న పూర్తి టాక్స్‌ను రద్దు చేయలేదు, అదనపు టాక్స్‌ను మాత్రమే రద్దు చేసింది

0

కేంద్ర ప్రభుత్వం అమెరికా నుండి దిగుమతి చేసుకొనే ఆపిల్స్‌పై టాక్స్ రద్దు చేసిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: అమెరికా నుండి దిగుమతి చేసుకొనే ఆపిల్స్‌పై టాక్స్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.

ఫాక్ట్(నిజం): అమెరికా నుండి దిగుమతి అయ్యే ఆపిల్స్‌పై పూర్తి టాక్స్ రద్దు కాలేదు. మొదటినుండి ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ డ్యూటీపై 2019లో అమెరికా చర్యలకు వ్యతిరేకంగా విధించిన 20% అదనపు టాక్స్‌ను మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. జూన్‌ 2023లో భారత్ మరియు అమెరికా మధ్య జరిగిన WTO ఒప్పందాలలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న ఆరు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వివాదాలను పరిష్కరించాలని రెండు దేశాలు జరిపిన చర్చల్లో అమెరికా నుండి భారత్‌కు దిగుమతి అయ్యే ఆపిల్స్, వాల్‌నట్‌లు మరియు బాదంతో సహా ఎనిమిది ఉత్పత్తులపై విధించిన టాక్స్‌లను భారత్ రద్దు చేసింది.

ఈ నేపథ్యంలోనే అమెరికా నుండి దిగుమతి అయ్యే యాపిల్స్‌పై ఉన్న 20% అదనపు టాక్స్‌ను రద్దు చేసింది. ఐతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అమెరికన్ ఆపిల్స్‌పై మొదటినుండి ఉన్న 50 శాతం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ డ్యూటీ (MFN) అలాగే ఉంటుందని, కేవలం 2019లో విధించిన అదనపు టాక్స్ మాత్రమే రద్దు చేసామని తెలిపింది (ఇక్కడ మరియు ఇక్కడ).

2019లో అమెరికా ప్రభుత్వం భారత్ నుండి వచ్చే స్టీల్ మరియు అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలను పెంచడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అమెరికా నుండి భారత్‌కు దిమతి అయ్యే ఆపిల్స్, వాల్‌నట్‌, మొదలైన వాటిపై అదనపు టాక్స్ విధించింది. ఐతే పైన చెప్పినట్టు WTO ఒప్పందంలో భాగంగా ఈ అదనపు టాక్స్‌లను ఇప్పుడు తగ్గించింది. దీన్నిబట్టి ఆమెరికన్ ఆపిల్స్‌పై పూర్తిగా పన్ను తగ్గించిందన్న వార్త నిజం కాదని స్పష్టమవుతుంది.

చివరగా, అమెరికా నుండి దిగుమతి అయ్యే ఆపిల్స్‌పై ఉన్న అదనపు టాక్స్‌ను మాత్రమే ప్రభుత్వం రద్దు చేసింది. మొదటినుండి ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ డ్యూటీ అలాగే ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll