హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత అదాని కంపెనీకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఋణం ఇవ్వడానికి సుముఖత చూపిన నేపథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో తమ ఖాతాలను మూసివేయడానికి ఖాతాదారులు క్యూలో నిలబడ్డారంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: అదాని కంపెనీకి ఋణాలు ఇస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పడంతో, UAE లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ ముందు తమ ఖాతాలను మూసివేయడానికీ క్యూలో నిలుచున్న ఖాతాదారులు.
ఫాక్ట్: 20 జనవరి 2023 నాడే బ్యాంక్ ఆఫ్ బరోడా UAE లోని అల్ ఐన్ బ్రాంచ్‌ని వాణిజ్య కారణాల దృష్ట్యా మూసి వేయనున్నట్లు ఒక నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయం ఏడాది కిందటే తీసుకొని అక్కడి సెంట్రల్ బ్యాంక్ అనుమతిని కూడా పొందినట్లు బ్యాంకు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శాఖలో ఉన్న ఖాతాలన్నీ అబుదాబి శాఖకు మార్చబడతాయి. తమ ఖాతాలను మూసేయాలనుకుంటున్న కస్టమర్లు 22 మార్చి 2023లోగా ఎటువంటి ఛార్జీలు/పెనాల్టీలు లేకుండా మూసివేయవచ్చనీ, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు అవాస్తవమని స్పష్టం చేశారు. పైగా, అదాని సంస్థపై హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది 24 జనవరి 2023 నాడు, కానీ ఈ బ్రాంచ్ మూసివేస్తున్నట్లు ప్రకటన దీనికంటే ముందే వెలువడింది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.
ముందుగా, బ్యాంక్ ఆఫ్ బరోడా సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఇదే విషయంపై ఆ బ్యాంక్ ప్రతినిధి 26 ఫిబ్రవరి 2023 నాడు విడుదల చేసిన ప్రకటన లభించింది. దీని ప్రకారం, UAE లో ఉన్న అల్ ఐన్ శాఖని ఏడాది కిందటే మూసివేయాలని ఈ బ్యాంక్ ఒక వాణిజ్యపరమైన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అక్కడి సెంట్రల్ బ్యాంక్ అనుమతి కూడా తీసుకుంది. ప్రస్తుతం ఈ శాఖలో ఉన్న ఖాతాలన్నీ అబుదాబి బ్రాంచ్‌కి మార్చబడతాయి. తమ ఖాతాలను మూసేయాలనుకుంటున్న కస్టమర్లు 22 మార్చి 2023లోగా ఎటువంటి ఛార్జీలు/పెనాల్టీలు లేకుండా మూసివేయొచ్చు. ఈ విషయంపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లన్నీ అవాస్తవమని, వాటిని నమ్మ వద్దని స్పష్టం చేశారు.
ఇక ఈ బ్యాంక్ వెబ్‌సైట్‌ని పరిశీలించగా, ప్రకటనలో చెప్పినట్లుగానే, అల్ ఐన్ బ్రాంచ్ మూసివేత గురించిన నోటీసు 20 జనవరి 2023 నాడే జారీ చేయబడింది. పైగా, అదాని సంస్థపై హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది 24 జనవరి 2023 నాడు, మరియు ఫిబ్రవరి 2023న బ్యాంక్ ఆఫ్ బరోడా C.E.O సంజీవ్ చడ్డా అదాని సంస్థలకి ఋణం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.
అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా తన బ్రాంచ్‌లను మూసివేయడం ఇదే తొలిసారి కాదు. బ్యాంక్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, 1986, 1987 లో కూడా నష్టాలు వస్తున్నాయనే కారణంతో రెండు బ్రాంచ్‌లను మూసి వేశారు. అలాగే వివిధ కారణాల రీత్యా భారత్‌కు చెందిన వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు గతంలో భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా తమ బ్రాంచ్‌లను మూసివేసిన సందర్భాలు ఉన్నాయి. సంబంధిత సమాచారాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, అదాని కంపెనీకి అప్పులు ఇస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించడంతో UAE లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు తమ ఖాతాలను మూసి వేస్తున్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం.