Fake News, Telugu
 

తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్‌లో మూజువాణి ఓటుతో ఆమోదించారు

0

బీజేపీ వల్లే తెలంగాణ వచ్చినట్టు అర్ధం వచ్చేలా ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి 273 ఓట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్-113, టీఆర్ఎస్- 2, బీజేపీ-185 వోట్లు వేయడం వల్ల తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందని ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి 273 ఓట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్-113, టీఆర్ఎస్- 2, బీజేపీ-185 వోట్లు వేయడం వల్ల తెలంగాణ బిల్లు పాస్ అయింది.

ఫాక్ట్(నిజం):  తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, 2014 బిల్లు పార్లమెంట్‌లో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై ప్రత్యేకంగా వోటింగ్ జరగలేదు. ఐతే ఈ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపింది. కాగా 2009 జనరల్ ఎన్నికల్లో UPA కూటమి 262 సీట్లు గెలుచుకోగా, బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 159 సీట్లు గెలుచుకుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పార్లమెంటు అధికారం :

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అధికారాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్‌కు అందించారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా ఏదైనా రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం/తగ్గించడం, సరిహద్దులను/పేరును మార్చడం మొదలైన అధికారాలను పార్లమెంట్‌కు అందించారు.

ఐతే పై అంశాలకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే ముందు రెండు విషయాలు పాటించాల్సి ఉంటుంది. 1) రాష్ట్రపతి ముందస్తు సిఫార్సుతో మాత్రమే పార్లమెంటులో బిల్లు ప్రవేశపట్టాలి, 2) నిర్దిష్ట వ్యవధిలోపు తన అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరుతూ రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభకు సూచించవలసి ఉంటుంది. ఐతే ఈ అంశంకు సంబంధించి శాసనసభ అభిప్రాయానికి రాష్ట్రపతి/పార్లమెంటు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లును సాధారణ బిల్లు లాగే ప్రవేశపెట్టవచ్చు. ఇలా ప్రవేశపెట్టిన బిల్లును మూజువాణి ఓటుతో (వాయిస్ వోట్- ఒక బిల్లు లేదా తీర్మానం పైన తమ అభిప్రాయాన్ని ‘అవును’ లేదా ‘కాదు’ అని మూకుమ్మడిగా అరిచి చెప్పేదే మూజువాణి ఓటు) ఆమోదించవచ్చు. అదే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యంగా సవరణ బిల్లు లాగా ప్రవేశపెడితే, పార్లమెంట్‌లో వోటింగ్ నిర్వహించి ప్రత్యేక మెజారిటీ ద్వారా బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది.

మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది:

ఈ నేపథ్యంలోనే ఏర్పాటుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, 2014 బిల్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం సాధారణ బిల్లు లాగే 13 ఫిబ్రవరి 2014న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చర్చల అనంతరం ఈ బిల్లును 18 ఫిబ్రవరి 2014న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

ఐతే దీనికి అంగీకరించకుండా పలువురు ఎంపీలు డివిజన్ వోట్ (బిల్లుకు అంగీకరించే వారు ఒకసారి, వ్యతిరేకించే వారు ఒకసారి లేచి నిలబడితే వారిని లెక్కించడం) కోరినప్పటికీ, స్పీకర్ అందుకు అంగీకరించలేదని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 18 ఫిబ్రవరి 2014న లోక్‌సభలో, 20  ఫిబ్రవరి 2014న రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.

బీజేపీ ఈ బిల్లు ఆమోదానికి లోక్‌సభ/రాజ్యసభ రెండిట్లో కూడా మద్దతు తెలిపింది. ఐతే కేవలం బీజేపీ మద్దతుతోనే బిల్లు ఆమోదం పొందిందంటే అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ముందుగా ఈ బిల్లుపై పార్లమెంట్‌లో కేవలం మూజువాణి ఓటు జరిగింది. పైగా 2009 జనరల్ ఎన్నికల్లో UPA కూటమి 262 సీట్లు గెలుచుకోగా, బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 159 సీట్లు గెలుచుకుంది (ఇక్కడ మరియు ఇక్కడ). ఆంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, CPM, AIMIM, మొదలైన పార్టీలు మినహాయిస్తే చాలా వరకు ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.

చివరగా, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్‌లో మూజువాణి ఓటుతో ఆమోదించారు.

Share.

About Author

Comments are closed.

scroll