Fake News, Telugu
 

దేశవ్యాప్తంగా టాప్-10 ధనిక మంత్రుల జాబితాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ లేరు

0

‘టాప్-10 ధనవంతుల్లో కేటీఆర్, జగన్’ అంటూ రిపోర్ట్ చేసిన ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: దేశవ్యాప్తంగా అత్యధిక ధనవంతుల మంత్రుల జాబితాలో కేటీఆర్.

ఫాక్ట్(నిజం): దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల ఎన్నికల అఫిడవిట్‌లను పరిశీలించి రూపొందించిన రిపోర్ట్‌లో టాప్-10  ధనవంతుల మంత్రుల జాబితాలో కేటీఆర్ లేరు. ఈ జాబితాలో తెలంగాణ నుండి ఎవరూ లేరు. కాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అత్యధిక అప్పులు కలిగిన మంత్రులు టాప్-10  జాబితాలో ఉన్నారు. వైరల్ అవుతున్న ఈ వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఐతే జరిగిన పొరపాటును గ్రహించి ఆంధ్రజ్యోతి ఈ విషయంలో ఒక సవరణ కూడా విడుదల చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ వార్తను ఆంధ్రజ్యోతి దినపత్రిక 02 ఫిబ్రవరి 2023న ప్రచురించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ విడుదల చేసిన ఒక రిపోర్ట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు ఈ కథనంలో పేర్కొన్నారు.

ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఏడీఆర్ వెబ్‌సైట్‌లో వెతకగా, వారు దేశంలోని 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల మంత్రి మండలిపై విడుదల చేసిన రిపోర్ట్ మాకు లభించింది. ఎన్నికల సమయంలో సమర్పించే అఫిడవిట్‌లను పరిశీలించి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారి క్రిమినల్ కేసులు, ఆస్తి వివరాలు, మొదలైన అంశాలకు సంబంధించి ఈ రిపోర్ట్‌లో విశ్లేషణ చేసారు.

ఐతే వైరల్ న్యూస్ క్లిప్‌లో చెప్తున్నట్టు ఈ రిపోర్ట్‌లో దేశవ్యాప్తంగా టాప్-10  ధనవంతుల మంత్రుల జాబితాలో కేటీఆర్ లేరు. ఈ జాబితాలో తెలంగాణ నుండి ఒక్కరు కూడా లేరు. కాగా, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు ఉన్నారు (ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రజినీ విడదల).

అత్యధిక అప్పులు కలిగిన మంత్రులు జాబితాలో కేటీఆర్ :

కాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అత్యధిక అప్పులు కలిగిన మంత్రులు టాప్-10  జాబితాలో ఉన్నారు. 27 కోట్ల అప్పులతో ఈ లిస్టులో కేటీఆర్ ఆరో స్థానంలో ఉన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం కేటీఆర్ మొత్తం ఆస్తుల విలువ 41 కోట్లు.

దీన్నిబట్టి, వైరల్ న్యూస్ క్లిప్‌లోని వార్త తప్పని స్పష్టమవుతుంది. ఐతే ఆంధ్రజ్యోతి కూడా ఈ విషయంలో పొరపాటును గ్రహించి 03 ఫిబ్రవరి 2023 దినపత్రికలో ఒక సవరణను కూడా విడుదల చేసింది.

చివరగా, దేశవ్యాప్తంగా టాప్-10 ధనిక మంత్రుల జాబితాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ లేరు. కేటీఆర్ అత్యధిక అప్పులు కలిగిన మంత్రులు టాప్-10  జాబితాలో ఉన్నారు.

Share.

About Author

Comments are closed.

scroll