కేవలం చర్చీల నిర్మాణము కొరకు కలెక్టర్ అనుమతి అవసరాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం కేవలం చర్చీల నిర్మాణము కొరకు కలెక్టర్ అనుమతి అవసరాన్ని తొలగించింది.
ఫాక్ట్: మతపరమైన నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ అనుమతి తీసేసి, గ్రామ పంచాయతీ అనుమతికి సంబంధించిన షరతులను తెలంగాణ ప్రభుత్వం 2014లో తీసుకొని వచ్చింది. ఆ ఆర్డర్‌లో ఎక్కడా కూడా కేవలం చర్చీల నిర్మాణం గురించి లేదు. అన్నీ మతపరమైన నిర్మాణాలకు ఆ ఆర్డర్ వర్తిస్తుంది. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్‌లోని ఫోటోలో హైలైట్ చేసిన వ్యాఖ్యంలో రెండు ప్రభుత్వ ఆర్డర్లకి సంబంధించిన పేర్లు ఉన్నట్టు గమనించవచ్చు. ఆ ప్రభుత్వ ఆర్డర్లను ఇక్కడ (2014) మరియు ఇక్కడ (2015 మెమో) చూడవచ్చు. మతపరమైన నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ అనుమతి అవసరం లేదని మరియు గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చేటప్పుడు వర్తించే షరతుల వివరాల గురించి ఆ ఆర్డర్లలో చదవచ్చు.
‘Andhra Pradesh Gram Panchayat Land Development (Lay out and Building) Rules, 2002’ రూల్స్‌కి 2012లో చేసిన సవరణని 2014లో మారుస్తూ, మతపరమైన నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ అనుమతి తీసేసి, గ్రామ పంచాయతీ అనుమతికి సంబంధించిన షరతులను తెలంగాణ ప్రభుత్వం జోడించింది. ఆ ఆర్డర్లలలో ఎక్కడా కేవలం చర్చీల నిర్మాణం గురించి లేదు. అన్ని మతపరమైన నిర్మాణాలకు ఆ ఆర్డర్లు వర్తిస్తాయి.
చివరగా, తెలంగాణ ప్రభుత్వం అన్ని మతపరమైన నిర్మాణాలకు కలెక్టర్ అనుమతి అవసరాన్ని తొలగించింది; కేవలం చర్చీల నిర్మాణాల కొరకు కాదు.