తిరుపతిలో టాటా ట్రస్ట్ సంస్థ నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వై.ఎస్.జగన్ ముఖ్య అతిధిగా వస్తున్నారని తెలిసి రతన్ టాటా ఆ కార్యక్రమానికి రాలేనని చెప్పారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. జగన్‌పై ఆర్ధిక కేసులు ఉండటం, అతను తీసుకున్న నిర్ణయాల వలన పెట్టుబడులు వెనక్కిపోవడం వంటి కారణాల చేతనే రతన్ టాటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడానికి ఇష్టపడలేదని టాటా ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు, అని ఈ పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, తిరుపతిలో టాటా ట్రస్ట్ క్యాన్సర్ సెంటర్ కోసం మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థలం కేటాయించారని, క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవమైన మరుసటి రోజే రతన్ టాటా చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తుతూ ఒక ప్రత్యేక లేఖ రాసినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు.
క్లెయిమ్: తిరుపతిలో నిర్మించిన టాటా ట్రస్ట్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వై.ఎస్. జగన్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో తాను రాలేనని రతన్ టాటా చెప్పారు.
ఫాక్ట్ (నిజం): వై.ఎస్.జగన్ కారణంగా టాటా క్యాన్సర్ సెంటర్ (SVICCAR) ప్రారంభోత్సవానికి రతన్ టాటా రాలేదని టాటా ట్రస్ట్ సంస్థ ఎక్కడా ప్రకటించలేదు. తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణం కోసం 2017లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) టాటా ట్రస్ట్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. క్యాన్సర్ సెంటర్ కోసం కావలిసిన స్థలాన్ని మొత్తం టీటీడీయే సమకూర్చింది. టాటా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి రతన్ టాటా రాకపోవడానికి జగన్ కారణమని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఆవాస్తవమని టాటా ట్రస్ట్ సంస్థ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతికితే, టాటా ట్రస్ట్ సంస్థ తిరుపతిలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ & అడ్వాన్సుడ్ రీసెర్చ్ సెంటరుని (SVICCAR) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 05 మే 2022 నాడు ప్రారంభించినట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలని తెలుపుతూ టాటా ట్రస్ట్ సంస్థ 05 మే 2022 నాడు ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భాగస్వామ్యంతో టాటా ట్రస్ట్ సంస్థ నెలకొల్పిన అలమేలు ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ ఆసుపత్రిని నిర్మించినట్టు ప్రెస్ రిలీజ్‌లో స్పష్టంగా తెలిపారు. తిరుపతిలో నెలకొల్పిన ఈ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాటా ట్రస్ట్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. శ్రీనాథ్ పాల్గొన్నారు. వై.ఎస్.జగన్ కారణంగా టాటా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి రతన్ టాటా రాలేదని టాటా ట్రస్ట్ సంస్థ ఈ ప్రెస్ రిలీజ్‌లో ఎక్కడా పేర్కొనలేదు.
ఈ క్యాన్సర్ సెంటరుకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణం కోసం 2017లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) టాటా ట్రస్ట్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. 2018లో ఈ క్యాన్సర్ సెంటర్ శంకుస్తపాన కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రతన్ టాటా ముఖ్య అతిథులుగా వచ్చారు. కానీ, ఈ క్యాన్సర్ సెంటర్ కోసం కావలిసిన మొత్తం స్థలాన్ని టీటీడీయే సమకూర్చింది. ఈ క్యాన్సర్ సెంటరు కోసం టాటా ట్రస్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యేక ఒప్పందాలేవి కుదుర్చుకోలేదు.
టాటా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రతన్ టాటా రాకపోవడానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టాటా ట్రస్ట్ సంస్థ మాకు ఈ-మెయిల్ ద్వారా స్పష్టం చేసింది.
చివరగా, వై.ఎస్.జగన్ కారణంగా రతన్ టాటా తిరుపతి క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి రాలేదని టాటా ట్రస్ట్ సంస్థ పేర్కొనలేదు.