Fake News, Telugu
 

తాజ్ మహల్ ని 2018-19 లో సుమారు 69 లక్షల మంది సందర్శించారు మరియు దాదాపు 77.9 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది.

1

తాజ్ మహల్ మరియు స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క రెవెన్యూ మరియు వార్షిక పర్యాటకుల సంఖ్యలను పోలుస్తూ సోషల్ మీడియా లో చాలా మంది ఫోటోలు మరియు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ 1: సగటున 7.5 లక్షల పర్యాటకులు ఏటా తాజ్ మహల్ ని సందర్శిస్తే, గత ఒక సంవత్సరంలో 26 లక్షల మంది స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించారు.

ఫాక్ట్ (నిజం): 2018-19 సంవత్సరంలో సుమారు 69 లక్షల మంది తాజ్ మహల్ ని సందర్శించారు. గత 11 నెలల్లో సుమారు 26 లక్షల పర్యాటకులు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించారు . కావున పోస్ట్ లో పోల్చిన లెక్క తప్పు.

క్లెయిమ్ 2: తాజ్ మహల్ యొక్క వార్షిక రెవెన్యూ సగటున 22.3 కోట్ల రూపాయులు అయితే, స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క గత ఒక సంవత్సరపు రెవెన్యూ సుమారు 71.6 కోట్లు.

ఫాక్ట్ (నిజం): 2018-19 సంవత్సరంలో తాజ్ మహల్ యొక్క రెవెన్యూ సుమారు 77.9 కోట్ల రూపాయులు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రారంభించిన 11 నెలల్లో టికెట్లు అమ్మడం ద్వారా సుమారు 71.66 కోట్ల రెవెన్యూ వచ్చింది. కావున పోస్ట్ లో పోల్చిన లెక్క తప్పు.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ – వివరాలు:

స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రారంభించినప్పటి నుండి ఎంత మంది సందర్శించారో తెలుసుకోవడానికి గూగుల్ లో వెతకగా, ‘టైమ్స్ అఫ్ ఇండియా’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రారంభించిన 11 నెలల్లో సుమారు 26 లక్షల మంది పర్యాటకులు సందర్శించినట్టు ఉంటుంది. ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారితో మాట్లాడుతూ, ‘ఇప్పటివరకు 26 లక్షలకు పైగా టికెట్లు అమ్మి, సుమారు 71.66 కోట్ల రుపాయులను సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ వారు సేకరించినట్టు’ రాజీవ్ గుప్తా [Additional Chief Secretary, Forests & Environment Department and Managing Director of Sardar Sarovar Narmada Nigam Ltd (SSNNL)] తెలిపారు. అంతేకాదు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వెబ్ సైట్ లో ఉన్న డాష్ బోర్డు ద్వారా కూడా ఇప్పటివరకు సుమారు 28 లక్షల మంది పర్యాటకులు సందర్శించారని తెలుస్తుంది.

తాజ్ మహల్ – వివరాలు:

తాజ్ మహల్ యొక్క రెవెన్యూ మరియు సందర్శకుల సమాచారం కోసం వెతకగా, లోక్ సభ లో భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన సమాధానం దొరుకుతుంది. ప్రాచీన కట్టడాల పై లోక్ సభలో అడిగిన ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ, కేంద్ర రక్షిత ప్రాచీన కట్టడాల యొక్క రెవెన్యూ మరియు వార్షిక సందర్శకుల గత మూడేళ్ళ వివరాలను ప్రహ్లాద్ సింహ్ పటేల్ [సంస్కృతి మరియు పర్యటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)] తెలిపాడు. ఆ  సమాధానంలో తాజ్ మహల్ గురించి ఇచ్చిన వివరాలను కింద చార్ట్స్ లో చూడవొచ్చు:

రెండింటినీ పోల్చడం:

పోస్టుల్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ గురించి చెప్పిన వివరాలు దాదాపు కరెక్టే, కానీ తాజ్ మహల్ గురించి చెప్పిన వివరాల్లో మాత్రం నిజం లేదు. గత సంవత్సరంలో (2018-19) సుమారు 69 లక్షల మంది తాజ్ మహల్ ని సందర్శిస్తే, కేవలం 7.5 లక్షల మంది తాజ్ మహల్ ని సందర్శించినట్టు పోస్టుల్లో చెప్తున్నారు. 2018-19 లో టికెట్ల ద్వారా తాజ్ మహల్ కి వచ్చిన రెవెన్యూ సుమారు 77.9 కోట్ల రూపాయులు. పోస్టుల్లో తాజ్ మహల్ రెవెన్యూ ని మూడేళ్ళ సగటుగా తీసుకున్నారు. కావున, గత మూడేళ్ళ సగటు తీసుకున్నా, తాజ్ మహల్ యొక్క రెవెన్యూ ఏటా సుమారు 61.4 కోట్ల రూపాయులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి, తాజ్ మహల్ పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా స్టాట్యూ ఆఫ్ యూనిటీ ద్వారా వచ్చే ఆదాయం మూడు రెట్లు ఎక్కువ కాదు.

అంతేకాదు, తాజ్ మహల్ మరియు స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క అంకెలను పోల్చలేము, ఎందుకంటే:

1. తాజ్ మహల్ యొక్క అంకెలు ఆర్ధిక సంవత్సరం (2018-19) ప్రకారం ఉంటే, స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క అంకెలు అక్టోబర్ 31, 2018 (ప్రారంభించిన తేదీ) నుండి అక్టోబర్ 2019 వరకు ఉన్నాయి. కావున రెండిటి అంకెలను పోల్చే సమయ వ్యవధి ఒకటి కాదు.

2. తాజ్ మహల్ మరియు స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క రెవెన్యూలను కూడా పోల్చలేము, ఎందుకంటే తాజ్ మహల్ మరియు స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క టికెట్ ధరలు సమానంగా లేవు. అంతేకాదు, రెండు ప్రదేశాల్లో వివిధ రకాల టికెట్లు అమ్మబడుతున్నాయి.

చివరగా, తాజ్ మహల్ పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా స్టాట్యూ ఆఫ్ యూనిటీ ద్వారా వచ్చే ఆదాయం మూడు రెట్లు ఎక్కువ కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll