Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలని ఒడిశా రాష్ట్రంలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్ మంటలకు ముడిపెడ్తున్నారు

0

ఒడిశా రాష్ట్రంలో 2,750 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న సిమ్లిపాల్ నేషనల్ పార్క్ గత పది రోజులుగా మంటలతో కాలిపోతుండడంతో, లెక్క లేనన్ని మొక్కలు మరియు వన్య ప్రాణులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. మంటలలో కాలిపోతున్న అడివి యొక్క ఫోటోని, మసి రంగులో ఉన్న రెండు పులుల ఫోటోలని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఒడిశా రాష్ట్రంలో మంటలలో కాలిపోతున్న సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లోని దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోలు సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లో ఇటివల మంటలు చెలరేగిన ఘటనకు సంబంధించినవి కావు. మసి రంగులో ఉన్న పులుల యొక్క ఫోటోని, 2020లో ఒడిశా రాష్ట్రంలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ లో తీసారు. పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటో 2019 లో అమెజాన్ అడివిలో చెలరేగిన మంటలకు సంబంధించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా వుంది.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యం కలిగిన ఫోటోని IFS ఆఫీసర్ ప్రవీణ్ కాస్వన్ తన ట్వీట్ లో షేర్ చేసినట్టు తెలిసింది. ప్రవీణ్ కాస్వన్ 12 జూలై 2020 నాడు ఈ ట్వీట్ పెట్టారు. ఒడిశా రాష్ట్రంలోని ఒక అడవిలో ఈ ఫోటో తీసినట్టు ప్రవీణ్ కాస్వన్ తన ట్వీట్ లో తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన IPS ఆఫీసర్ సందీప్ త్రిపాఠి,  ఈ ఫోటోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ లో తీసినట్టు తన ట్వీట్ తెలిపారు.

ప్రవీణ్ కాస్వన్ ట్వీట్ ఆధారంగా ‘The New Indian Express’ ఇదే ఫోటోని తమ ఆర్టికల్ లో పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఇటివల మంటలలో కాలిపోయిన సిమిలిపాల్ నేషనల్ పార్క్ కి సంబంధించింది కాదని చెప్పవచ్చు.

ఫోటో-2:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ 2019లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ దొరికింది. ఈ ఫోటో 2019లో అమెజాన్ అడివిలో చెలరేగిన మంటలకు సంబంధించిందని తెలిపారు.

‘The Gaurdian’ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో కూడా ఈ ఫోటో 2019లో మంటలలో కాలిపోయిన అమెజాన్ అడవికి సంబంధించిందని తెలిపారు. దీనిబట్టి, ఈ ఫోటో ఇటివల ఒడిశా రాష్ట్రంలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లో చెలరేగిన మంటలకి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఒడిశా రాష్ట్రంలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లో గత రెండు వారాలుగా మంటలు చెలరేగుతున్న విషయాన్నీ మీడియా సంస్థలు ఇటివల రిపోర్ట్ చేసారు. దీనికి సంబంధించి పబ్లిష్ చేసిన వీడియోలని ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటోలు ఈ సంఘటనకు సంబంధించినవి కావు.

చివరగా, సంబంధం లేని ఫోటోలని చూపిస్తూ ఒడిశా రాష్ట్రంలో ఇటీవల మంటలలో కాలిపోయిన సిమ్లిపాల్ నేషనల్ పార్క్ యొక్క దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll