Fake News, Telugu
 

జనరల్ స్థానాలు కేవలం జనరల్ కేటగిరీలకి చెందిన వారికి మాత్రమే అన్న వాదనను అనేకసార్లు పలు రాష్ట్ర హైకోర్టులు, సుప్రీంకోర్టు ఖండించాయి

0

‘ఉద్యోగాలలో లేదా విద్యాసంస్థల్లో ప్రవేశాలలో జనరల్ స్థానాలకి వేరే ఇతర కేటగిరిలకి (SC, ST, OBC) చెందినవారు అర్హులుకారని గుజరాత్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పిందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఉద్యోగాలలో లేదా విద్యాసంస్థ ప్రవేశాలలో జనరల్ స్థానాలలో ఇతర కేటగిరిలకి (SC, ST, OBC) చెందినవారు అర్హులు కారని గుజరాత్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పింది.

ఫాక్ట్ (నిజం): ఈ మధ్యకాలంలో గుజరాత్ హైకోర్టు ఇలాంటి తీర్పేది ఇవ్వలేదు. ఐతే SC/ST/SEBCకి చెందిన మహిళా అభ్యర్థి సాధారణ కోటాలో ఎంపికైతే, ఆమెను తన కేటగిరీ (వర్టికల్ రిజర్వేషన్ – ST, SC & OBC రిజర్వేషన్లు వర్టికల్ రిజర్వేషన్లుగా పరిగణిస్తారు) కింద ఎంపికైన మహిళా అభ్యర్థిగా పరిగణించాలని పేర్కొన్న నియమాన్ని రద్దు చేస్తూ 2019లోనే గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు, ఇతర రాష్ట్ర హైకోర్టులు కూడా గతంలో అనేక సార్లు పోస్టులో చెప్తున్న వాదనకి వ్యతిరేకంగా తీర్పులు చెప్పాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఉద్యోగాలలో లేదా విద్యాసంస్థల్లో ప్రవేశాలలో జనరల్ స్థానాలకు ఇతర కేటగిరిలకి (SC, ST, OBC) చెందినవారు అర్హులుకారని ఇటీవల కాలంలో అయితే గుజరాత్ హైకోర్టు అలాంటి తీర్పు ఇవ్వలేదు. ఐతే గుజరాత్ హైకోర్టుతో పాటు పలు రాష్ట్ర హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు సందర్భాలలో ఈ వాదనకి వ్యతిరేకంగా వెలువరించిన తీర్పుల గురించి కింద చూద్దాం.

గుజరాత్ హైకోర్టు 2019 తీర్పు:

గుజరాత్ ప్రభుత్వం 2017లో పోలీస్ ఉద్యోగాల పోలీస్ నియామక పరీక్షలో రిజర్వేషన్ వర్తింపుకు సంబంధించి ‘ఒకవేళ SC/ST/SEBCకి చెందిన మహిళా అభ్యర్థి సాధారణ కోటాలో ఎంపికైతే, ఆమెను తన కేటగిరీ (వర్టికల్ రిజర్వేషన్ – ST, SC & OBC రిజర్వేషన్లు వర్టికల్ రిజర్వేషన్లుగా పరిగణిస్తారు) కింద ఎంపికైన మహిళా అభ్యర్థిగా పరిగణించాలని పేర్కొన్న నియమాన్ని ఛాలెంజ్ చేసిన కేసులో గుజరాత్ హైకోర్టు పోలీస్ నియామక ప్రక్రియలోని ఆ నియమాన్ని రద్దు చేస్తూ, పోస్టులో చెప్పిన వాదనకు వ్యతిరేకంగా 2019లో  తీర్పు చెప్పింది.

ఈ తీర్పులో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో ఒక ఏడు దశల విధానాన్ని పేర్కొంది. కోర్టు ఈ తీర్పులో తమ వాదనకి మద్దతుగా గతంలో వివిధ కోర్టులు వెలువరించిన పలు తీర్పుల గురించి ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఇంద్ర సాహ్ని (సుప్రా), లాల్ రాడా vs అనిల్ జైన్ కేసులో, అనిల్ కుమార్ గుప్తా vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, రాజేష్ కుమార్ దరియా (సుప్రా) మొదలైన కేసులలో పోస్టులో చెప్తున్న దానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుల గురించి గుజరాత్ హైకోర్టు ప్రస్తావించింది.

అలాగే పలు రాష్ట్రాల హైకోర్టులు గతంలో వెలువరించిన తీర్పులను కూడా గుజరాత్ హైకోర్టు ఈ తీర్పులో తమ వాదనకి మద్దతుగా ప్రస్తావించింది. మేఘా శెట్టి vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్, నీలం శర్మ vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులు రాజస్తాన్ హైకోర్టు,  ఆశా రామ్‌నాథ్ ఘోలప్ vs ది ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ / కలెక్టర్ కేసులో బాంబే హైకోర్టు, ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ vs రంజితా రాణా కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు, మొదలైన పలు కేసులలో తీర్పులు కూడా పోస్టులో చెప్తున్న దానికి వ్యతిరేకంగా ఉంది.

సుప్రీంకోర్టు 2020 తీర్పు (సౌరవ్ యాదవ్ vs స్టేట్ అఫ్ ఉత్తరప్రదేశ్):

ఈ మధ్యకాలం కూడా సుప్రీంకోర్టు పోస్టులో చెప్తున్న వాదనకి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. డిసెంబర్ 2020లో సౌరవ్ యాదవ్ vs స్టేట్ అఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఈ వాదనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ నియామక పరీక్షలో  సోనమ్ తోమర్, రీటా రాణి అనే ఇద్దరు అమ్మయిలు OBC- విమెన్ మరియు SC-  విమెన్ కేటగిరీల క్రింద దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలో వీరిద్దరు 276.5949 మరియు 233.1908 మార్కులు సాధించినప్పటికి వీరిద్దరు తమతమ కేటగిరీలలో క్వాలిఫై కాలేకపోయారు. కాకపోతే ఈ పరీక్షలో జనరల్- ఫిమేల్ (అన్ రిజర్వ్‌డ్- ఫిమేల్) కేటగిరీలో, చివరి క్వాలిఫైయింగ్ అభ్యర్థి 274.8298 మార్కులు సాధించారు, ఇది సోనమ్ తోమర్ స్కోరు సాధించిన కంటే తక్కువ. 

ఐతే జనరల్- ఫిమేల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా తాము ఎక్కువ మార్కులు సాధించినందుకు, తమను జనరల్  కేటగిరీలో సెలెక్ట్ చేయాలని వారు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఐతే ఈ కేసుని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఇలాంటి వర్టికల్- హారిజాంటల్ రిజర్వేషన్ ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరైనా అభ్యర్థి తమ వర్టికల్ రిజర్వేషన్ (ST, SC & OBC రిజర్వేషన్లు వర్టికల్ రిజర్వేషన్లుగా పరిగణిస్తారు) అవసరం లేకుండానే క్వాలిఫై అవ్వగలిగే మార్కులు సాధించినప్పుడు, ఆ అభ్యర్థిని తన వర్టికల్ రిజర్వేషన్ పొందకుండానే క్వాలిఫై అయినట్టు పరిగణించాలని, అంటే ఆ అభ్యర్ధిని జనరల్  కేటగిరీలో సెలెక్ట్ అయినట్టు పరిగణించాలని తీర్పు చెప్పింది.

వీటన్నిటిని బట్టి జనరల్ స్థానాలు కేవలం జనరల్ అభ్యర్థులు మాత్రమే అన్న వాదన కోర్టులో నిలవదన్న విషయం స్పష్టమవుతుంది. అలాగే ఇక్కడ గమనించాల్సిన ఏమిటంటే, పోస్టులో మొదట గుజరాత్ హైకోర్టు రిజర్వేషన్‌ని పూర్తిగా రద్దు చేసిందని, ఆ తర్వాత కేవలం జనరల్ స్థానాలకి వేరే ఇతర కేటగిరిలకి (SC, ST, OBC) చెందినవారు అర్హులుకారని గుజరాత్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పిందని రెండు పొంతనలేని విరుద్ధమైనది వ్యాఖ్యలు గమనించొచ్చు. దీన్నిబట్టి పోస్టులోని వాస్తవాల ఆధారంగా సేకరించిన సమాచారం కాదని స్పష్టమవుతుంది.

ఈ వైరల్ వార్తకి మూలం ఏమిటి?

ఐతే ఈ వార్త చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. 2015లో గుజరాత్ హైకోర్టు వెలువరించిన ఒక తీర్పుని తమ వాదనకి మద్దతుగా చెప్తు, ఆ కేసుకి సంబంధించిన వార్తా కథనాన్ని పోస్టులో షేర్ చేస్తున్నారు.

గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2011లో నిర్వహించిన ఉద్యోగ నియామకాల్లో తమతమ కేటగిరిల కింద వయోపరిమితి సడలింపు పొంది, జనరల్ కేటగిరిల కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన కొందరు మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీకి (MRC) చెందినవారిని జనరల్ కేటగిరిల కింద పరిగణించకుండా వారివారి  కేటగిరిల కింద సెలెక్ట్ అయినట్టు ప్రకటించింది. ఐతే ఇలా చేయడం వల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్న కొందరు మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా, 2013లో గుజరాత్  హైకోర్టు జనరల్ కేటగిరిల కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఆ MRC అభ్యర్థులను జనరల్ కేటగిరిల కింద పరిగణించాలని తీర్పు చెప్పింది.

ఐతే  2013లో సింగల్ జడ్జీ వెలువరించిన ఈ తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ చేయడంతో 2015లో డివిజన్ బెంచ్  ఈ తీర్పుని కొట్టేసింది. వయోపరిమితి సడలింపు పొందిన మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీకి (MRC) చెందినవారిని జనరల్ కేటగిరిల కింద పరిగణించకూడదని కోర్టు అభిప్రాయపడింది.

పైన తెలిపిన 2015 గుజరాత్ హైకోర్టు తీర్పును వైరల్ పోస్టులో తమ వాదనకి  మద్దతుగా చూపిస్తున్నారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం, 2015 కోర్టు తీర్పు, కేవలం రిజర్వు కేటగిరీ కింద వయోపరిమితి సడలింపులు పొందిన వారిని మాత్రమే జనరల్ కేటగిరిల కింద పరిగణించకూడదని చెప్తుంది, అందరినీ కాదు. ఒకవేళ రిజర్వు కేటగిరీ కింద ఎటువంటి ప్రయోజనాలు పొందకుండా జనరల్ కేటగిరిల కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించినవారిని జనరల్ కేటగిరిలో సెలెక్ట్ అయినట్టు పరిగణిస్తారు. దీన్నిబట్టి వైరల్ అవుతున్న వార్తకి కారణం 2015 తీర్పుని తప్పుగా అర్ధం చేసుకోవడం అని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, జనరల్ స్థానాలు కేవలం జనరల్ కేటగిరీలకి చెందిన వారికి మాత్రమే అన్న వాదనను అనేకసార్లు పలు రాష్ట్ర హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు ఖండించాయి.

Share.

About Author

Comments are closed.

scroll