‘ఇండియా అని కాకుండా జూన్ 15 నుంచి అన్ని భాషల్లోనూ భారత్ అని మాత్రమే రాయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘ఇండియా అని కాకుండా జూన్ 15 నుంచి అన్ని భాషల్లోనూ భారత్ అని మాత్రమే రాయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు’.
ఫాక్ట్ (నిజం): మే 2020లో దేశం పేరుని ఇండియా నుండి భారత్ కి మార్చాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. ఐతే పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎస్.ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రాజ్యాంగంలో ఇప్పటికే దేశాన్ని భారత్ అని కూడా ప్రస్తావించారని, కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ చేయాలని ఆదేశించాలేమంటూ ఈ పిటిషన్ కొట్టివేసింది. కాకపోతే పిటిషనర్ అభ్యర్ధన మేరకు పేరు మార్పు విషయంలో ఈ రిట్ పిటిషన్ ఒక ప్రతిపాదనగా స్వీకరించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. 2016 కూడా సుప్రీంకోర్టు ఇలాంటి ఒక పిటిషన్ కొట్టేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
మే 2020లో దేశం పేరుని ఇండియా నుండి భారత్ కి మార్చాలని దాఖలైన ఒక రిట్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతి నిచ్చింది. ఈ పిటిషన్ లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1కి సవరణలు చేయడం ద్వారా దేశం పేరు భారత్ గా మార్చాలని పిటిషనర్ పేర్కొన్నాడు.
ఐతే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎస్.ఏ. బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రాజ్యాంగంలో ఇప్పటికే దేశాన్ని భారత్ అని కూడా ప్రస్తావించారని, కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ చేయాలని ఆదేశించాలేమంటూ ఈ పిటిషన్ కొట్టివేసింది. కాకపోతే పిటిషనర్ అభ్యర్ధన మేరకు పేరు మార్పు విషయంలో ఈ రిట్ పిటిషన్ ఒక ప్రతిపాదనగా స్వీకరించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. 2016లో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి ఒక పిటిషన్ కొట్టేసింది.
ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. 2020లో కూడా ఇదే వార్తా వైరల్ అయినప్పుడు FACTLY దీనిని ఫాక్ట్- చెక్ చేసింది, దీనిని ఇక్కడ చూడొచ్చు.
చివరగా, జూన్ 15 నుంచి ఇండియాకి బదులుగా భారత్ అని రాయాలని సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు.