Fake News, Telugu
 

మోదీ ప్రధాని కాకముందే నలంద విశ్వవిద్యాలయం పునర్నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి

0

19 జూన్ 2024న భారత ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “మన దేశానికి వచ్చిన ఆక్రమణదారులు మన పూర్వీకులు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ అయిన నలందని ధ్వంసం చేశారని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఏ నాయకుడు ఏ నాయకుడు పట్టించుకోలేదని దాదాపు 1000 ఏళ్ల తర్వాత మోదీ ఇటీవల నలంద యూనివర్సిటీని ప్రారంభించారు” అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ధ్వంసమైన పురాతన నలంద విశ్వవిద్యాలయాన్ని మోదీ ప్రధాని అయ్యే వరకు ఏ నాయకుడు లేదా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఫాక్ట్(నిజం): మోదీ ప్రధాని అయ్యే వరకు నలంద  విశ్వవిద్యాలయం  పునర్నిర్మాణం గురించి ఏ నాయకుడు లేదా ప్రభుత్వం పట్టించుకోలేదన్న వాదన పూర్తిగా నిజం కాదు. మోదీ ప్రధాని కాకముందే అంటే మే 2014కు ముందే నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. నలంద విశ్వవిద్యాలయ ఏర్పాటుకు 2010లోనే చట్టం చేసారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన పలు పత్రికా ప్రకటనల ప్రకారం, నలంద విశ్వవిద్యాలయం(NU) స్థాపన కోసం 2వ తూర్పు ఆసియా సదస్సు (EAS)మరియు 4వ తూర్పు ఆసియా సదస్సులలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి నలంద విశ్వవిద్యాలయ చట్టం, 2010 రూపొందించబడింది. ఈ చట్టాన్ని  భారత పార్లమెంటు 2010నలో ఆమోదించింది, అలాగే 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నలంద యూనివర్సిటీకి రూ. 2,727.10 కోట్లు మంజూరు చేసింది. పలు రిపోర్ట్స్ ప్రకారం, ఆగష్టు 2016లో నలంద విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్‌కు అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శంకుస్థాపన చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

19 జూన్ 2024న భారత ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనను మనం గమనిస్తే, పురాతన నలంద విశ్వవిద్యాలయం యొక్క శిధిలాల ప్రదేశానికి సమీపంలోనే రాజ్‌గిర్‌లోని ఆధునిక నలంద విశ్వవిద్యాలయం(NU) నిర్మించినట్లు, ఇది భారత పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడింది తెలుస్తుంది. నలంద విశ్వవిద్యాలయం(NU) స్థాపన కోసం 2వ తూర్పు ఆసియా సదస్సు (EAS) (ఫిలిప్పీన్స్, 2007) మరియు 4వ తూర్పు ఆసియా సదస్సు (థాయ్‌లాండ్, 2009) లలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి నలంద విశ్వవిద్యాలయ చట్టం, 2010 రూపొందించబడింది. 2010లో నలంద యూనివర్శిటీ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినప్పటికీ, ప్రస్తుత ప్రాజెక్టు(నలంద యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌) నిర్మాణం 2017లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పలు రిపోర్ట్స్ ప్రకారం, ఆగష్టు 2016లో నలంద విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్‌కు అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శంకుస్థాపన చేశారు.

నలంద విశ్వవిద్యాలయం కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో నలంద విశ్వవిద్యాలయం చరిత్ర మరియు పునర్నిర్మాణం గురించి అదే విషయాన్ని పేర్కొంది. అలాగే మార్చి 2006లో, బీహార్ రాష్ట్ర శాసనసభ ఉమ్మడి సెషన్‌లో ప్రసంగిస్తున్నప్పుడు, భారత మాజీ రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం పురాతన నలంద విశ్వవిద్యాలయం పునరుద్ధరణను ప్రతిపాదించారని, అదే సమయంలో సింగపూర్ ప్రభుత్వం మరియు తూర్పు ఆసియా సమ్మిట్ (EAS)లోని పదహారు సభ్య దేశాల నుండి పురాతన నలందను పునరుద్ధరించాలని కోరుతూ ఏకకాలంలో ఆలోచనలు వచ్చాయని పేర్కొన్నది. భారత పార్లమెంటు నలంద విశ్వవిద్యాలయ ఏర్పాటు చేస్తూ నలంద విశ్వవిద్యాలయ చట్టం, 2010ని రూపొందించిదని, ఈ చట్టాన్ని పార్లమెంటు 2010నలో  ఆమోదించిందని, సెప్టెంబర్ 2014లో నలంద విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్ విద్యార్థుల నమోదు జరిగింది అని పేర్కొన్నది.

రిపోర్ట్స్ ప్రకారం, 2010లో అప్పటి UPA ప్రభుత్వం హయంలో నలంద విశ్వవిద్యాలయం బిల్లు, 2010ను 12 ఆగస్టు 2010న అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి S.M. కృష్ణ రాజ్యసభలో ప్రవేశపపెట్టారు. ఈ బిల్లును 26 ఆగస్టు 2010న లోక్‌సభ మరియు 21 ఆగస్టు 2010న రాజ్యసభ ఆమోదించాయి. అలాగే 21 సెప్టెంబర్ 2010న భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజిట్ విడుదల చేయబడింది.

2014లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనల ప్రకారం అప్పటి యూపీఏ ప్రభుత్వం నలంద విశ్వవిద్యాలయం పునర్నిర్మాణం కొరకు రూ.2,727.10 కోట్లు మంజూరు చేసింది. (ఇక్కడ & ఇక్కడ). దీన్ని బట్టి ధ్వంసమైన పురాతన నలంద విశ్వవిద్యాలయాన్ని మోదీ వచ్చే వరకు ఏ నాయకుడు లేదా ప్రభుత్వం పట్టించుకోలేదు అనే వాదనలో పూర్తిగా నిజం లేదని, మే 2014కు ముందే నలంద విశ్వవిద్యాలయం పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరిగాయని మనం నిర్థారించవచ్చు.

చివరగా, మోదీ ప్రధాని అయ్యే వరకు నలంద విశ్వవిద్యాలయం పునర్నిర్మాణం గురించి ఏ నాయకుడు లేదా ప్రభుత్వం పట్టించుకోలేదన్న వాదన పూర్తిగా నిజం కాదు, మోదీ ప్రధాని కాకముందే అంటే మే 2014కు ముందే నలంద  విశ్వవిద్యాలయం పునర్నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.

Share.

About Author

Comments are closed.

scroll