Fake News, Telugu
 

ఈ వీడియోలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయలేదు

0

“సైకిల్ గుర్తు పక్కన బటన్ నొక్కి, కొత్త పాకిస్తాన్ స్థాపిద్దాం”, అని సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు పలుకుతూ  ఉత్తర ప్రదేశ్ ముస్లింలు నినాదాలు చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ‘నవ భారత్ టైమ్స్’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఈ వీడియోని బీజేపీ నాయకుడు వై. సత్య కుమార్ తన ట్విట్టర్ హ్యండిల్‌లో షేర్ చేస్తూ, ఈ సంఘటన సమాజ్‌వాదీ పార్టీ కాన్పూరులో నిర్వహించిన ఒక ర్యాలీలో చోటుచేసుకున్నది అని తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సమాజ్‌వాదీ పార్టీ ర్యాలీలో ముస్లిం కార్యకర్తలు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): బితూర్ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మునీంద్ర శుక్లా ఈ ర్యాలీకి సంబంధించిన స్పష్టమైన వీడియోని తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకి సంబంధించి చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని మునీంద్ర శుక్లా స్పష్టం చేసారు. బితూర్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫిసర్ (ARO) ఈ వివాదంపై స్పందిస్తూ మునీంద్ర శుక్లా టిక్రా గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో అతని మద్దతుదారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినదాలు చేయలేదని స్పష్టం చేసారు. అంతేకాదు, ‘నవ భారత్ టైమ్స్’ వార్తా సంస్థ తాము పెట్టిన ట్వీట్‌ని డిలీట్ చేసి, మునీంద్ర శుక్లా ర్యాలిలో పాకిస్తాన్ అనుకూల నినాదాల గురించి రిపోర్ట్ అయిన సమాచారం తప్పని ఆర్టికల్ పబ్లిష్ చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

‘నవ భారత్ టైమ్స్’ వార్తా సంస్థ ఈ వీడియోని ట్వీట్‌ (ఇప్పుడు ఆ  ట్వీట్‌ని తొలగించారు) చేస్తూ, వీడియోలోని ఘటన బితూర్ నియోజకవర్గం టిక్రా గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మునీంద్ర శుక్లా నిర్వహించిన ర్యాలీలో చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకి సంబంధించిన స్పష్టమైన సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన స్పష్టమైన వీడియోని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మునీంద్ర శుక్లా తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. మునీంద్ర శుక్లా షేర్ చేసిన ఈ వీడియోలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, “మొహర్ మారో తాన్ కే, సైకిల్ కో పహచాన్ కే, మాటి చోర్ భగాన హే” నినాదాలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియోలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఎక్కడా చేయలేదు. టిక్రా గ్రామంలో తాను నిర్వహించిన ప్రచార కార్యక్రమంలోని వీడియోని సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో షేర్ చేస్తున్నారని మునీంద్ర శుక్లా వీడియో ద్వారా స్పష్టం చేసారు.  

ఈ వీడియోకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల గురించి మునీంద్ర శుక్లా బితూర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేసారు. ప్రతిపక్ష పార్టీలు తన గురించి తన ప్రచార కార్యక్రమాల గురించి ప్రజలకు అవాస్తవ సమాచారాన్ని తెలపడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలని సృష్టిస్తున్నారని మునీంద్ర శుక్లా తన కంప్లైంటులో ఆరోపించారు. బితూర్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫిసర్ (ARO) ఈ వివాదంపై స్పందిస్తూ, టిక్రా గ్రామంలో మునీంద్ర శుక్లా నిర్వహించిన ర్యాలిలో సమాజ్‌వాదీ కార్యకర్తలు “పాకిస్తాన్ జిందాబాద్” అనే నినదాలేవీ చేయలేదని స్పష్టం చేసారు.  

అంతేకాదు, సమాజ్‌వాదీ పార్టీ ర్యాలిలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్టు పబ్లిష్ అయిన వార్తా రిపోర్టులు తప్పని తేలాయని ‘నవ భారత్ టైమ్స్’ 05 ఫిబ్రవరి 2022 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. కాన్పూర్ జిల్లా ‘ఫ్లయింగ్ స్క్వాడ్ టీం’ (FST) ఈ వీడియోకి సంబంధించి జరిపిన దర్యాప్తులో,  బితూర్ నియోజకవర్గంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పాకిస్తాన్ అనుకూల నినాదాలేవి చేయలేదని నివేదికలో తెలిపింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఈ వీడియోలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఏవి చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll