‘బ్రేకప్ చెప్పిన అమ్మాయిలని నరికేసినా తప్పులేదు అని సుప్రీమ్ కోర్టు ఆదేశాలు వ్యక్తం చేసింది’ అని చెప్తూ, ‘NTV’ లోగో తో ఉన్న ఒక ఆర్టికల్ ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బ్రేకప్ చెప్పిన అమ్మాయిలని నరికేసినా తప్పులేదని చెప్పిన సుప్రీం కోర్టు.
ఫాక్ట్ (నిజం): బ్రేకప్ చెప్పిన అమ్మాయిలని నరికేసినా తప్పులేదని సుప్రీమ్ కోర్టు చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోస్ట్ లోని ఆర్టికల్ ని ‘NTV’ వార్తాసంస్థ ప్రచురించినట్టు కూడా వారి వెబ్ సైట్ లో లభించలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, సుప్రీం కోర్టు అలాంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చి ఉంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు ఆ తీర్పు గురించి ప్రచురించేవి. సుప్రీం కోర్టు వెబ్సైటులో కూడా కీ-వర్డ్స్ తో వెతకగా, అలాంటి తీర్పును ఇచ్చినట్టుగా ఆధారాలు దొరకలేదు. దేశ ప్రజలందరికి భారత రాజ్యాంగం జీవించే హక్కుని (“No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law.”) కల్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆత్మరక్షణ కొరకు ఎదుటి వారిని చంపే హక్కు మాత్రం ప్రజలకు ఉంటుందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కానీ, బ్రేకప్ చెప్పినందుకే అమ్మాయిలని చంపేయమని సుప్రీం కోర్టు చెప్పినట్టు ఎక్కడా దొరకలేదు.
అంతేకాదు, పోస్ట్ లోని ఆర్టికల్ ని ‘NTV’ వార్తాసంస్థ ప్రచురించినట్టు కూడా వారి వెబ్ సైట్ లో ఎటువంటి వివరాలు లభించలేదు. ‘NTV’ వార్తల టెంప్లేట్ వేరేలా ఉన్నట్టు వారి వెబ్ సైట్ లో చూడవొచ్చు. పోస్ట్ చేసిన ఫోటోలో టైటిల్ వెనకాల ‘EDITOGRAPHY’ అని రాసి ఉన్నట్టు కూడా గమనించవొచ్చు.
చివరగా, బ్రేకప్ చెప్పిన అమ్మాయిలని నరికేసినా తప్పులేదని సుప్రీం కోర్టు చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.