‘కోటి మంది కొరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించాము’ అని ప్రధాని మోదీ అన్నాడు అంటూ ‘India TV’ వారి స్క్రీన్ షాట్ తో కూడిన పోస్టుని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్ ను పెట్టి, ‘దేశంలో కొరోనా బాధితులు రెండు లక్షలు కూడా లేనప్పుడు, కోటి మందికి ఎలా చికిత్స చేయించారు’ అని ప్రశ్నిస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్: కోటి మంది కొరోనా బాధితులకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించిందని చెప్పిన ప్రధాని మోదీ.
ఫాక్ట్ (నిజం): ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాంలో మాట్లాడుతూ, ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో లబ్ధిదారుల సంఖ్య కోటి దాటింది అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోటి మంది కొరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించిందని తను ఎక్కడా కూడా చెప్పలేదు. కావున పోస్టులో చెప్పింది తప్పు.
పోస్టులో ఉన్న క్లెయిమ్ కోసం వెతికినప్పుడు మోదీ ఎక్కడ కూడా అలా అనలేదని తెలిసింది. మోదీ తన ‘మన్ కి బాత్’ ప్రోగ్రాంలో కొరోనా నియంత్రించడంలో ప్రభుత్వ పనులను కొనియాడారు. అలాగే, ‘ఆయుష్మాన్ భారత్’ పథకం యొక్క లబ్ధిదారుల సంఖ్య కోటి దాటింది అని తన హర్షాన్ని వ్యక్తపరిచారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను ‘‘మన్ కి బాత్’ వీడియోలో 18:03 సెకెన్ల దగ్గర వినవచ్చు. ఈ సమాచారాన్ని మనం ‘PM INDIA’ వెబ్సైటులో మరియు ‘PMO India’చేసిన ట్వీట్లో కూడా మనం చూడవొచ్చు.
అంతేకాదు, ‘India TVHindi’ వారు కూడా టెలికాస్ట్ లో తమ వల్ల తప్పు జరిగిందని చెప్తూ ట్వీట్ చేసారు.
చివరిగా, కోటి మంది కొరోనా బాధితులకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించిందని ప్రధాని మోదీ చెప్పలేదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?