Fact Check, Fake News, Telugu
 

భారతదేశంలో భారతీయులే మీడియా సంస్థలు నడపాలని కోరుతూ సుప్రీం కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్ వేయలేదు

0

సుప్రీం కోర్టులో ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిల్ (‘PIL’ – Public interest litigation) ఫలితంగా భారతదేశంలో భారతీయులు మాత్రమే న్యూస్ ఛానల్స్ మరియు మీడియా సంస్థలు నడపాలని సుప్రీమ్ కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిందని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): సుప్రీం కోర్టులో ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిల్ ఫలితంగా భారతదేశంలో భారతీయులు మాత్రమే న్యూస్ ఛానల్స్ మరియు మీడియా సంస్థలు నడపాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

ఫాక్ట్ (నిజం):  పోస్ట్ లో చెప్పినట్టు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నోటీసు జారీ చేయలేదు. అంతేకాదు, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అలాంటి పిల్ సుప్రీం కోర్టులో వేయలేదు. కాకపోతే, ‘The Press and Registration of Books Act, 1867’ చట్టంలో ‘ఎడిటర్’ కి సంబంధించి ఉన్న సెక్షన్ ని సరిగ్గా వివరించి, కేవలం భారతీయ పౌరులనే భారతీయ మీడియా సంస్థలకు ఎడిటర్లగా నియమించేటట్టు చూడమని కోరుతూ 2013 లో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసాడు. కానీ, ఆ పిటిషన్ పై కోర్టు తీర్పు ఇస్తూ, ఈ విషయం పై తగిన చట్టం చేసే బాధ్యతని పార్లమెంట్ కే అప్పగించింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, సుప్రీం కోర్టు లో అలాంటి పిల్ ని సుబ్రహ్మణ్య స్వామి వేసినట్టుగా కానీ, సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి అటువంటి నోటీసు జారీ చేసినట్టుగా కానీ ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు. కాకపోతే, ‘The Press and Registration of Books Act, 1867’ చట్టంలో ‘ఎడిటర్’ కి సంబంధించి ఉన్న సెక్షన్ ని సరిగ్గా వివరించి, కేవలం భారతీయ పౌరులనే భారతీయ మీడియా సంస్థలకు ఎడిటర్లగా నియమించేటట్టు చూడమని కోరుతూ 2013 లో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది.  అంతేకాదు, అప్పటి ‘ది హిందూ’ పత్రిక ఎడిటర్ సిద్ధార్థ్ వరదరజన్ అమెరికా పౌరుడు కాబట్టి తనను ఒక భారత పత్రిక కు ఎడిటర్ గా ఉండనీయకూడదని పిటిషన్ లో సుబ్రహ్మణ్య స్వామి కోరాడు. ఈ విషయం పై అప్పట్లో  సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్లను కింద చూడవొచ్చు. (ట్వీట్ లింక్స్ – 1, 2, 3, 4, 5).

సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్లలో కూడా తను ఢిల్లీ హైకోర్టులో భారతదేశ పత్రికల ‘ఎడిటర్’ విషయం పై పిటిషన్ వేసానని చెప్పినట్టు చూడవొచ్చు. ఆ పిటిషన్ పై కోర్టు తీర్పు ఇస్తూ, భారత పౌరులు కాని వారు భారతదేశ పత్రికలకు ఎడిటర్లగా ఉండపోవడం మంచిదని, కానీ ఆ విషయం పై తగిన చట్టం చేసే బాధ్యతని పార్లమెంట్ కే అప్పగిస్తున్నామని తెలిపింది. ఆ విషయన్ని సుబ్రహ్మణ్య స్వామి డిసెంబర్ 2013 లో చేసిన ట్వీట్ లో మరియు కోర్టు తీర్పు లో చూడవొచ్చు. అయితే, ఆ తీర్పు ఇచ్చే సమయానికే ‘ది హిందూ’ పత్రిక ఎడిటర్ సిద్ధార్థ్ వరదరజన్ రాజీనామా చేసినందున, తన విషయం పై కోర్టు వ్యాఖ్యలు చేయలేదు. కోర్టు తీర్పు తరువాత ఆ చట్టంలో ఇప్పటివరకు అయితే పార్లమెంట్ ఎటువంటి మార్పు చేయలేదు.

అంతేకాదు, 2015 లో ఒక వ్యక్తి పోస్ట్ లో చెప్పిన విషయం గురించి అడగగా, తను వార్తాపత్రికల విదేశీ ఎడిటర్ల విషయంపై పిటిషన్ వేసినట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలిపాడు.

చివరగా, భారతదేశంలో భారతీయులే మీడియా సంస్థలు నడపాలని కోరుతూ సుప్రీం కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్ వేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll