Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆస్ట్రాజెనెకా – ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఫెయిల్ అవ్వలేదు, కేవలం వాక్సిన్ ట్రయల్స్ కి స్వల్ప విరామం ఇచ్చారు

0

బ్రిటన్-స్వీడిష్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఫెయిల్ అయింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బ్రిటన్-స్వీడిష్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఫెయిల్ అయింది.

ఫాక్ట్(నిజం): ఆస్ట్రాజెనెకా విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్ ప్రకారం UKలో వాక్సిన్ యొక్క మూడో దశ ప్రయోగాలలో భాగంగా ఒక వాలంటీర్ కి జరిగిన ఒక వివరించలేని అనారోగ్యం (వార్తా కథనాల ప్రకారం స్పైనల్ కార్డ్ సమస్య) కారణంగా వాక్సిన్ ట్రయల్స్ ని స్వచ్ఛందంగా స్వల్ప విరామం ప్రకటించారు. దీన్నిబట్టి వాక్సిన్ ప్రయోగానికి విరామం ఇచ్చిన మాట నిజమైనప్పటికి, ఇది ఫెయిల్ అయినట్టు కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ విషయం గురించి మేము గూగుల్ లో వెతకగా 09 సెప్టెంబర్ 2020వ తేదిన ఆస్ట్రాజెనెకా సంస్థ ఈ విషయానికి సంబంధించి విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్ మాకు కనిపించింది. ఈ స్టేట్మెంట్ ప్రకారం UKలో వాక్సిన్ యొక్క మూడో దశ ప్రయోగాలలో భాగంగా జరిగిన ఒక వివరించలేని అనారోగ్య సంఘటన కారణంగా వాక్సిన్ యొక్క భద్రతా డేటాను సమీక్షించడానికి స్వతంత్ర కమిటీని నియమించి, వాక్సిన్ ట్రయల్స్ కి స్వచ్ఛందంగా స్వల్ప విరామం ప్రకటించారు. అంతేగాని ఈ స్టేట్మెంట్ లో ఎక్కడ కూడా వాక్సిన్ ఫెయిల్ అయిందని చెప్పలేదు.

ఐతే ఇది వాక్సిన్ కనిపెట్టే క్రమంలో ఎప్పుడైనా వాక్సిన్ ప్రయోగించిన వారు అనారోగ్యానికి గురైనప్పుడు సాధరణంగా జరిగే చర్య (భద్రతా డేటా సమీక్ష, వాక్సిన్ ట్రయల్స్) అని ఈ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అయితే ఈ వార్తకి సంబంధించిన వార్తా కథనాల ప్రకారం వీరు తయారు చేస్తున్న వాక్సిన్ ప్రయోగాలలో ఒక వాలంటీర్ కి న్యూరోలాజికల్ (స్పైనల్ కార్డ్) సమస్య సంభవించడంతో వాక్సిన్ ట్రయల్స్ కి స్వల్ప విరామం ఇచ్చినట్టు తెలిసింది. అంతేగాని వార్తా కథనాలలో కూడా ఎక్కడ వాక్సిన్ ఫెయిల్ అయిందని చెప్పలేదు.

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి ఆస్ట్రాజెనెకా సంస్థ ఈ వాక్సిన్ ని అభివృద్ధి చేస్తోంది. ఈ వాక్సిన్ ని AZD1222 అని పిలుస్తున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రారంభించిన ‘Operation War Speed’ కార్యక్రమంలో పాల్గొనే అనేక సంస్థలలో ఆస్ట్రాజెనెకా ఒకటి.

చివరగా, ఆస్ట్రాజెనెకా సంస్థ విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో గాని, వార్తా కథనాలలోగాని ఎక్కడ కూడా వాక్సిన్ ఫెయిల్ అయిందని చెప్పలేదు. కేవలం వాక్సిన్ ట్రయల్స్ కి స్వల్ప విరామం మాత్రమే ఇచ్చారు. 

వివరణ (SEPTEMBER 14, 2020):
స్వల్ప విరామం తరువాత వాక్సిన్ ట్రయల్స్ మళ్ళీ UKలో ప్రారంభిస్తున్నామని ఆస్ట్రాజెనెకా సంస్థ 12 సెప్టెంబర్ 2020న విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో తెలిపారు. మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (MHRA) వాక్సిన్ ట్రయల్స్ సురక్షితం అని నిర్ధారించినట్టు కూడా అందులో పేర్కొన్నారు.

Share.

About Author

Comments are closed.

scroll