Fake News, Telugu
 

పాండిచ్చేరి అరియూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఇంటర్మీడియట్ మెరిట్ విద్యార్ధులకు కొంత మందికి మాత్రమే కేవలం ట్యూషన్ ఫీజు మాఫీ చేస్తుంది

0

12వ తరగతి పరీక్షలో 85% మార్కులు సాధించిన విద్యార్ధులకు పాండిచ్చేరి అరియూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఉచిత ఇంజనీరింగ్ శిక్షణ అందిస్తుంది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఈ కోర్సుకు సంబంధించిన మరింత వివరాల కోసం అసిస్టంట్ రిజిస్ట్రార్ శ్రీ దేవనారాయణన్ అనే వ్యక్తిని సంప్రదించాలని ఒక మొబైల్ నంబరును ఈ పోస్టులో జత చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 12వ తరగతి పరీక్షలో 85% మార్కులు సాధించిన విద్యార్ధులకు పాండిచ్చేరి అరియూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఉచిత ఇంజనీరింగ్ విద్య అందిస్తుంది.

ఫాక్ట్: పాండిచ్చేరి అరియూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, ఎంపీసీ సబ్జెక్టులలో 80% మరియు అంతకంటే ఎక్కువ మార్కులతో పాస్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంజనీరింగ్ కోర్సులో 100% ట్యూషన్ ఫీజు మాఫీ చేస్తుంది. ఫేస్‌బుక్ మరియు వాట్సప్లలో తన మొబైల్ నెంబర్ జోడిస్తూ షేర్ చేస్తున్న మెసేజ్లో నిజం లేదని ఆ మొబైల్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తి మాకు స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ మెసేజుకు సంబంధించిన పూర్తి వివరాలు కనుగొనేందుకు పోస్టులో షేర్ చేసిన మొబైల్ నంబరును సంప్రదించగా, సోషల్ మీడియాలో ఉచిత ఇంజనీరింగ్ శిక్షణకు సంబంధించి షేర్ చేస్తున్న ఈ మెసేజులలో ఎటువంటి నిజం లేదని, ఈ మొబైల్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తి మాకు స్పష్టం చేసారు. ఈ మెసేజ్లో తెలుపుతున్న సమాచారం తప్పని, దయచేసి ఈ మెసేజుని షేర్ చేయవద్దని ఆయన విన్నవించుకున్నారు.

ఇంటర్మీడియట్ మెరిట్ విద్యార్దులకు ఉచిత ఇంజనీరింగ్ శిక్షణ కల్పిస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల (SVCET) తమ వెబ్సైటులో ఎక్కడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజుకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా, 2021-22 అకాడమిక్ సంవత్సరంలో తమ కాలేజీ ఎంపీసీ సబ్జెక్టులలో 80% మరియు అంతకంటే ఎక్కువ మార్కులతో పాస్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు 100% ట్యూషన్ ఫీజు మినహాయించిందని SVCET ప్రిన్సిపాల్  మాకు స్పష్టం చేసారు. SVCET ఈ ఆఫరును వచ్చే అకాడమిక్ సంవత్సరంలో కూడా అమలు చేయాలని కాలేజీ యాజమాన్యం యోచిస్తున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే, ఈ మెరిట్ స్కాలర్షిప్ సీట్ల సంఖ్య ప్రతి డిపార్ట్మెంట్లో పరిమితంగా ఉంటాయని, ఎవరు ముందుగా వస్తే వారికి ఆ సీట్లు అందించబడతాయని ప్రిన్సిపాల్ స్పష్టం చేసారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే పూర్తిగా మాఫీ చేస్తుంది. కాలేజిలో ఒక వేళ స్పెషల్ ఫీజు లేదా అక్రిడిటేషన్ ఫీజు కట్టవలిసి ఉంటే అది విద్యార్ధులే చెల్లించుకోవాలి.

చివరగా, పాండిచ్చేరి అరియూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఇంటర్మీడియట్ మెరిట్ విద్యార్ధులకు కొంత మందికి మాత్రమే కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే పూర్తిగా మాఫీ చేస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll