Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం కింద తెలంగాణలో మెడికల్ కాలేజీలకు ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు

0

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి 13 మరియు తెలంగాణకి 7 మంజూరు చేసిందని, వీటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 75% నిధులు కేంద్ర ఇవ్వనుండగా మిగిలిన 25% రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ నిర్మాణానికి కావలిసిన భూమి రూపంలో ఇస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 75% కేంద్ర నిధులతో ఆంధ్రప్రదేశ్ లో 13 మరియు తెలంగాణకి 7 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సితరామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించిన PPP పద్దతిలో మెడికల్ కాలేజీలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించే స్కీం కింద ఇప్పటివరకు తెలంగాణాలో ఏ మెడికల్ కాలేజీకి కూడా కేంద్రం ఆమోదం తెలుపలేదు. ఇంతకు ముందు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో వ్యయాన్ని భరిస్తూ మెడికల్ కాలేజీలను నిర్మించేవారు. ఐతే ఇప్పటివరకు ఈ స్కీం కింద తెలంగాణకి నిధులేవీ విడుదల కాలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది, వీటి నిర్మాణం వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సితరామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రులకి అనుసందానిస్తూ దేశంలోని ప్రతీ జిల్లాకో మెడికల్ కాలేజీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (PPP) పద్దతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే స్కీంని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఆసుపత్రి యొక్క వసతులు నిర్మించబోయే కాలేజీకి అందించి, కాలేజీ నిర్మాణానికి స్థలం అందించడానికి ముందుకొచ్చే రాష్ట్రాలకు కాలేజీ నిర్మాణానికి కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని, ఈ స్కీంకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో రూపొందిస్తామని ఈ ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు.

ఐతే కేంద్ర ఫైనాన్సు మినిస్ట్రీ వైయబిలిటి గ్యాప్ ఫండింగ్ కింద వివిధ సెక్టార్లలో అవలంభించాల్సిన గైడ్లైన్స్ విడుదల చేసింది. లోక్ సభ లో ఇచ్చిన ఒక సమాధానం ప్రకారం PPP కింద మెడికల్ కాలేజీలు ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తెలిపింది. అయితే, ఈ కొత్త స్కీం కింద దేశంలో ఎక్కడా కూడా కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం అయినట్టు సమాచారం లేదు.

సాధారణంగా ఒక మెడికల్ కాలేజీ స్థాపించడానికి అవలంభించే పద్ధతి:

ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (IMC) ఆక్ట్, 1956 మరియు ఈ చట్టానికి 1993 చేసిన సవరణల ప్రకారం ఏదైనా కొత్త మెడికల్ కాలేజీ స్థాపించాలన్న, ఇప్పటికే ఉన్న కాలేజీలో స్టూడెంట్ కెపాసిటీ పెంచాలన్న లేక కొత్త కోర్స్ ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి కావాల్సిన అర్హతలు మరియు పాటించాల్సిన ప్రమాణాలు ఎస్టాబ్లిష్మెంట్ అఫ్  మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్స్,1999 లో సమగ్రంగా వివరించారు.

  • మెడికల్ స్థాపించడానికి ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ఒక దరఖాస్తు సమర్పించాలి.
  • కేంద్ర ప్రభుత్వం ఈ దరఖాస్తుని మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (MCI) కి ఫార్వర్డ్ చేస్తుంది.
  • MCI కొత్త మెడికల్ కాలేజీ స్థాపించాదినికి చేసిన ఎస్టాబ్లిష్మెంట్ అఫ్  మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్స్ ఆధారంగా ఈ అప్లికేషన్స్ ని పరిశీలించి మరియు కాలేజీని సందర్శించి అనుమతిపై నిర్ణయం తీసుకుంటుంది.
  • సాధారణంగా ఒక సంవత్సర కాలానికి మాత్రమే మెడికల్ కాలేజీ స్థాపించి అందులో విద్యార్ధులను చేర్చుకోవడానికి అనుమతినిస్తారు. వార్షిక లక్ష్యాలను చేరుకున్న ఆధారంగా ఈ పర్మిషన్ ని ప్రతీ సంవత్సరం రెన్యూవల్ చేస్తారు.
  • IMC చట్టానికి 2010లో చేసిన సవరణల ఆధారంగా MCI ఒక నిర్దేశిత కాలం వరకు కొత్తగా స్థాపించే మెడికల్ కాలేజీ మరియు దీనికి అనుసందానమైన హాస్పిటల్ ని ప్రతి సంవత్సరం ఇన్స్పెక్షన్ చేసి, వీటి పనులు పూర్తి అయినట్టు నిర్దారణకు వచ్చినాక, ఈ కాలేజీకి అధికారిక గుర్తింపు లేదా పూర్తి స్థాయి అనుమతులు ఇస్తుంది.

ఐతే ఇంతకు ముందు నుండే కేంద్ర ప్రభుత్వం జిల్లా ఆసుపత్రులకు అనుసంధానంగా మెడికల్ కాలేజీలు నిర్మించే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంని అమలు చేస్తూ వచ్చింది. ఈ స్కీం ద్వారా కాలేజీ నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60% భరించగా, రాష్ర ప్రభుత్వాలు మిగిలిన 40% భరిస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకి ఈ స్కీం కింద మూడు ఫేజ్ లలో దేశ వ్యాప్తంగా మొత్తం 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు, 47 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కాగా మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్కీం కింద ఇప్పటి వరకు తెలంగాణకి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ కి మొదటి రెండు ఫేజ్ లలో ఒక్క కాలేజీ మంజూరు కానప్పటికీ, మూడో ఫేజ్ లో మాత్రం మూడు (పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం) మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. ఈ కాలేజీల నిర్మాణ వ్యయం రూ. 325 కోట్లు కాగా ఇందులో కేంద్ర వాటా రూ. 195 కోట్లు. ఐతే ఇప్పటి వరకు కేవలం పాడేరు లో నిర్మించబోయే మెడికల్ కాలేజీకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 53.04 కోట్లు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్మించబోయే కొత్త మెడికల్ కాలేజీలు:

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయించింది, ఇందులో భాగంగా 14 మెడికల్ కాలేజీలకు ఆన్లైన్ ద్వారా ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐతే కొత్త కాలేజీలలో పైన పేర్కొన్న పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం కూడా ఉన్నాయి, అంటే కేవలం ఈ మూడింట్లో మాత్రమే కేంద్ర వాటా ఉంటుంది, మిగతావాటి నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ కాలేజీల నిర్మాణానికి మొత్తం రూ. 7,500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి, దీన్నిబట్టి కూడా ఈ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని అర్ధం చేసుకోవచ్చు. కేంద్రం రాబోయే రోజుల్లో వీటికి ఏదన్నా నిధుల సహాయం చేస్తుందా లేదా అని వేచి చూడాలి.

అలాగే తెలంగాణా ప్రభుత్వం కొత్తగా నాగార్కుర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబ్ నగర్ మరియు కొత్తగూడెంలలో మొత్తం ఏడు మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో మెడికల్ కాలేజీ రూ. 700 కోట్లతో నిర్మించాలని, మొత్తం ఈ ఏడూ కాలేజీల నిర్మాణానికి బడ్జెట్ లో రూ. 5000 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీన్నిబట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే మెడికల్ కాలేజీలలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇప్పటివరకైతే ఏమి లేదని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న కేంద్ర స్కీం ద్వారా గానీ, లేదా కొత్తగా వచ్చిన PPP స్కీం కింద వీటిలో దేన్నైనా కేంద్రం ఆమోదిస్తుందో లేదో చెప్పడానికి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.

PMSSY కింద తెలంగాణాలో మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వ సహాయం

ఇదిలా వుంటే, కేంద్ర ప్రభుత్వ ‘ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్షా యోజన’ (PMSSY) కింద తెలంగాణలోని మెడికల్ కాలేజీలకు కేంద్రం నిధులు ఇచ్చింది. ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల అప్‌గ్రేడ్ కోసం నిమ్స్ (హైదరాబాద్), రిమ్స్ (ఆదిలాబాద్), కే.ఎం.సి (వరంగల్) కి కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఇదే స్కీం కింద బీబీనగర్ లో ఎయిమ్స్ నిర్మాణం కూడా కేంద్ర నిధులతో జరుగుతోంది.

చివరగా, పోస్టులో చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం కింద ఇప్పటి వరకు తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు కాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll