1929 సెంట్రల్ అసెంబ్లీ బాంబు దాడి కేసులో శోభా సింగ్ అనే భారతీయ వ్యాపారి భగత్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి అతనికి ఉరిశిక్ష పడడానికి కారణమయ్యాడని, శోభా సింగ్‌ని అప్పటి భారత ప్రభుత్వం పద్మశ్రీ వంటి అవార్డులతో పాటు అతని జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసిందని చెప్తూ ఒక వీడియో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: భగత్ సింగ్‌కి ఉరిశిక్ష పడడానికి కారణమైన శోభా సింగ్‌ను అప్పటి భారత ప్రభుత్వం పద్మశ్రీ వంటి అవార్డులు ఇచ్చి సత్కరించడమే కాకుండా అతని జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది.
ఫాక్ట్: 1929లో భగత్ సింగ్‌కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తి పేరు ‘ సర్ శోభా సింగ్’ (1890-1978). ఈయన ఒక వ్యాపారవేత్త మరియు రచయిత కుష్వంత్ సింగ్ తండ్రి. సర్ శోభా సింగ్‌కు బ్రిటిష్ ప్రభుత్వం తరపున అనేక సత్కారాలు లభించాయి. ఇక 1983లో భారత ప్రభుత్వం ‘శోభా సింగ్’ (1901-1986) అనే పేరు గల మరొక వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఈయన పంజాబ్‌కు చెందిన ప్రముఖ పెయింటర్. ఈయనకు భగత్ సింగ్ ఉరిశిక్ష కేసుతో సంబంధం లేదు. అతని జ్ఞాపకార్థం 2001లో పోస్టల్ స్టాంపు కూడా జారీ చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా ‘Outlook’ , ‘The New Indian Express’ వెబ్‌సైట్లలో దీనికి సంబంధించిన కథనాలు లభించాయి. ఈ కథనాల ప్రకారం, రచయిత కుష్వంత్ సింగ్ తండ్రి గారైన సర్ శోభా సింగ్(1890-1978) ఢిల్లీలో ఒక వ్యాపారవేత్త. ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు 1929లో సెంట్రల్ అసెంబ్లీ బాంబు దాడి కేసులో భగత్ సింగ్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. తరువాత 1931లో భగత్ సింగ్‌కు లాహోర్ కుట్ర కేసులో ఉరిశిక్ష విధించారు. అయితే, 1930 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం శోభ సింగ్‌కు అనేక సత్కారాలతో గౌరవించింది.
ఇదే విషయాన్ని ‘The Trial of Bhagat Singh’ పుస్తకంలో కూడా చూడవచ్చు.
ఇక, వైరల్ అవుతున్న వీడియోలో చెప్పినట్లు ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వలేదు. అయితే, అదే పేరుతో ఉన్న శోభా సింగ్(1901-1986) అనే మరొక వ్యక్తి 1983లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఈయన పంజాబ్‌కు చెందిన ప్రముఖ పెయింటర్. ఈయనకు భగత్ సింగ్ ఉరిశిక్ష కేసుతో సంబంధం లేదు.
మరియు, 2001లో భారత ప్రభుత్వం పెయింటర్ శోభా సింగ్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపుని కూడా విడుదల చేసింది.
ఈయనకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, భగత్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన శోభా సింగ్ మరియు పద్మశ్రీ పొందిన శోభా సింగ్ ఒక్కరు కాదు.