Fake News, Telugu
 

కోవిడ్-19 బాక్టీరియా ద్వారా సోకుతుందని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పలేదు

0

మే 2025లో సింగపూర్, హాంగ్ కాంగ్, థాయిలాండ్ దేశాలలో కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేరుతో ఉన్న ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. కోవిడ్-19 వైరస్ ద్వారా రాదని, ఈ వ్యాధి రేడియేషన్‌కి గురైన బాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుందని ఈ పోస్టులో చెప్పబడింది. అలాగే, కోవిడ్-19 సోకిన మృత దేహానికి శవపరీక్ష నిర్వహించడం ద్వారా చికిత్సా పద్ధతులను సింగపూర్ ప్రభుత్వం మార్చిందని, ఆస్ప్రిన్, పారాసెటిమాల్ వంటి మందులను వాడితే కోవిడ్-19 నయమవుతుందని ఈ పోస్టులో పేర్కొనబడింది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A screenshot of a screenshot of a news  AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కోవిడ్-19 రేడియేషన్‌కి గురైన బాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఆస్ప్రిన్, పారాసెటిమాల్ వంటి మందులను వాడితే కోవిడ్-19 నయమవుతుందని సింగపూర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

ఫాక్ట్: ఇదొక ఫేక్ పోస్టు. పోస్టులోని వివరాలను తాము విడుదల చేయలేదని సింగపూర్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కోవిడ్-19 SARS-COV-2 అనే వైరస్ ద్వారా సోకుతుంది. అలాగే, ఆస్ప్రిన్, పారాసెటిమాల్ కోవిడ్-19ని నయం చేయలేమని PIB ఫాక్ట్-చెక్ వారు స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దాని ఆధ్వర్యంలో పనిచేసే అంటు వ్యాధుల సంస్థ (CDA) వెబ్సైట్లను పరిశీలించగా కోవిడ్-19 వ్యాధి SARS-COV-2 అనే వైరస్ ద్వారా సోకుతుందని చెప్పబడింది.

ఇక వైరల్ పోస్టు గురించి 2021లోనే సింగపూర్ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. తమ పేరుతో ప్రచారంలో ఉన్న పోస్టు నకిలీదని వారు స్పష్టం చేశారు. కోవిడ్-19 సోకిన మృత దేహానికి శవపరీక్ష నిర్వహించడం ద్వారా చికిత్సా పద్ధతులను మార్చే కార్యక్రమం తాము చెయ్యలేదని వారు స్పష్టం చేశారు.

A screenshot of a message  AI-generated content may be incorrect.

అలాగే, వైరల్ పోస్టులో కోవిడ్-19 మృతదేహాలకు శవపరీక్ష జరపకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా చెప్పబడింది. అయితే, అటువంటి మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసినట్లు ఆధారాలు లేవు. పైగా, కోవిడ్-19 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తల యొక్క జాబితాని కూడా సెప్టెంబర్ 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కోవిడ్-19ని నయం చేయడానికి కచ్చితమైన చికిత్సా విధానాన్ని ఇంకా నిర్ధారించలేనప్పటికీ వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని రకాల మందుల ద్వారా ఈ వ్యాధిని నయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కోవిడ్-19 వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది, యాంటీబయాటిక్స్‌ వైరస్లపై పని చేయవు. అయితే, కోవిడ్-19తో అనారోగ్యానికి గురైన కొంతమందికి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఒక సమస్యగా ఉంటుంది.   ఈ సందర్భంలో, డాక్టర్లు యాంటీబయాటిక్స్‌ను సిఫార్సు చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

A close-up of a white background  AI-generated content may be incorrect.

అలాగే, ఆస్ప్రిన్, పారాసెటిమాల్ కోవిడ్-19ని నయం చేయలేమని PIB ఫాక్ట్-చెక్ వారు స్పష్టం చేశారు (ఇక్కడ & ఇక్కడ). జూన్ 2020లో కూడా కోవిడ్-19ని బాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుందని, దాన్ని ఆస్ప్రిన్ ద్వారా నయం చేయవచ్చని ఇటలీకి ముడిపెడుతూ ఒక పోస్టు వైరల్ కాగా, అది అవాస్తవమని నిరూపించిన FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, కోవిడ్-19 బాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుందని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ఒక నకిలీ పోస్టు ప్రచారంలో ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll