Fake News, Telugu
 

భారత పార్లమెంట్ క్యాంటీన్‌లో దొరికే ఆహార పదార్థాల రేట్లు ఈ పోస్టులో షేర్ చేస్తున్న రేట్లకంటే ఎక్కువే

0

భారతదేశంలో అతి తక్కువ ధరలకు ఆహారం దొరికే ప్రదేశం భారత పార్లమెంట్ క్యాంటీన్ అంటూ కొన్ని ఆహార పదార్థాల రేట్లు ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశంలో అతి తక్కువ ధరలకు ఆహారం దొరికే ప్రదేశం ఇండియన్ పార్లమెంట్ క్యాంటీన్, అక్కడ కొన్ని ఆహార పదార్థాల రేట్లు.

ఫాక్ట్: డిసెంబర్ 2019లో, లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లా మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు “ఏకగ్రీవంగా” సబ్సిడీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. 2021 నుండి ఉన్న పార్లమెంటు క్యాంటీన్‌కు సంబంధించిన సబ్సిడీ అమలులో లేదు. టీ 5 రూపాయలు, సూప్ 25, వెజ్ మీల్ 100 , చపాతీ మూడు, చికెన్ కర్రీ 75 మరియు చికెన్ బిర్యానీ 100 రూపాయలుగా ఉంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.      

భారత పార్లమెంట్ క్యాంటీన్ కి సంబంధించి ఇంటర్నెట్‌లో వెతకగా, 2021లో కొత్త రేట్ల లిస్టు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. కొత్త రేట్ల ప్రకారం, టీ, సూప్, వెజ్ మీల్, చపాతీ, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ మరియు ఇతర ఆహార పదార్థాల యొక్క రేట్లు పెరిగినట్టు చూడొచ్చు. 2021 నుండి ఉన్న పార్లమెంటు క్యాంటీన్‌కు సంబంధించిన సబ్సిడీ అమలులో లేదు. రేట్లు పెరిగినా కానీ బయట మార్కెట్లో ఉన్న రేట్ల కంటే కొంచం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది.

2015లో పార్లమెంటు క్యాంటీన్‌కు సంబంధించి సబ్సిడీపై పెద్ద దుమారం చెలరేగింది, సుభాష్ అగర్వాల్ ఆర్‌టిఐ ఫైల్ చేసినప్పుడు ప్రతి సంవత్సరం క్యాంటీన్‌కు రూ. 14 కోట్ల సబ్సిడీ లభిస్తుందని తెలిసింది. తదనంతరం 2016లో, ఆరేళ్ల విరామం తర్వాత ధరలు సవరించబడ్డాయి మరియు క్యాంటీన్‌ను “No Profit No Loss” ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించారు.

డిసెంబర్ 2019లో, లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లా మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు “ఏకగ్రీవంగా” సబ్సిడీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.

పార్లమెంటు క్యాంటీన్‌ను 52 సంవత్సరాలుగా (2021 వరకు) ఉత్తర రైల్వే నిర్వహించింది. ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ద్వారా ఇప్పుడు క్యాటరింగ్ జరుగుతుంది.

చివరగా, భారత పార్లమెంట్ క్యాంటీన్‌లో దొరికే ఆహార పదార్థాల రేట్లు ఇలా షేర్ చేస్తున్న దానికంటే ఎక్కువే.

Share.

About Author

Comments are closed.

scroll